మనుషులు ఎమోషన్స్‌ని అదుపు చేసుకోవడం, బిలీఫ్స్‌ని చెక్కుచెదరనివ్వక పోవడం.. ఇలాంటి వాటి వల్లనే జీవితానికి ఇంత అందమేమో! అయితే మనుషుల్లో నిద్రపట్టనివ్వని వాళ్లు, నిజాల కుండల్ని బద్దలు కొట్టే వాళ్లు లేకపోతే జీవితంలోని ఆ అందాన్ని చిలికి పైకి తెచ్చేదెవరు?
మనిషంటేనే మంచి. మన దేశంలోనైనా, మరో దేశంలోనైనా. ప్రకాశ్‌రాజ్ కూడా అన్నాడు కదా, ‘మనిషంటేనే మంచిరా..’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో. ఒకవేళ లోకం నిండా చెడ్డవాళ్లు ఉండి, ఒకళ్లిద్దరు మంచివాళ్లు ఉన్నా చాలు లోకంలోని చెడును చెట్టులా కొట్టేయడానికి. చెట్టును కొట్టేయడం చెడు కదా! చెడే. చెట్టును కొట్టేయవలసిన టైమ్ వచ్చినప్పుడు కొట్టేయడం ‘మంచి చెడు’ అవుతుంది తప్ప, చెడు అవదు.లోకమంతటా మంచివాళ్లు ఉన్నప్పుడు డెస్క్ పక్కన డెస్క్‌లో, ఇళ్ల పక్కన ఇళ్లలో మంచివాళ్లు లేకుండా ఉంటారా? ఆఫీస్‌లో కొంతమంది మంచివాళ్లు ఉంటారు. పాపం, ఏం తోచక బల్లపై దరువులు వేస్తుంటారు.
దరువు బోర్ కొట్టేస్తే చిటికెలు. పిల్లలు రేకు డబ్బాలను డబడబలాడిస్తూ ఒక్కరే ఏకాంతంలో ఎంటర్‌టైన్ అవుతుంటారు కదా, చలంగారు అన్నట్లు.. అలాగ. పక్కన డెస్క్‌లో పని జరుగుతుంటుందన్న ఆలోచన వాళ్లకు రావాలని రూలేం ఉంది?! ఇళ్ల పక్క ఇళ్లల్లోనైతే ఈ టైప్ ఆఫ్ ‘బాల్యం’లోని వాల్యూమ్ ఇంకొంచెం వైల్డ్‌గా ఉంటుంది. మూడో, నాలుగో ఇళ్ల్ల అవతలికి వినిపించేలా. భరించే మంచితనం ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నార్త్ కరొలీనాలో క్యాండైస్ మ్యారీ బెన్‌బో అనే మంచావిడ ఒకరు ఉన్నారు. ఆమె పక్కింట్లోనూ ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆ మంచి వ్యక్తి కొత్తగా వచ్చి చేరాడు. మ్యూజిక్ వీడియో ప్రొడ్యూసర్. పెద్ద శబ్దంతో అతడు ప్రొడ్యూస్ చేసే సంగీతానికి నెల రోజులుగా మ్యారీకి నిద్ర కరువైంది. కళ్ల కిందకు వలయాలు వచ్చేశాయి.
అంతరాత్రప్పుడు వెళ్లి చెప్పలేదు. పగలు వెళ్లి చెప్పాలంటే ఉదయమే తలుపుకు తాళం వేసి ఉంటుంది. ఏం చేయాలి? యు.ఎస్.లో న్యూసెన్స్ కేస్ పెట్టడం తేలిక. ఆమె పెట్టదలచుకోలేదు. ఓ సాయంత్రం బయటికి వెళ్లింది. అరకిలో వెనీలా కేక్ బాక్స్‌తో తిరిగొచ్చింది. ఆ కేక్ బాక్స్‌ను తలుపులు మూసి ఉన్న మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఇంటి గడపపై పెట్టింది. బాక్స్‌తో పాటు చిన్న నోట్ కూడా. మర్నాడు ఉదయాన్నే ఆ వ్యక్తి వచ్చి మ్యారీ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. మ్యారీ బయటికి రాగానే ‘మీరేనా మ్యారీ’ అని, గుడ్మాణింగ్ చెప్పాడు. ‘సారీ’ కూడా చెప్పాడు. ‘ఇక మీదట మీ సౌండ్ స్లీప్‌ను నా మ్యూజిక్ సౌండ్ పాడు చెయ్యదు’ అని చిరునవ్వుతో భరోసా ఇచ్చాడు. వాళ్లిప్పుడు మంచి ఫ్రెండ్స్. ‘మీ మ్యూజిక్ వినసొంపుగా ఉంది.
డిసెంబర్ 15న మాత్రం వినసొంపు కాస్త టూ మచ్‌గా ఉంది’ అని రాసింది మ్యారీ ఆ నోట్‌లో. ఆ మనిషి వెంటనే అర్థం చేసుకున్నాడు. మనుషుల్లోని అమాయకత్వాన్ని పోగొట్టే మంచి మనుషులు కొందరుంటారు. అమాయకత్వాన్ని పోగొట్టడం మంచి పనే. లేకుంటే లోకంలోని అమాయకులు చాలా నష్టపోతారు. ‘ఇదా లోకం’ అని కుంగిపోతారు. అలా కుంగిపోకూడదనే.. ఇటీవల ఎన్నికలకు ముందు ఒక ముఖ్య నాయకుడు ఓటర్ల అమాయకత్వాన్ని పోగొట్టారు. ‘ఓడిపోతే నాకేం నష్టం లేదు. వెళ్లి ఫామ్‌హౌస్‌లో కూర్చుంటాను. మీకే నష్టం’ అన్నాడు. ఓటర్లు అమాయకత్వం పోగొట్టుకుని తమకు నష్టం జరక్కుండా ఆయనకు ఓటేశారు. క్రిస్మస్ రోజు డొనాల్డ్ ట్రంప్ అనే మరో మంచి మనిషి కూడా ఇలాగే ఓ చిన్నారి అమాయకత్వం పోగొట్టే పని చేశారు.
హాలిడే ఈవెంట్‌లో పిల్లల ప్రశ్నలకు ఫోన్‌లో సమాధానాలు ఇస్తున్నప్పుడు సౌత్ కరోలినాలో ఉంటున్న కాల్‌మాన్ లాయిడ్ అనే చిన్నారి నుంచి ట్రంప్‌కు కాల్∙వచ్చింది. ‘‘క్రిస్మస్‌ను ఎలా జరుపుకున్నావ్ డియర్’’ అని ట్రంప్ అడిగారు. ‘‘చాలా బాగా సర్. నేను నా సిస్టర్స్ రాత్రి సెయింట్ నిక్ (శాంటాక్లాజ్) చర్చికి వెళ్లాం. ఐస్డ్ షుగర్ కుకీస్, మిల్క్ పెట్టివచ్చాం. తెల్లారే వెళ్లి చూస్తే అవి అక్కడ లేవు. శాంటాక్లాజ్ వాటిని తీసుకుని మా కోసం అక్కడున్న ఒక చెట్టు కింద కానులు పెట్టి ఉంచాడు. వాటిని తెచ్చుకున్నాం’’ అని సంతోషంగా చెప్పింది లాయిడ్. ‘‘నీ వయసెంత తల్లీ?’’ అని అడిగారు ట్రంప్. ‘‘ఏడేళ్లు’’ అని చెప్పింది. ‘‘నువ్వింకా శాంటాక్లాజ్‌ని నమ్ముతున్నావా.. ఏడేళ్లు వచ్చాక కూడా’’ అని అన్నారు ఆయన. ఆ పాప ‘లాంగ్ ఇన్ ద టూత్’ అని ట్రంప్ ఉద్దేశం.
మనం అంటాం కదా, చాలా నిర్దయగా.. పెద్దదానివవుతున్నావ్ అని. ఆ విధంగా. ‘‘ఆర్యూ స్టిల్ ఎ బిలీవర్ ఇన్ శాంటా! బికాజ్ ఎట్ సెవెన్ ఇట్స్ మార్జినల్, రైట్?’’ అన్నారు ట్రంప్. ఆ పాప అప్పుడేం చెప్పలేదు. తర్వాత తల్లి సహాయం తీసుకుని ఇంటర్నెట్‌లోకి వీడియో అప్‌లోడ్ చేసి..‘ఎస్ సర్. నేను శాంటాను నమ్ముతున్నాను’ అని అందులో చెప్పింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవుతున్నప్పుడు ఎక్కడో ఒకచోట వాళ్ల అమాయకత్వంలోకి వాస్తవలోకం చొరబడడం ఎలాగైనా జరుగుతుంది. ట్రంప్ కాకపోతే, మరొకరు. ఏడేళ్లకు కాకపోతే మరో ఏడాదికి. ఎవరో ఒకరి వల్ల ఎప్పుడో ఒకసారి అమాయకత్వం తొలగిపోతుంది. తొలగిపోవడం మంచి విషయమే. తొలగిపోకపోతే? అదొక అందమైన విషయం.మనుషులు ఆ శబ్దసంగీతాన్ని భరించలేని ఆవిడలా ఎమోషన్స్‌ని అదుపు చేసుకోవడం, శాంటా లేడంటే నమ్మని ఈ చిన్నారిలా బిలీఫ్స్‌ని చెక్కుచెదరనివ్వక పోవడం.. ఇలాంటి వాటి వల్లనే జీవితానికి ఇంత అందమేమో! మనుషుల్లో నిద్రపట్టనివ్వని ఆ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌లా, నిజాల కుండల్ని బద్దలు కొట్టే డొనాల్డ్ ట్రంప్‌లా మంచివాళ్లే లేకపోతే జీవితంలోని ఈ అందాన్ని చిలికి పైకి తెచ్చేదెవరు?!
∙
Comments
Please login to add a commentAdd a comment