గుడ్ టచ్ – బ్యాడ్ టచ్
మీ ఇంట్లో, మీ పక్కింట్లో, ఎదురింట్లో, పొరుగింట్లో కూతుళ్లు ఉండే ఉంటారు. నవ్వుతూ తుళ్లుతూ స్కూళ్లకు వెళుతుంటారు. కొన్ని కళ్లు చూపులతోనూ, మరికొన్ని చేతలతోనూ ఆ నవ్వులను చిదిమేయడానికి పొంచి ఉంటాయి. ఆమెకు చెప్పండి ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ అంటే ఏమిటో...జాగ్రత్తగా ఎందుకు ఉండాలో. ‘మీ పక్కింట్లో, ఎదురింట్లో, పొరుగింట్లో, వెనకింట్లో ఉన్న అమ్మలు ఒక్కటవ్వండి. పరువు పరదాల మాటున పసిపిల్లలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయండి..’అని చెబుతున్నారు హైదరాబాద్ వాసులైన మమత, శైలజ, జయవర్ధని, పుష్పలత, లక్ష్మి.
ఆడపిల్లల భవిత బాగుండాలంటే వారు ఈ రోజు సుర క్షితంగా ఉండాలి. చెడు చేతల బారిన పడకుండా ‘గుడ్ టచ్– బ్యాడ్ టచ్’ గురించి బడులు, మురికివాడలు, అపార్ట్‌మెంట్లు.. మొదలైన ప్రాంతాల్లో మమత, శైలజ, జయవర్ధిని, పుష్పలత, లక్ష్మి.. లు ‘అభయ భవిత’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వీరు చేసే ఈ అవగాహన కార్యక్రమం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా తెలుగు రాష్ట్రాలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోకీ తీసుకెళుతున్నామని తెలియజేశారు.
పిల్లల భావాలను గ్రహించండి..
మూడు నుంచి పదేళ్లలోపు పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.‘ఆ పై వయసు పిల్లలు కూడా ఎదురు చెప్పలేని, ఎదుర్కోలేని స్థితిలో ఉన్నారని గమనిస్తున్నాం’ అంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. పిల్లల్లో ఆకలి తగ్గిపోవడం, ఎవరితో కలవకపోవడం, నిద్రలో ఉలిక్కిపడి లేవడం, ప్రతి విషయానికి చికాకు పడటం, చదువులో వెనకబడిపోవడం .. వంటి సమస్యలన్నీ చెడు స్పర్శకు గురైన పిల్లల్లో చూస్తుంటాం. ఈ ప్రభావం వారి భవిష్యత్తును దెబ్బతీయకుండా ఉండాలంటే పిల్లల్లో ఇలాంటి భావాలేమైనా ఉంటే వాటిని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. అబ్బాయిలనూ చెడు స్పర్శ సమస్య వెంటాడుతుంది. కాబట్టి, ఈ సమస్య అమ్మాయిలది మాత్రమే అని అనుకోవద్దు. పిల్లల ప్రవర్తనలో తేడాలు గమనించడం, నిపుణులు సాయం తీసుకోవడం సముచితం’ అని తెలియజేస్తున్నారు.
తల్లిదండ్రులుగా మీరేం చేయాలంటే..
ఎవరైనా అమ్మాయిల తలపై, వీపుపై తట్టడం .. వంటి స్పర్శ వారిపై చూపించే శ్రద్ధగానే అనిపిస్తుంది. కానీ, వారి శరీరంలోని ప్రైవేట్ పార్ట్‌లను తడమడం, తాకడం, కొట్టడం.. వంటివి పిల్లల భావాలపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే వారు స్పర్శించిన తీరు నచ్చకపోతే వెంటనే ‘నో’ చెప్పాలనే విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తే .. ∙అప్రమత్తంగా ఉండమని చెప్పండి ∙భద్రత కోసం ఏదైనా వస్తువును ఉపయోగించమనండి ∙ఎవరినైనా సాయం కోరమనండి ∙గట్టిగా అరవమనండి చెడు స్పర్శ వద్దే వద్దు అని చెప్పండి. ∙నిర్భయంగా ఉండమనండి ∙నీలో ఎంతో శక్తి ఉంది అది గ్రహించు అని చెప్పండి ∙సంఘటనను బట్టి వెంటనే ప్రతిఘటించమనండి ∙ఎలాంటి బాధ అయినా పంచుకోమని చెప్పండి. ఎవరికీ చెప్పుకోలేని సమస్య ఎదురైతే వెంటనే హెల్ప్‌లైన్ 1098 లేదా 100కు ఫోన్ చేయమనండి. – నిర్మలారెడ్డి
బోర్డుపైన బొమ్మలు వేయించి
పదేళ్లుగా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాను. పిల్లల ఆరోగ్యం గురించి, మహిళలకు స్కిల్ ట్రైనింగ్ చేస్తుండేవాళ్లం. ఇప్పుడు పిల్లలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పిస్తున్నాను. బళ్లారిలోని గవర్నమెంట్ స్కూల్‌లో ఇద్దరు అమ్మాయిలను నిలబెట్టి మిగతా అందరికీ అర్థమయ్యేలా వివరించాం. పిల్లల చేతనే బోర్డు మీద బాడీలో ఏయే పార్ట్స్ తాకితే బ్యాడ్ టచ్ అనే విషయాలను బొమ్మలు వేయించి, రాయించి తెలియజేశాను. ఈ కార్యక్రమంలో పిల్లలు వాళ్ల ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకోవడం, తాము ఎలా ప్రతిస్పందించాలో ఒకటొకటిగా చెబుతుంటే ఆనందంగా అనిపించింది.
– పుష్పలత
సమాచారం ఉన్నా అవగాహన లేదు
బిజినెస్ ఉమన్‌గా నా పనులు చేసుకుంటూనే స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. కార్పొరేట్ స్కూళ్లలో మా ఫ్రెండ్ వాళ్లు స్టూడెంట్స్‌కు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక్కో కార్యక్రమానికి స్కూల్ నుంచి కొంత మొత్తం తీసుకుంటారు. కానీ, గవర్నమెంట్, ఇతర కాన్వెంట్ స్కూళ్లకు ఆ అవగాహన కల్పించేవారు తక్కువగా ఉన్నారు. మేము భవిత ప్రోగ్రామ్ ద్వారా ఉచితంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటీవల హన్మకొండ జిల్లా వంగరలోని స్కూల్ పిల్లలకు గుడ్‌టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పుడు చాలామంది దగ్గర ఉన్నప్పటికీ ఈ విషయంపై పిల్లలకు ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నారు అనేది తెలియడం లేదు. ఒకసారి చెప్పి వదిలేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సమస్యకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పుడూ ఇస్తూ ఉండాలి.
– జయవర్ధని
రక్షించుకోవాలనే ఆలోచన కలగాలి
ఖమ్మంలో నా ఫ్రెండ్ డాక్టర్ ప్రశాంతితో కలిసి నిన్ననే ఒక స్కూల్ విద్యార్థులను కలిశాం. టీచర్‌గా, చైల్డ్ సైకాలజిస్ట్‌గా పిల్లలను ధైర్యవంతులను ఎలా చేయాలి అనే అంశాలపై చర్చించుకుంటూ ఉంటాం. పిల్లల మీద దాడులు జరిగినప్పుడు పెద్దలు ఆ విషయాలను బయటకు రానివ్వరు. ఎప్పుడో ఒకటో రెండో సంఘటనలు బయటకు వస్తాయి. ఈ కారణంగా చిన్నవయసులోనే పిల్లలు గర్భవతులు అవడం, ఆసుపత్రుల పాలవడం కూడా చూశాం. మేం చేసే ఈ కార్యక్రమం ద్వారా సమస్యను కొంతవరకైనా తగ్గించగలుగుతాం అనే ఆలోచనతో మొదలుపెట్టాం. కరోనాకు ముందు స్కూల్, కాలేజీలలో దాదాపు పదివేల మంది పిల్లలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి వివరించాం. ఇది పిల్లలున్న ప్రతి ఇంట్లో అవసరమైన టాపిక్.
ఒక కథ లాగా చెప్పడం, తాము ఎవరి సమక్షంలో అయినా ఉన్నప్పుడు సురక్షితంగా అనిపించకపోతే గట్టిగా అరవడం, కొరకడం, నెట్టేయడం.. వంటివి చేయడం గురించి చెప్పాం. కరోనా టైమ్‌లో చాలామంది పిల్లలు ఈ విధానం వల్ల రక్షింపబడ్డారని వారి పేరెంట్స్ వచ్చి చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది. అనాథాశ్రమాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంటాం. తమని తాము ఎలా రక్షించుకోవాలనే ఆలోచనను పిల్లల్లో కలిగించడానికి వీలైనన్ని కాన్సెప్ట్స్ ఇస్తుంటాం. అభయ భవిత కార్యక్రమం ద్వారా వీలైనంత మందిమి గ్రూప్‌గా అవుతున్నాం. స్లమ్స్, ఇండ్లలోని వారిని కూడా కలుస్తున్నాం. తమ తమ ప్రాంతాల్లోనే ఉంటూ ఎవరైనా ఆడపిల్లల రక్షణ కోసం అవగాహన కల్పించవచ్చు.
– ఏలూరి మమత
పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి
పోక్సో అండ్ పోష్ రెండూ సర్టిఫికేషన్ చేశాను. వీటిలో శిక్షణ తీసుకున్నాను. పిల్లలపై జరిగే అకృత్యాలు, దాడులకు సంబంధించిన చట్టాలు, ఎలా నియంత్రించవచ్చు... అనే దానిపై వర్క్ చేస్తుంటాను. మా ఫ్రెండ్ ఎన్జీవో నుంచి వాలంటీర్‌గా పిల్లలకు స్వీయరక్షణ కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్స్‌ను కలిసి, పిల్లలకు శిక్షణ తీసుకుంటూ ఉంటాను. ఇటీవల గోల్కొండ ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్లినప్పుడు 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి గురించి తెలిసింది. ఆ అమ్మాయి మొదట్లో చాలా చురుకుగా ఉండేది. ఇప్పుడు మానసికంగా చాలా దెబ్బతింది. తనతో మాట్లాడితే హాస్టల్‌లో లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసింది. ఎప్పుడూ ముభావంగా ఉండటం, సరిగా చదవకపోవడం, చిరాకు పడటం.. వంటివన్నీ ఉన్నాయి. లైంగిక వేధింపుల కారణంగా మానసికంగా దెబ్బతిన్న పిల్లలను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది.
– శైలజ యడవల్లి
ఎదుర్కోవడానికి సిద్ధం చేయాలి
మేం ఉంటున్న ఉప్పల్ ప్రాంతంలోనే ఉన్న కాన్వెంట్ స్కూల్‌కి వెళ్లి అక్కడి ప్రిన్సిపల్ అనుమతితో స్కూల్ అమ్మాయిలతో కలిసి, మాట్లాడాను. పిల్లల చేతనే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చిన్న చిన్న స్కిట్స్ చేయించాను. తోటి పిల్లల్లో ఎవరైనా ఎవ్వరితోనూ మాట్లాడకుండా, ముభావంగా ఉంటూ, సరిగ్గా చదవకుండా ఉన్నట్టు గమనిస్తే సమస్యను తెలుసుకుని టీచర్లకు తెలియజేయండి అని వివరించాను. పిల్లలు బాగా స్పందించారు. రెండు గంటలపాటు చేసిన ఈ కార్యక్రమంలో పిల్లలు ఆత్మరక్షణతో ప్రతిరోజూ ఎలా ఉండాలో, ఏదైనా చెడు సంఘటన జరుగబోతోందని అర్థమయిన వెంటనే ఎలా ఎదుర్కోవాలో వివరించాను. పదవతరగతి లోపు పిల్లలందరికీ ఎలాంటి చెడు సంఘటన ఎదురు కాకుండా ఉంటే ఆ తర్వాత వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకోగలరు. లేదంటే, వారి భవిష్యత్తుకు ప్రమాదం అవుతుంది. ఈ విషయం గుర్తించి అవగాహన కల్పిస్తున్నాను.
– లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment