జ్ఞాపకాన్ని పెంచే గేమ్స్
సర్వే
అరవైఏళ్లు దాటాయంటే చాలు...అల్జీమర్స్‌వ్యాధి బారినపడే అవకాశాలు అందరిలో కాకపోయినా కొందరిలో తప్పడంలేదు. మరుపు వచ్చాక ఒంటరిగా ఉంటే గనక ఆ మరుపే మిమ్మల్ని చంపేస్తుందంటున్నారు జెరూసలేమ్‌కి చెందిన అల్జీమర్స్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్‌వారు. వీలైనంతవరకూ కొత్తవారితో స్నేహాలు చేస్తూ... కొత్త విషయాలు తెలుసుకుంటూ నలుగురితో గడుపుతుంటే ఆ జబ్బు ప్రభావం తగ్గుతుందంటున్నారు.
దీంతోపాటు వారు కొత్తగా కనుగొన్న కంప్యూటర్ గేమ్స్ అల్జీమర్స్ బాధితులకు కొంత ఉపశమనం ఇవ్వడంలో విజయం సాధించిందని కూడా చెబుతున్నారు. వారు స్థాపించిన అల్జీమర్స్ డే కేర్ సెంటర్‌లో చేరిన వృద్ధులపై చేసిన ప్రయోగంలో ఈ విషయం వెల్లడదయిందని చెప్పారు. మరుపునకు మెల్లగా దూరమవుతూ మామూలు పరిస్థితికి వచ్చిన వృద్ధులు చాలామంది ఉన్నారక్కడ.
ఇంతకీ ఆ సెంటర్‌లో చేస్తున్న వైద్య రహస్యమేమిటంటే... ఆ సెంటర్‌లో చేరిన వృద్ధులు రోజు పొద్దుటే చక్కగా ముస్తాబై ఒక పెన్ను, పుస్తకం తీసుకుని వెళతారు. వెళ్లగానే తోటివారితో కాసేపు సరదాగా గడిపి, కొత్తగా చేరినవారిని పరిచయం చేసుకుని తర్వాత ఎవరి కంప్యూటర్ ముందు వారు కూర్చుంటారు.
ప్రత్యేకంగా అల్జీమర్స్ బాధితుల కోసం తయారుచేసిన గేమ్ అప్పటికే స్క్రీన్‌పై రెడీ ఉంటుంది. దాన్ని ఆడుతూ కాలక్షేపం చేయాలి అంతే! మధ్యాహ్నం భోజనం తర్వాత మరికొద్దిసేపు కంప్యూటర్‌లో గేమ్స్ ఆడతారు. మెదడుకి పనిచెప్పే ఈ గేమ్స్ మరుపుని దూరం చేయడంలో బాగా ఉపయోగపడతాయంటున్నారు అక్కడి వైద్యులు.