అడవి మార్కు పార్కు!
భూటాన్
ఆనందమంటే కొత్త ఫ్యాషన్లోనో, లేటెస్ట్ ఐఫోన్లోనో ఉండదని భూటాన్ ప్రజల్ని చూశాకే తెలుస్తుంది. ఉన్నదాంతో తృప్తిపడటం... టీవీ, రేడియో, ఇంటర్నెట్ కాలుష్యాల్ని పట్టించుకోకపోవటం... దేశంలో 50 శాతం భూ భాగాన్ని జాతీయ పార్కుగా రక్షించటం... దేశాభివృద్ధిని గ్రాస్ నేషనల్ హ్యాపినెస్‌లో కొలవటం... ఇవన్నీ భూటాన్‌లో మాత్రమే సాధ్యం. భూటాన్‌లో చాలా భాగంలో జనావాసాలుండవు. పర్యాటకులు అక్కడికి వెళితే... జనారణ్యంలో లేని ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తుంది. మరో చిత్రం... అక్కడ పేద-గొప్ప తారతమ్యాలు తక్కువ. పండగల్లో రాజ కుటుంబీకులూ సామాన్యులతో ఆడిపాడతారు.
ఒకోసారి యాత్రికులనూ కలుస్తారు. భూటానీల్లో మూడింట రెండొంతుల మంది రోజుకు కనీసం 8 గంటలు విశ్రాంతి తీసుకుంటారు. వాహనాలూ తక్కువ. కాలుష్యాన్ని వదిలే కంపెనీలూ తక్కువే. అందుకే ఆరోగ్యం వారి సొంతం. ప్రపంచంలో అత్యంత మారుమూల ఆలయమేదంటే... భూటాన్లోని పారో తక్సంగ్ లేదా టైగర్స్ నెస్ట్‌ను చెప్పుకోవాలి. కష్టపడి అక్కడికి చేరితే... ఆ కష్టాన్నంతా మరిచిపోవచ్చంటారు సందర్శకులు. ఇక్కడికి వెళితే భూటాన్ ప్రజల ఆనందానికి కారణం కూడా తెలుస్తుందంటారు.
మనకైతే వీసా అక్కర్లేదు. మరి వెళ్దామా?
ఎలా వెళ్లాలి?
* భూటాన్‌కు విమాన సర్వీసులు పెద్దగా లేవు. ‘పారో’ విమానాశ్రయం ఒక్కటే కొన్ని దేశాలను కలుపు తోంది. దేశంలో ఢిల్లీ, కోల్‌కతాల నుంచి మాత్రమే విమానాలున్నాయి. ముందుగా బుక్ చేసుకుంటే ఢిల్లీ నుంచో, కోల్‌కతా నుంచో తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.15వేల లోపే ఉంటాయి.
* రైలు మార్గంలో వెళ్లేవారైతే మొదట కోల్‌కతా, కాన్పూర్, రాంచీ, ఢిల్లీ వంటి ప్రాంతాలకు చేరుకోవాలి. అక్కడి నుంచి న్యూజల్పాయ్‌గురికి రైలు సర్వీసులు ఎక్కువే ఉన్నాయి. న్యూజల్పాయ్‌గురి జిల్లాలోని హషిమొర రైల్వే స్టేషన్లో దిగితే... అక్కడి నుంచి భూటాన్ 17 కిలోమీటర్ల దూరం.
* హషిమొర నుంచి క్యాబ్‌లు, జీప్‌లు, బస్సులు ఎక్కువే. అక్కడి నుంచి సరిహద్దుల్లో ఉన్న జైగామ్‌ను చేరుకోవాలి. అక్కడే చెక్‌పోస్టు. భూటాన్లోకి ప్రవేశించడానికి పర్మిట్ ఇచ్చేదిక్కడే. ఈ పర్మిట్ థింపు, పారో ప్రాంతాలకే వర్తిస్తుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ప్రత్యేకంగా చెప్పాలి.
* ఇండియాకు చెందిన కారులో భూటాన్ వెళ్లొచ్చు గానీ... దానిక్కూడా పర్మిట్ ఉండాలి. లేదంటే స్థానిక టూర్ ఆపరేటర్ సాయం తీసుకోవచ్చు.
* వీసా అక్కర్లేదు కానీ... ఐడెంటిఫికేషన్ కోసం పాస్‌పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉండాలి.
ఏ సీజన్లో వెళ్లొచ్చు?
* మార్చి, ఏప్రిల్, మే, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో అటు తీవ్రమైన చలి, ఇటు తీవ్రమైన ఎండలు ఉండవు. ఇదే మంచి సమయం. - రద్దీని తప్పించుకోవటానికైతే కాస్త చలి ఎక్కువైనా డిసెంబరు, జనవరి ఫిబ్రవరి నెలలు ఉత్తమం.
* అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను బట్టి చూస్తే... అన్నినెలల్లోనూ ఇక్కడికి పర్యాటకులు వస్తూనే ఉన్నారు.