కొత్త బంగారం.. అయన్‌త్రితము | Gabriela Cabezon Camera The Adventures of China Iron | Sakshi
Sakshi News home page

కొత్త బంగారం.. అయన్‌త్రితము

Published Mon, May 18 2020 12:53 AM | Last Updated on Mon, May 18 2020 12:53 AM

Gabriela Cabezon Camera The Adventures of China Iron - Sakshi

నవల: నవల: ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ చీనా అయన్‌
రచన: గాబ్రియాలా కాబసోన్‌ కమారా
మూల ప్రచురణ: 2017
స్పానిష్‌ నుంచి ఇంగ్లిస్‌: ఫియోనా మాకింటోష్,  అయోనా మాకింటైర్‌

‘‘మనకు గుర్తున్నదే అసలు జరిగిన విషయమా? లేకపోతే ఏళ్ల తరబడి మళ్లీమళ్లీ తలచుకోవడంతో ఆ జ్ఞాపకం రూపుమారి, జీవం లేకపోయినా తళుకులీనుతున్న వజ్రపురాయిలా మారుతుందా?’’ తన జ్ఞాపకాలకు అసలైన రూపం ఇస్తున్నానా లేదా అని ‘ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ చీనా అయన్‌’ నవలలోఎపిఫనస్‌ కథకురాలు చీనా అయన్‌ వేసుకునే ప్రశ్న ఇది. లాటిన్‌ అమెరికన్‌ రచయిత్రి గాబ్రియాలా కాబసోన్‌ కమారా స్పానిష్‌ భాషలో రాసిన ఈ నవలను ఫియోనా మాకింటోష్, అయోనా మాకింటైర్‌ ఇంగ్లీషులోకి అనువదించారు. 

19వ శతాబ్దంలోఅర్జెంటీనా తమ దేశంలోని వివిధ రంగాల అభివృద్ధి కోసం యురోపియన్లకు తలుపులు తెరవడంతో వేలాదిగా యురోపియన్లు ఆ దేశంలోకి అడుగుపెట్టారు. వలస యురోపియన్లు అక్కడి భూములని ఆక్రమించి ఆ దేశపు సంచారజాతి ప్రజలైన గౌచోలనూ, ఇండియన్లనూ నిర్బంధ సైనికులుగా తీసుకుని ఆ పనులని బలవంతంగా చేయించారు. ఆ చరిత్రే ఈ నవలకి నేపథ్యం. 

అనాథ అయిన చీనాని చేరదీసి పెంచిన తల్లిదండ్రులు చివరికి ఆమెని బానిస లాగానే చూస్తారు. నిరాదరణకు గురైన చీనా మరో అనాథని ప్రేమిస్తుంది. తాగిన మైకంలో ఉన్న పెంపుడు తండ్రి, చీనాని పణంగా పెట్టి మార్టిన్‌ ఫియేరోతో జూదమాడి ఓడిపోతే, పందెం గెలిచిన ఫియేరో, చీనాని పెళ్లి చేసుకుంటాడు. వివాహానంతరం చీనా ప్రేమికుడు హత్యకి గురైనప్పుడు, తన భర్తే ఆ హత్య చేశాడని తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సహయత చీనాది. నిర్బంధ సైనికులుగా అందర్నీ తీసుకెళ్లిపోతున్న ఆ కాలంలో ఫియేరోతో సహా పొరపాటున యురోపియన్‌ అయిన ఆస్కార్‌ని కూడా తీసుకెళ్తారు అధికారులు. పధ్నాలుగేళ్లకే ఇద్దరు పిల్లలకి తల్లి అయిన చీనా– బలవంతపు వివాహం, ప్రేమికుడి హత్య, భర్త నిర్బంధం, పేదరికం, బాధ్యతలతో విసుగుచెంది పిల్లలను తెలిసిన వాళ్లకి అప్పగించి – స్వేచ్ఛాజీవనంలోకి అడుగుపెట్టినప్పుడు ఆస్కార్‌ భార్య లిజ్‌ తారసపడుతుంది.

భర్తనీ, చూసుకోవలసిన ఎస్టేట్‌నీ వెతుక్కుంటూ బయలుదేరిన లిజ్, తనకు తోడుగా స్పానిష్‌ మాట్లాడగలిగిన చీనాని రమ్మంటుంది. ఆ ప్రయాణంతో ‘‘నాకు ప్రపంచ ద్వారాలు తెరిచినట్టయింది,’’ అంటుంది చీనా. యూరప్‌ నుంచి వచ్చి, భూమిని సంపాదించి రైలుమార్గాలు వేయాలనీ, తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే ఆలోచనల్లో ఉన్న కల్నల్‌ని కలుస్తుంది లిజ్, చీనాతో కలిసి. మాటల మధ్యలో కల్నల్‌ అక్కడినుంచి పారిపోయిన కవీ, గాయకుడూ అయిన ఒక నిర్బంధ సైనికుడి గురించి చెబుతూ అతని పాటను వినిపించినప్పుడు, ఆ సైనికుడు తన భర్తే అని అర్థమై, ఇప్పుడు భర్త ఎదురైతే జీవితం మళ్లీ మొదటికొస్తుందేమోనన్న భయం కలుగుతుంది చీనాకి. ఫోర్ట్‌లో దాష్టీకాలకు గురవుతున్న కొంతమందిని తప్పించి, కల్నల్‌కి వీడుకోలు చెప్పి ప్రయాణాన్ని కొనసాగించిన చీనా, లిజ్‌ల అనంతర ప్రయాణం మిగతా కథ. 

జ్ఞాపకాలకి చరిత్ర, కాలం ఉన్న కారణంగానేమో చారిత్రాత్మక, యాత్రా సాహిత్యాల ధోరణులు రెండూ ఈ నవలలో కనిపిస్తాయి. అర్జెంటీనా సాహిత్యంలో అత్యుత్తమ కావ్యంగా గుర్తింపబడిన ‘ఎల్‌ గౌచో మార్టిన్‌ ఫియేరో’ ఈ నవలకి ప్రేరణ. మూలకథని మార్చి చీనా పరంగా, ఆమె గొంతుకి చోటిచ్చి కథని రాయటం ఇందులోని ప్రత్యేకత. ఈ కథ– స్త్రీగా తన లైంగికతని కాపాడుకుంటూ, ప్రపంచాన్ని ఆకళింపు చేసుకుంటూ ఎదిగిన చీనా కథ మాత్రమే కాదు, ఎల్‌జిబిటీక్యు ఆంకాక్షలను స్పృశించిన కథ కూడా. స్పానిష్‌ భాషలోని మాండలికాలూ, జీవవంతమైన ప్రకృతి వర్ణనలూ, ‘ఎల్‌ గౌచో మార్టిన్‌ ఫియేరో’ కావ్యపోకడతో రాసిన కవిత్వమూ అనువదించటానికి చాలా కృషి చేయవలసి వచ్చిందంటారు అనువాదకులు. అణచివేతల జీవితాల్లోనుంచి ఆశావహ దృక్పథంతో కదిలి, రసవంతమైన జీవనాల్లోకి మేల్కొనడం కథావరణమైతే, అణచివేత గురించి సున్నితంగా మాత్రమే చెబుతూ కథను నడపటం రచయిత్రి వైశారద్యం. ఈ నవల ఈ యేడాది బుకర్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్‌కి షార్ట్‌లిస్ట్‌ అవడానికి ఇవన్నీ బలమైన కారణాలు అయివుంటాయి!
-పద్మప్రియ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement