
సోంఫ్‌తో శ్వాస తాజాగా...!
గుడ్‌ఫుడ్
ఎంత మంచి భోజనం అయినా అది తిన్న తర్వాత సోంఫ్ వేసుకుంటే గానీ ఆ భోజనపర్వం సంతృప్తిగా ముగిసినట్లు అనిపించదు కొందరికి. అందుకే చాలా మంచి భోజనం తర్వాత కాసింత సోంఫ్ వేసుకుంటారు. భోజనం ముగిశాక వేసుకునే సుగంధద్రవ్యంగానే కాకుండా సోంఫ్‌తో అంతకు మించి ప్రయోజనం ఉందంటున్నారు ఆహార నిపుణులు. వారు సోంఫ్ గురించి చెబుతున్న కొన్ని అంశాలివి... సోంఫ్‌లో కళ్లకు మంచి చేసే అంశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇవి గ్లకోమాను అరికట్టడంలో తోడ్పడతాయని అనేక అధ్యయనాల్లో తేలింది.
భోజనం తర్వాత కాసింత సోంఫ్ తినే వారిలో మతిమరపు వచ్చే అవకాశాలు ఉండవు. అవి మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాన్ని బలోపేతం చేయడం వల్ల డిమెన్షియా సమస్య రాదంటున్నారు పరిశోధకులు.సోంఫ్‌తో రక్తం బాగా శుద్ధి అవుతుందని పేర్కొంటున్నారు మరికొందరు అధ్యయనవేత్తలు. కాలుష్యం నిండి ఉండే నేటి రోజుల్లో చాలా సులభంగా రక్తంలో పేరుకుపోయే కాలుష్యాలను తొలగించుకునేందుకు ఇది చాలా సులభమైన మార్గంగా వారు చెబుతున్నారు.
సోంఫ్ తినేవారిలో ఛాతీ పట్టేసే సమస్య నివారణ అవుతుంది. సోంఫ్‌లో ఉండే అనెథాల్, సినెయోల్ అనే రసాయనాలు శ్వాసనాళాలను వెడల్పుగా విప్పారేలా చేస్తాయి. అందుకే అలర్జీ లేదా ఆస్తమా లేదా బ్రాంకైటిస్ ఉన్నవారు కాస్తంత సోంఫ్ తీసుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. అన్నిటి కంటే ముఖ్యంగా... ఇది శ్వాసను తాజాగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది. అందరికీ తెలిసిన ప్రధాన ఉపయోగం ఇది. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్న సూత్రం సోంఫ్‌కూ వర్తిస్తుంది. అందుకే ఎంత రుచికరంగా ఉన్నా పరిమితంగా తీసుకోవడం అన్ని విధాలా మేలు.