ఏడిపిస్తే గెలిచినట్టే!
వీక్షణం
ప్రపంచంలో రకరకాల పోటీలు ఉంటాయి కదా! జపాన్‌లోని ఓ పోటీ గురించి వింటే ఇదేం పోటీ అనిపిస్తుంది. అక్కడి వాతావరణం చూస్తే రెజిలింగ్‌లా అనిపిస్తుంది. కానీ చివరికి జరిగేది మాత్రం వేరు.
రెజిలింగ్ రింగ్ ఉంటుంది. ఇద్దరు సుమోలు సీరియస్‌గా లోపలకు వస్తారు. ఇద్దరూ హోరాహోరీగా పోట్లాడుకుంటారేమో అనుకునేలోపు వాళ్లిద్దరికీ ఇద్దరు చంటిపిల్లల్ని అప్పగిస్తారు. ఆ చిన్నారులిద్దరూ వారి పిల్లలే అయివుంటారు. పోటీ కూడా ఆ బుజ్జిగాళ్లతోటే.
ఇంతకీ ఏం చేయాలనే కదా! ఏం చేయాలంటే... సుమోలు తమ చేష్టలతో అవతలివారి బిడ్డను ఏడిపించాలి. ఆ బిడ్డ ఏడిస్తే పోటీలో గెలిచినట్టే. లేదంటే ఓడిపోయినట్టు. అదీ పోటీ! వినడానికి విచిత్రంగా ఉంది కానీ... అక్కడ ఈ పోటీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. చూడ్డానికే కాదు, పోటీ పడటానికి కూడా బోలెడంతమంది వస్తుంటారు. పిల్లల్ని ఏడిపించి గెలిచే ప్రయత్నం చేస్తుంటారు. బిడ్డని అలా అందరి ముందూ ఏడిపించడం వల్ల దిష్టి పోతుందనే నమ్మకం కూడా ఉంది వారికి. అందుకే క్రమం తప్పకుండా ఈ పోటీని నిర్వహిస్తుంటారు. అదీ సంగతి!