
గంగ అవతరించిన పుణ్యమాసం
సందర్భం- జ్యేష్ఠమాసారంభం
గంగానదిలో స్నానం చేయడం విశేషఫలాలనిస్తుంది. అందుకు అవకాశం లేనివారు గంగాదేవి పేరును స్మరిస్తూ, ఇతర పుణ్యనదుల్లో స్నానం చేసినా పవిత్రస్నానం చేసిన ఫలం పొందవచ్చునని పురాణ కథనం.
సంవత్సరంలోని అన్ని మాసాలూ విశిష్టమైనవే అని చాటి చెప్పే గొప్ప సంస్కృతి గల మనం ఇప్పుడు జ్యేష్ఠమాసంలోకి అడుగుపెట్టాం. అనేక పర్వదినాలకు ఆలవాలమైన ఈ మాసంలో ఏం చేస్తే మంచిదో వివరంగా తెలుసుకుందాం.
జ్యేష్ఠమాసంలో వృషభాన్ని పూజించడం పుణ్యప్రదమని శాస్త్రోక్తి.
మే 31 రంభాతృతీయ: ఈరోజున పార్వతీదేవిని ఉమానామంతో అర్చించడం శుభప్రదం.
జూన్ 8, దశపాపహర దశమి: కేవలం తనలో మునిగినంత మాత్రానే అందరి పాపాలను, కల్మషాలను కడిగివేసే గంగాదేవిని పదిరకాలైన పుష్పాలతో, ఫలాలతో అర్చించి, ధూపదీప హారతులు ఇవ్వడం వల్ల తెలిసీ, తెలియక చేసే పదిరకాలైన పాపాలు తొలగిపోతాయి. ఈవేళ దైవదర్శనం, దానం శుభఫలాలనిస్తుంది.
జూన్ 9, నిర్జల ఏకాదశి: విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం చేయడం వల్ల అత్యంత శుభఫలితాలు పొందగలరని శ్రీకృష్ణుడు భీముడికి చెప్పాడట. ఈ విధంగా చేసి, భీముడు అనేక శుభఫలాలను పొందినట్లు పురాణ కథనం. ఈ రోజు పెసరపప్పు, పానకం, నెయ్యి, ఛత్రం మొదలైన, వాటిని దానం చేయడం శుభప్రదం.
గంగావతరణం: భగీరథుని తపస్సు కారణంగా ఈ రోజు గంగ దివినుంచి భువికి దిగివచ్చిన శుభదినంగా పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ రోజున గంగావతరణంగా చెబుతారు. ఈ వేళ గంగా స్నానం చేయడం విశేషఫల దాయకం. అవకాశం లేనివారు గంగాదేవి పేరును స్మరిస్తూ, పుణ్యనదుల్లో లేదా కుళాయినీటితో స్నానం చేసినా పవిత్రస్నానం చేసిన ఫలం పొందవచ్చునని పురాణ కథనం.
జూన్ 13, జ్యేష్ఠ పూర్ణిమ: జ్యేష్ఠఫూర్ణిమకే ఏరువాక పున్నమి అని పేరు. ఈవేళ రైతులు పశువులను శుభ్రం చేసి, వాటి కొమ్ములకు రంగులు పూసి, మువ్వలతో అలంకరిస్తారు. తర్వాత ఎడ్లను కట్టివేసే గాటికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, ఎడ్లకు ఉలవలు, పొంగలి పెడతారు. సాయంత్రం ఎడ్లను పొలం వద్దకు తీసుకెళ్లి, దుక్కిదున్నటం ప్రారంభిస్తారు.
జ్యేష్ఠ పున్నమి... వటసావిత్రీ వ్రతం: ఈ వ్రతాచరణ వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని పురాణ కథనం. మహా పతివ్రత అయిన సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం నారద మహర్షి ఉపదేశం మేరకు మర్రిచెట్టునే సావిత్రిగౌరిగా భావించి, పసుపు కుంకుమలు, గాజులు మొదలైనవి సమర్పించి, చెట్టు చుట్టూ 108 మార్లు ప్రదక్షిణం చేస్తూ, అన్ని మార్లూ పసుపు దారం చుట్టిందట. తద్వారా లభించిన ఫలంతోటే యముడు తీసుకుపోయిన తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకోగలిగిందట! కాబట్టి జ్యేష్ఠపున్నమికి వటసావిత్రీవ్రతం అని పేరు.
ఈ రోజు సాయంకాలం ఐదుగురు ముత్తయిదువలకు పసుపు, కుంకుమ, తాంబూలాలు, మామిడిపండ్లు వాయనం ఇవ్వడం వల్ల వారి ఐదవతనం కలకాలం నిలుస్తుందని శాస్త్రోక్తి.
జూన్ 16 సంకటహర చతుర్థి: ప్రతి నెలలోనూ బహుళ చవితినాడు సంకటహర చతుర్థీవ్రతం ఆచరించినట్లే ఈ నెలలో కూడా ఈ వ్రతాచరణ చేయడం శుభదాయకం.
జూన్ 23 అపరా ఏకాదశి: ఈ ఏకాదశినాడు ఉపవసించి, వామనుని పూజించినందువల్ల అనేకవిధాలైన పాతకాలు తొలగిపోతాయని పురాణోక్తి.
మనం గమనించవలసింది ఏమిటంటే మనకు సాయం చేసేవారు ఎలాంటివారైనా, అంటే ఆఖరికి మూగజీవాలైనా సరే, కృతజ్ఞతతో మెలగుతూ, కనీసం సంవత్సరంలో ఒకటి రెండు సార్లయినా వారిని గౌరవించడం, అవసరాలలో ఉన్నవారికి ఆసరా ఇవ్వడం మంచిదని ఆనాటి రోజుల్లోనే రుషులు చెప్పారు. వాటిని అర్థం చేసుకుని ఆచరించడమొక్కటే మనకు సత్ఫలితాలనిస్తుంది.
- డి.వి.ఆర్.