ఆరేళ్ల అర్జున్... గోల్ఫ్ సూపర్‌స్టార్
ప్రతిభా కిరణం
అర్జున్ 2007 జనవరి 26న పుణేలో జన్మించాడు. చదువుకు ఇబ్బంది కలగకుండా తల్లిదండ్రులు గనక పిల్లలను ఇతర రంగాలలో ప్రోత్సహిస్తే, వారు సాధించే విజయాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలియజేసేందుకు ప్రత్యక్ష నిదర్శనం - అర్జున్.
అర్జున్‌లో ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. గోల్ఫ్ పట్ల అతనికున్న ఇష్టం, పట్టుదలతో ఐదు సంవత్సరాల వయస్సులోనే తొలి గోల్ఫ్ టోర్నమెంట్ ఆడి బహుమతి గెల్చుకున్నాడు. అర్జున్ ఎన్నో గోల్ఫ్ టోర్నమెంటుల్లో పాల్గొన్నాడు. ఛాంపియన్ జూనియర్ గోల్ఫ్ టూర్, పంజాబ్ ఛాలెంజ్ వంటి అనేక టోర్నమెంట్లు గెల్చుకున్నాడు. లాస్‌ఏంజెలస్‌లో జరిగిన గోల్ఫ్ జూనియర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతి చిన్న వయసు భారతీయ క్రీడాకారుడు అర్జున్.
అర్జున్‌కి తండ్రి ఋషి మార్గదర్శకుడు. అర్జున్ విజయం సాధించడం వెనుక ఋషి ప్రోత్సాహం ఎంతో ఉంది. అర్జున్‌కు రెండేళ్ళ వయసున్నప్పటి నుండి తండ్రి అతనికి గోల్ఫ్ ఆటలో మెలకువలు నేర్పిస్తున్నారు. అర్జున్ తన ఐదేళ్ల వయసులో అంటే మార్చి 2012లో ఢిల్లీలో జరిగిన ఛాంపియన్ టూర్‌లో పాల్గొన్నాడు. అది అతనికి మొదటి టోర్నమెంటు. తరువాత ఢిల్లీ, ముంబయ్, కలకత్తా, పుణే, చండీగఢ్‌లలో జరిగిన అనేక టోర్నమెంట్‌లలో పాల్గొన్నాడు.
ఇటీవల అర్జున్ గోల్ఫ్ జూనియర్ ఒలింపిక్స్‌గా పరిగణించబడే ‘అంతర్జాతీయ వెరిటాస్ ప్రపంచ జూనియర్ టోర్నమెంట్’లో కాంస్యపతకం గెలుచుకున్నాడు. లాస్ ఏంజెలస్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలు పాల్గొన్నారు. ఆరు సంవత్సరాల పిల్లల కేటగిరీలో భారతదేశం నుండి పాల్గొన్న అర్జున్ మాత్రమే అర్హత పొందాడు. పిన్నవయసులోనే ఇన్ని సాధించిన అర్జున్ ఎంతోమందికి స్ఫూర్తి.