ఒకరి జీవితం పండించి తను మాత్రం రాలిపోయే 'గోరింటాకు' | gorintaku movie special | Sakshi
Sakshi News home page

ఒకరి జీవితం పండించి తను మాత్రం రాలిపోయే 'గోరింటాకు'

Published Tue, Mar 14 2017 10:56 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

ఒకరి జీవితం పండించి తను మాత్రం రాలిపోయే 'గోరింటాకు'

ఒకరి జీవితం పండించి తను మాత్రం రాలిపోయే 'గోరింటాకు'

నాటి సినిమా

సృష్టిలో ఏమీ ఆశించినవి కొన్ని ఉంటాయి. పైగా ఇవ్వడమే వాటి ధర్మమనుకుంటాయి. పూలు సువాసననిచ్చి వాడిపోతాయి. మబ్బులు చినుకులు రాల్చి కరిగిపోతాయి. ఏరు దప్పిక తీర్చి కదిలెళ్లిపోతుంది. పంట ఫలాన్ని ఇచ్చి లుప్తమైపోతుంది. పురుషుల విషయంలో కొందరు స్త్రీలు కూడా ఇలాగే ఉంటారు. వారి జీవితాన్ని నిస్వార్థంగా పండించి తాము మాత్రం నిశ్శబ్దంగా రాలిపోతారు.

రాము (శోభన్‌బాబు) తన జీవితంలో ఇద్దరు స్త్రీలను అలాంటివాళ్లుగా చూశాడు. ఒకరు తల్లి (సావిత్రి). మరొకరు స్నేహితురాలు స్వప్న (సుజాత). తల్లికి భర్త వల్ల జీవితంలో ఎటువంటి సంతోషమూ లేదు. అతడు తాగుబోతు. వ్యసనపరుడు. ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుని బంగారం లాంటి ఇంటిని అలక్ష్యం చేసినవాడు. చివరకు ముక్కుపచ్చలారని కన్నకూతురు ఒక రోజు ముచ్చటపడి గోరింటాకు పెట్టుకుంటే అదే రోజున ఆ పిల్ల చావుకు కారణమవుతాడు. అయినా సరే తల్లి అతని బాగే కోరింది. భర్తలో మార్పే ఆశించింది. అతడి కోసం తన జీవితాన్ని గోరింటాకులా మార్చడానికి ప్రయత్నించింది.

స్వప్న కూడా అంతే. మెడికల్‌ కాలేజీలో రాము క్లాస్‌మేట్‌. అతడి కాలేజీ ఫీజు ఆమే కట్టింది. అతడు హాస్టల్‌లో ఉండి అవస్థలు పడుతుంటే తన ఇంటికి తెచ్చి ఔట్‌హౌస్‌లో చోటు చూపించింది. బట్టలు ఉతకడానికి పని మనిషిని పెట్టింది. చెంబు ఇస్త్రీతో అవస్థలు పడుతుంటే  కొత్త బట్టలు కొనిచ్చింది. అతడి పట్ల ఆమె మనసులో ఎంతో అనురాగం. ఆమె పట్ల కూడా అతడి మనసులో ఎంతో అనుబంధం. కాని వాళ్లు ఒకటి తలిస్తే స్వప్న తండ్రి మరొకటి తలిచాడు. అల్లారు ముద్దుగా పెరిగిన కూతురు పెళ్లయ్యాక ఇంకా పెద్ద ఇంటి కోడలు కావాలని భావించాడు. ఇది రాముకు తెలిసింది. తన ప్రేమను వ్యక్తం చేయడానికి భయపడ్డాడు. అతడు భయపడటంతో ఆమె తెగువ చూపలేకపోయింది. మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రాము డాక్టర్‌ కావడంలో కీలకపాత్ర పోషించిన ఆమె అతణ్ణి వదులుకొని దూరం వెళ్లిపోయింది.

కాని వెళ్లిన ఆమె సుఖంగా లేదు. పెళ్లి చేసుకున్నవాడు ఇది వరకే మరొకరికి తాళి కట్టి ఉన్నాడు. ఇది పెద్ద దెబ్బ. కాని ఆమె భీరువు కాదు. అతడి భరతం పట్టి తిరిగి వచ్చింది. కాని అప్పటికే రాము తనకు ఎదురు పడిన ఒక డిస్ట్రబ్డ్‌ పేషంట్‌ (వక్కలంక పద్మ)కు సన్నిహితం అయి ఉంటాడు. నిజమే కావచ్చు. కాని పెళ్లి పెటాకులై తిరిగి వచ్చిన స్వప్నను పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉంది. చేసుకోమని కోరే హక్కు ఆమెకూ ఉంది. కాని ఆమె అలా చేయదు. రామును చేసుకుంటే అతడు సన్నిహితమైన అమ్మాయికి క్షోభ కలగవచ్చు. ప్రాణం కోల్పోవచ్చు. అందుకే స్వప్న తను ‘కుమారి’గానే ఉండిపోవడానికి నిశ్చయించుకుంటుంది. రాము జీవితం నుంచి శాశ్వతంగా అడ్డుతొలగిపోతుంది. అతని జీవితాన్ని అన్ని విధాల పండించి ఆమె మాత్రం విధి తరంగాలలో ఎక్కడో తప్పిపోయింది.

1979లో వచ్చిన ‘గోరింటాకు’  ఇప్పటికీ తెలుగు సినిమాల్లో క్లాసిక్‌గా నిలిచి ఉంది. నిర్మాత మురారి, కథకురాలు కె.రామలక్ష్మి, దర్శకుడు దాసరి నారాయణరావు, సంగీతకారుడు కె.వి. మహదేవన్‌... ఇంకా నటీనటులు అందరూ కలిసి ఆ సినిమాను తెలుగువారికి ప్రియమైన సినిమాగా మార్చారు. స్త్రీ కోరుకునేది పురుషుడి అనురాగం. అతడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా వంచన చేసినా ఆమె సహనంగా అతడిని ఆదరిస్తుంది. మార్పు కోరుకుంటుంది. అతడి బాగు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతుంది. స్త్రీ తాలూకు లోతైన ఈ భారతీయ స్వభావాన్ని చూపడం వల్లే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. అయితే అదే సమయంలో స్త్రీ ఎదురు తిరిగితే ఏమవుతుందో స్వప్న పాత్ర ద్వారా చూపిస్తారు. తనను మోసం చేసి తాళి కట్టిన దొంగ మొగడి ముఖాన తాళి తెంచి విసిరి కొట్టే సన్నివేశం గొప్ప ఇంపాక్ట్‌ చూపుతుంది. శోభన్‌బాబు, సుజాత ఈ సినిమాలో ఎంతో ముచ్చటగా అందంగా కనిపిస్తారు. నటిస్తారు. అలనాటి సూపర్‌స్టార్‌ సావిత్రి కథకు నిండుదనం తెస్తుంది. కథకు పెద్ద రిలీఫ్‌గా రమాప్రభ–చలం జంట. ఉత్తరాంధ్ర యాసలో వాళ్లిద్దరూ ఆకట్టుకుంటాడు. ‘ఏటంటావంటే నానేటంటాను... నువ్వేటంటే నానూ అదే అంటాను’ అని రమాప్రభ విజృంభిస్తుంది.

దేవులపల్లి – గోరింటా పూచింది కొమ్మా లేకుండా, వేటూరి– కొమ్మకొమ్మకో సన్నాయి, ఆత్రేయ– చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది, శ్రీశ్రీ– ఇలాగ వచ్చి అలాగ తెచ్చి వంటి  పాటలు ఈ సినిమాలో మహదేవన్‌ వల్ల నిలిచి వెలిగాయి. వెలుగుతున్నాయి. విశాఖ అందాలు, ఔట్‌డోర్‌లో తీసిన సన్నివేశాలు ఇప్పుడు చూసినా ఫ్రెష్‌గా ఉంటాయి.దాసరి సినిమాలు చాలా ఉండొచ్చు. కాని ఇది ప్రత్యేకం. ఎంతో బాగా పండి ఎప్పటికీ రాలిపోని గోరింటాకు ఇది. కూనిరాగం వస్తోంది... ఎలా ఎలా దాచావు అలవిగాని అనురాగం... మీరూ  కాడుకోండి.    
– కె

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement