ఫుల్‌టైమ్ పార్టీవేర్
సంప్రదాయ వేడుకలు సరేసరి. వాటి హంగులు, ఆర్భాటాలు అన్నీ ఇన్నీ కావు. ఎంత గాడీగా తయారైనా పట్టింపులేవీ ఉండవు. ప్రత్యేకత అంటే మాత్రం ఆధునిక వ్రస్త్రధారణలోనే చూపించడానికి వీలౌతుంది. గెట్ టుగెదర్, బర్త్‌డే, ఈవెనింగ్.. వంటి వేడుకలకు హాజరవ్వాలంటే ఆ పార్టీకి తగ్గ ప్రత్యేకమైన వస్త్రధారణ కచ్చితంగా ఉండాలి. అప్పుడే స్టైల్‌గా ఫ్యాషన్ తెలిసిన వ్యక్తులుగా మిమ్మల్ని మీరు నలుగురిలో స్పెషల్‌గా నిలుపుకోగలుగుతారు. అందుకే ఎండాకాలం కాటన్స్, వర్షాకాలం షిఫాన్స్ అంటూ ఒక విభాగానికే పరిమితం అవకుండా ఏ కాలమైనా, ఏ సమయమైనా పార్టీలకు ధరించడానికి అనువుగా ఉండే ‘ఫుల్‌టైమ్ డ్రెస్ వేర్’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యానిమల్ ప్రింట్స్
ఏ కాలమైనా ఎవర్‌గ్రీన్ స్టైల్ స్టేట్‌మెంట్‌గా యానిమల్ ప్రింట్స్‌ను చెప్పుకోవచ్చు. ట్రెండ్‌లో ట్రైబల్ ప్రింట్స్‌గానూ పిలుస్తున్న ఈ తరహా దుస్తులు రోజులో ఏ సమయంలోనైనా ధరించడానికి సిద్ధం అన్నట్టుగా ఉంటాయి. 1970-80ల కాలంలో యానిమల్ ప్రింట్స్ హవా బాగా నడిచింది. ఈ ప్రింట్ల నమూనా హుందాతనానికి ప్రతీకగా ఉంటుంది. అందుకే నేటికీ ఫ్యాషన్ ప్రపంచంలో తమ ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాయి ఈ ప్రింట్లు. వీటిలో ఆవు, జీబ్రా, చిరుత, జిరాఫీ, పులి, తెల్ల పులి... వీటి దేహంపై మచ్చలను పోలిన ఫ్యాబ్రిక్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది.
♦ కాటన్, సిల్క్, షిఫాన్ ఇలా అన్ని రకాల క్లాత్‌లమీదా యానిమల్ ఫ్రింట్స్ వస్తున్నాయి.
♦ చీరలు, టాప్స్, కుర్తీలు, గౌన్ల మీద సంప్రదాయ, ఆధునిక వస్త్రధారణగానూ ఈ ప్రింట్స్‌ను ధరించవచ్చు. అయితే, పాశ్చాత్య వేడుకలకే ఈ చారలు మరింత ప్రత్యేకతను ఇస్తున్నాయి.
♦ డ్రెస్సుల్లోనే కాకుండా ఇతర అలంకరణ వస్తువుల్లోనూ యానిమల్ ప్రింట్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వీటిలో స్కార్ఫ్స్, సన్‌గ్లాసెస్, హ్యాండ్‌బ్యాగులు, బెల్టులు, పర్సులు, పాదరక్షలు.. ఇలా అన్నింటిలోనూ యానిమల్ ప్రింట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
♦ బాలీవుడ్ తారలు ఎక్కువగా చుక్కల యానిమల్ ప్రింట్లు గల డిజైనర్ దుస్తులు ధరిస్తుంటారు. అంతర్జాతీయ బ్రాండ్లలోనే కాదు, స్వదేశీ ఫ్యాషన్ డిజైనర్లూ ఈ చుక్కల ఫ్యాబ్రిక్‌తో ఆకట్టుకునే డిజైన్లను రూపొందిస్తున్నారు.
పోల్కా డాట్స్
♦ యానిమల్ ప్రింట్స్ మాదిరే పోల్కా డాట్స్ కాలాలకు అతీతంగా నిలిచిన ఫ్యాషన్ ఫ్యాబ్రిక్. ఆధునిక వస్త్రధారణలో అందంగా నిలిచిపోయిన పోల్కాడాట్స్ యువతరపు మదిని దాదాపు నూరేళ్లుగా గిలిగింతలు పెడుతూనే ఉంది.
♦ చిట్టి పొట్టి గౌన్లలోనే కాదు, పొడవు మ్యాక్సీలలోనూ, చీరలలోనూ, టాప్స్‌లోనూ, ప్యాంట్స్‌లోనూ తమవైన హవా సృష్టిస్తూనే ఉన్నాయి నలుపు, తెలుపు చుక్కలు.
♦ పొడవాటి పోల్కా డాట్స్ గౌన్ మీ వార్డ్‌రోబ్‌లో ఉంటే ఏ పార్టీ అయినా ఎవర్రెడీ అన్నట్టు ఉండవచ్చు.
♦ డ్రెస్సుల్లోనే కాదు బ్యాగులు, మెడకు చుట్టుకునే స్కార్ఫ్స్, తలకు వాడే రిబ్బన్లు, పాదరక్షల్లోనూ పోల్కాడాట్స్ ఉండటం చూస్తుంటాం. ఇవి ఒక సెట్‌గా ఉంటే రెట్రో ఫ్యాషన్‌లో మీరు తలుక్కుమన్నట్టే.
సదా ‘సాదా’యే...
ప్లెయిన్‌గా పై నుంచి కిందవరకు ఎలాంటి డిజైన్ లేకుండా సింపుల్ అనిపించే ఒక లాంగ్ గౌన్ ధరించినా చాలు ‘అల్ట్రామోడ్రన్’ మార్కులు కొట్టేయచ్చు. పాశ్చాత్య సుందరీమణుల వస్త్రజాబితాలో ప్రాచీనకాలం నుంచీ చోటుచేసుకుని ఉన్న ఈ తరహా వేషధారణ ఇప్పుడూ ప్రత్యేక స్థానంలో ఉంది.
అందుకే ఈ తరహా సాదా డ్రెస్సులను ఏ కాలంలోనైనా, ఏ సందర్భానికైనా ఆధునిక వేడుకలకు ధరించవచ్చు. సిల్క్, శాటిన్, బ్రొకేడ్, షిఫాన్, క్రేప్, జార్జెట్, ఆర్గంజా, రేయాన్, వెల్వెట్.. ఫ్యాబ్రిక్స్ ఈ తరహా గౌన్లకు బాగా నప్పుతాయి.
అయితే...
♦ గౌన్ పూర్తి ప్లెయిన్‌గా ఉంటుంది కాబట్టి, మెడలో వేసుకునే హారం ‘ఫంకీ’ తరహాకి చెందినదై, మెడను పట్టి ఉంచేలా ఉండాలి.
♦ చెవులకు సన్నని లోలాకు లు, కాళ్లకు హై హీల్స్ తప్పనిసరి. సింపుల్‌గా అనిపించే మేకప్ పార్టీలో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపుతుంది.
♦ గౌన్ సాదాగా ఉంటుంది కాబట్టి పాదరక్షలు ప్రింట్లున్నవి ఎంచుకోవచ్చు. లేదా బెల్ట్, చేత ధరించే క్లచ్.. ప్రింట్లున్నవి వాడితే బాగుంటుంది.
మోడల్ అండ్ డ్రెస్ కర్టెసి : ఎడార్న్ స్టూడియో, హైదరాబాద్