వర్షాకాలం చర్మ సమస్యలు తరచూ బాధిస్తుంటాయి. అయితే వంటగదిలో వాడే కొన్ని దినుసులు, పదార్థాలతో చర్మం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అవి ఏమిటో చూద్దాం.
►వర్షంలో తడిసి ఇంటికి రాగానే మంచి నీటితో ముఖాన్ని తప్పక శుభ్రపరుచుకోవాలి. రాత్రి పడుకునేముందు రోజ్‌వాటర్‌ని దూదితో అద్దుకొని ముఖమంతా తుడిచి, నీటితో కడిగేయాలి. ఈ జాగ్రత్తల వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడి చర్మ కాంతి పెరుగుతుంది.
►ఈ కాలం ఫౌండేషన్, పౌడర్లను ఎంత తక్కువ వాడితే చర్మానికి అంత మంచిది. నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్లను కూడా తగ్గించాలి. తరచూ నీళ్లలో తడవడం వల్ల చర్మంపై పోర్స్ (రంధ్రాలు) తెరుచుకుంటాయి. ఇలాంటప్పుడు ఫౌండేషన్, పౌడర్ పోర్స్‌లోకి వెళ్లిపోయి ముఖం జిడ్డుగా మారే అవకాశం ఉంది. దీని వల్ల మొటిమలు, యాక్నె సమస్యలు తలెత్తుతాయి.
►టొమాటో రసం ముఖానికి, చేతులకు రాసుకుని ఆరిన తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మంపై జిడ్డు తగ్గుతుంది. పైనాపిల్, యాపిల్, బొప్పాయి, పుచ్చకాయ గుజ్జు లేదా జ్యూస్‌లను కూడా ఈ విధంగా వాడుకోవచ్చు.
►ఓట్స్‌లో తేనె, పెరుగు, ఆరెంజ్ జ్యూస్ కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేసి ముఖానికి చేతులకు, పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మకాంతి పెరుగుతుంది.
►తేనె, ఆలివ్ ఆయిల్, పెరుగు సమపాళ్లలో కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని పదినిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మం పొడిబారదు. పొడి చర్మానికి ఇది మేలైన ప్యాక్. పొడి చర్మం గలవారు బాదంపప్పు పొడి, తేనె కలిపి కూడా వాడుకోవచ్చు. జిడ్డు చర్మం గలవారైతే ఆరెంజ్ ఆయిల్, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి ప్యాక్ వేసుకోవాలి.
►ఈ కాలం రకరకాల అలర్జీలు తలెత్తుతుంటాయి. ఇవి చర్మం సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కూరగాయలు, పండ్లు గల సమతుల ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి.
►ఈ కాలం దాహంగా అనిపించదు. కానీ, రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పక తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు పడడం సమస్య దరిచేరదు. చర్మం పొడిబారి జీవం లేకుండా ఉంటే పైపైన మాయిశ్చరైజర్ వాడాలి. జిడ్డు చర్మం అయితే రోజుకు రెండు సార్లు తప్పక శుభ్రపరుచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment