నాలుగు దారులు
బౌద్ధ వాణి
ఒక అడవిలో నాలుగు రకాల జింకలున్నాయి. ఆ అడవిని ఆనుకొని ఒక రైతు తన పొలంలో బాగా ఏపుగా పచ్చగడ్డి పెంచాడు. ఆ గడ్డిని చూసి ఆశపడ్డ కొన్ని జింకలు వచ్చి పొలంలో పడి మేస్తూ, రైతు పన్నిన వలల్లో పడి, రైతుకి చిక్కాయి. అలా చిక్కిన జింకల్ని చూసిన కొన్ని జింకలు పచ్చగడ్డి అంటేనే భయపడిపోయి, నట్టడివిలోకి పారిపోయాయి. అక్కడ వాటికి ఆహారం దొరక్క, తిరిగి మరల వచ్చి, అదే పొలంలో మేస్తూ, రైతుకు చిక్కాయి. ఈ రెండు జింకల్ని చూసిన కొన్ని జింకలు, అడవిలో పొదలమాటున దాగి, రైతు లేడని తెలుసుకుని, జాగ్రత్తగా వచ్చి మేస్తూ ఉండేవి.
ఇలా మేస్తున్న జింకల స్థావరాల్ని వెదికి, కనుగొన్న రైతు, వాటి స్థావరాల దగ్గరే వలపన్ని వాటినీ పట్టుకున్నాడు. ఇక కొన్ని జింకలు మాత్రం తమ స్థావరాలని ఆ రైతు కనిపెట్టనంత దూరానికి పోయి, అతనికి చిక్కకుండా, పొలంలో పట్టుబడకుండా కాపాడుకున్నాయి. జ్ఞానంతో, ధైర్యంగా జీవించాయి– అని, బుద్ధుడు ఈ కథ చెప్పి, ‘‘భిక్షువులారా! మనుషుల్లో విషయలోలత్వం కలిగిన దురాశాపరులు మొదటి రకం జింకలవంటివారు. విషయాలపట్ల భయపడి సమాజానికి దూరంగా అడవులకు పోయి, శరీరాన్ని ఎండకట్టుకుని ఫలితం లేదని తెలుసుకుని, తిరిగి మరలా ఆశల వలలో చిక్కుకునేవారు రెండోరకం వారు. వాదవివాదాలు, తర్కవితర్కాలే జ్ఞానంగా భావించి, కేవలం ఆచరణ లేని సిద్ధాంత రాద్ధాంతాలు ఎరిగిన వారు మూడోరకం వారు.
కోర్కెల్ని అదుపులో ఉంచుకుని, తనను తాను తెలుసుకుని, తనను తాను పరిశుద్ధి చేసుకునేవారు నాలుగో రకం జింకలవంటివారు’’ అని ప్రబోధించాడు.
ఏది మేలైన మార్గమో తెలుసుకున్న భిక్షువులు బుద్ధునికి ప్రణామం చేశారు.
– డాక్టర్ బొర్రా గోవర్ధన్