నిజం చావకూడదు!
గౌతమి ఆవేదన ఏంటి? తను రాజకీయాల్లోకి రావాలనుకుంటోందా? కమల్‌హాసన్‌తో తెగతెంపుల తర్వాత ఈ సడన్ బరస్ట్ ఏంటి? గౌతమి మాట్లాడుతోందా? ఎవరైనా మాట్లాడిస్తున్నారా? జయలలితకీ, గౌతమికీ కనెక్షన్ ఏంటి? ‘పురట్చి తలైవి’ సమాధి అయిపోయింది కానీ, నిజం సమాధి కాకూడదు గౌతమితో వన్ టు వన్ ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...
⇔ జయలలిత చికిత్స వెనక ఉన్న రహస్యం తెలుసుకోవాలని చాలామందికి ఉంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టడానికి ఎవరూ రాలేదు. మొదటి గంట మీరు కట్టారు. ఏమిటా ధైర్యం?
మన కళ్ల ముందు ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు తట్టుకోవడం కష్టమవుతుంది. భరించలేని బాధ ఉంటుంది. ఆ బాధ మనల్ని మాట్లాడేలా చేస్తుంది. ఇక్కడ నా ధైర్యం గురించి మాట్లాడే ముందు నా బాధ గురించి మాట్లాడాలి. ఒక సామాన్య పౌరురాలిగా ‘అసలు జయలలితగారి ఇన్నాళ్ల చికిత్స వెనక ఏం జరిగింది?’ అని తెలుసుకునే హక్కు నాకు ఉందనిపించింది. అందుకే మాట్లాడాను.
⇔ జయలలిత గారికి దగ్గరుండి చికిత్స చేయించినవాళ్ల బ్యాక్‌గ్రౌండ్ మామూలుది కాదు... వాళ్లను ఎదుర్కోవడం కష్టాలు కోరి తెచ్చుకోవడమేనని కొందరి ఫీలింగ్!!
ఏమోనండి. అవతలివాళ్లు ఏంటి అనేది నేను ఆలోచించలేదు. కళ్ల ముందు జరిగిన ఘటనకు çసరైన సమాధానం లేదు. జయలలితగారిని కోట్ల మంది అభిమానిస్తున్నారు. వాళ్లందరూ చివరి రోజుల్లో ఆమెకు ఎటువంటి చికిత్స అందించారోననే విషయం గురించి ఓ క్లారిటీ కావాలనుకుంటున్నారు. పర్సనల్‌గా నాకు ఆవిడంటే చాలా అభిమానం. గడచిన 20 ఏళ్లల్లో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ సమయాల్లో ఆవిణ్ణి తలుచుకునేదాన్ని. జయలలితగారిని ఆదర్శంగా తీసుకుని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇతరులు ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి జీవితానికి సంబంధించిన బోలెడన్ని ప్రశ్నలు మిగిలిపోయినప్పుడు సమాధానం ఆశించడం తప్పు కాదు. ఆవిడ ఏమైనా... సాదాసీదా వ్యక్తా? ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇవాళ ఇండియాలో చాలా వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అలాగే జయలలితగారు ‘రేసీ’ పొలిటికల్ లీడర్. ఆవిడ మరణం ఓ మిస్టరీగా మిగిలిపోకూడదు.
⇔ జయలలిత ఆప్తురాలు శశికళపై చాలామందికి అనుమానాలున్నాయి. రహస్య చికిత్సలో కుట్ర ఉందని నమ్ముతున్నారా?
ఇక్కడ ఒకరి నమ్మకం.. మరొకరి అపనమ్మకంతో∙ఏదీ నిర్ణయించలేం. నమ్మకాలు నిజం కావొచ్చు. అపనమ్మకాలు అబద్ధం కావొచ్చు. ప్రధాన మంత్రిని నేను కోరిందేంటంటే.. ముందు ‘ఫ్యాక్ట్’ ఏంటో తెలుసుకోమని. అది తెలిశాక ప్రోసీడ్ అవ్వాలి. అలా చేయడమే మర్యాద. వాళ్లన్నారనీ, వీళ్లన్నారనీ కొందరిని అనుమానించి, ఆ దిశగా అడుగులు వేయకూడదు. నిజం తెలుసుకున్న తర్వాతే ఏదైనా చేయాలి.
⇔ మీరు స్పందించిన తర్వాత మరికొన్ని గొంతులు బయటికొచ్చాయ్. కానీ, జయలలితగారు ఆస్పత్రిలో ఉన్నప్పుడు మీరు స్పందించి ఉంటే ఉపయోగం ఉండి ఉండేదేమో?
జయలలితగారు అడ్మిట్ అయిన తర్వాత ఆవిడ పరిస్థితి తెలుసుకోవాలని, చూడాలని ఆస్పత్రికి వెళ్లినవాళ్లను అనుమతించకపోవడం ఏంటి? అసలెందుకంత రహస్యం? ఆవిడ రికవర్ అవుతున్నారని, ఫిజియోథెరపీ చేస్తున్నామని అప్పుడప్పుడూ కొంత సమాచారం ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. సరే... ఎవర్నీ ఆస్పత్రి లోపలికి అనుమతించకపోయినా... ఆవిడ బాగానే ఉన్నారనుకున్నాను. ఇంకో రోజులో డిశ్చార్జ్ అవుతారనే వార్త వచ్చాక ‘ఏం ఫర్వాలేదు’ అనుకున్నాను. నేనే కాదు, జయలలితగారు ఆస్పత్రిలో అడ్మిట్ అయినప్పటి నుంచి ‘ఇదిగో వస్తారు.. అదిగో వస్తారు’ అని అందరం అనుకుంటూ వచ్చాం. సడన్‌గా గుండెపోటు వచ్చిందని ప్రకటించారు. ఆ తర్వాత ‘ఇక లేరు’ అని వార్త విని షాకయ్యాను. ఆవిడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పలేదు. ఐసీయూలోనూ లేరు. మరి, సడన్‌గా చనిపోవడమేంటి అనేది చాలామందిలోని ప్రశ్న.
⇔ జయలలిత విషయంలో మీరు స్పందించడం వెనక రాజకీయ నేతల అండదండలు ఉండి ఉంటాయని ఊహాగానం!
భలేవారే! నాకెవరి అండదండలూ లేవండి. అంత సపోర్ట్ ఉండి ఉంటే.. నేను ఈ మధ్య ఓ పెద్ద నిర్ణయం తీసుకుని బయటికొచ్చినప్పుడు.. ఎక్కడ ఉండాలో తెలియక ఓ నెల రోజులు నా ఆఫీసులో ఉన్నాను. ఆ తర్వాత ఇల్లు చూసుకున్నాను. ఓ ఎమోషనల్ మూమెంట్ నుంచి నన్ను నేను బయటకు లాక్కుని మామూలు మనిషి కాగలిగాను. ఒకసారి నా జీవితం గురించి ఎనలైజ్ చేసుకున్నాను. ‘మనం ఎలాంటి హ్యుమన్ బీయింగ్? ఇన్నేళ్లు లైఫ్‌ని ఎలా లీడ్ చేశాం? ఇక మీద ఎలా ఉండాలి?’ అని ఆలోచించుకుని, ధైర్యంగా నిలబడ్డాను. అండదండలు మెండుగా ఉండి ఉంటే ఇంతలా ఎందుకు ఆలోచిస్తాను?
⇔జయలలిత అంటే మీకెందుకంత అభిమానం? ఆవిడకూ, మీకూ కనెక్షన్ ఏంటి? మృతదేహాన్ని చూసి అంతలా ఎమోషన్ అయ్యారెందుకని?
ఆమె నా పెళ్లికి వచ్చి, ఆశీర్వదించారు. ఆ తర్వాత ఓసారి కలిశాను. మూడు నాలుగు నిమిషాలు మాట్లాడి ఉంటానేమో. అప్పుడూ ఆవిడంటే ఇష్టమని చెప్పలేదు. ‘ఆడవాళ్లు ధైర్యంగా బతకాలి’ అని ఆవిడ తన లైఫ్ ద్వారా చూపించారు. ధైర్యాన్ని వెతుక్కునే ప్రతి స్త్రీకీ జయలలితగారు గొప్ప ఆదర్శం. ఆవిడ జీవితం అందరికీ తెలిసిందే. జయలలితగారు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న తీరు నాకిష్టం. అందుకే ఆవిడంటే చాలా అభిమానం.
⇔ ఆ మధ్య మోదీగారిని కలిశారు కాబట్టి జయలలితగారి గురించి ఆయనే మీతో ట్విట్టర్‌లో లెటర్ పెట్టించి ఉంటారనీ...
అస్సలు లేదండి. ఈ విషయంలో వేరే విధంగా ఆలోచించొద్దు. హుందాగా బతకాలనుకునే ఓ మహిళగా సాటి మహిళ.. అందులోనూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం జరిగిందనేది తెలుసుకోవాలనుకున్నాను. జయలలితగారు చాలా హుందాగా బతికారు. ఆవిడ చివరి రోజుల గురించి తెలుసుకోవాలనే తపన ఓ పౌరురాలిగా, ఆవిణ్ణి అభిమానించే వ్యక్తిగా నాకుంది. నేను నడుపుతున్న స్వచ్ఛంద సేవా సంస్థ ‘లైఫ్ ఎగైన్ ఫౌండేషన్’ గురించి మోదీగారితో మాట్లాడి, ఆయన సలహాలు తీసుకోవడానికే కలిశా. అంతే! అంత మాత్రానికే ఆయన మనోభావాలను నా భావాలుగా ట్విట్టర్‌లో పెట్టించేస్తారా?
⇔ ట్విట్టర్‌లో మీరు లెటర్ పెట్టాక వచ్చిన స్పందన?
ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. జయలలితగారి చుట్టూ ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఎంతమందికి ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ‘మీరెందుకు స్పందించారు?’ అని ఒక్కరు కూడా అడగలేదు.
⇔ మీ ఉత్తరానికి మోదీగారి నుంచి సరైన స్పందన వస్తుందనే అనుకుంటున్నారా?
99 శాతం వస్తుంది. ఆ విషయంలో డౌటే లేదు. మోదీగారు ప్రతిభావంతులు. దేశం కోసం ఆలోచించే వ్యక్తి. అందరి ప్రశ్నలకూ సమాధానం దొరుకుతుందనే నమ్మకం ఉంది.
⇔ ట్విట్టర్‌లో మీ లేఖ చూశాక ప్రభుత్వం వేగంగా కదిలిందనుకోవచ్చా? అందుకు ఓ ఉదాహరణ టీటీడీ బోర్డ్ మెంబర్, అన్నాడీఎంకేలో ఒక వర్గానికి సన్నిహితుడని భావిస్తున్న శేఖర్ రెడ్డిపై జరిగిన ఐటీ దాడులు..
ఓ సామాన్య పౌరురాలి ఆవేదనకు ప్రభుత్వం ఇంత చురుకుగా కదిలిందంటే అది హ్యాపీయే. కానీ, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఐటీ దాడులనేవి ఇప్పటికిప్పుడు జరపలేరు. కొన్ని రోజులుగా పథకం వేసి, ఆ తర్వాత చేస్తారు.
⇔ ∙రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ఇది తొలి అడుగా?
అస్సల్లేదండి. ఇంతకు ముందు చెప్పినట్లు నా ప్రస్తుత లక్ష్యం మా అమ్మాయి. వేరే దేని గురించీ ఆలోచించట్లేదు.
⇔ ∙‘విశ్వరూపం’ టైమ్‌లో జయలలితకీ, కమలహాసన్‌కీ మధ్య మనస్పర్థలొచ్చాయి. కమల్ నుంచి విడిపోయాక ఆయనపై కోపంతోనే ఇప్పుడు మీరు జయలలితపై స్పందించారని...
ప్రపంచంలో ఇంతకన్నా అమానుషం మరోటి ఉండదు. నా మనసులో ఫీలింగ్‌కి ఎప్పుడో జరిగిపోయిన విషయాలను ముడిపెట్టడం సరి కాదు. పనీపాటా లేనివాళ్లు ఒక గదిలో కూర్చుని ఇలాంటివి మాట్లాడతారనుకుంటా. ఏదో విషయానికి మరేదో విషయంతో పోలిక పెడితే ఈ ప్రపంచంలో బతకడం కష్టం. ఇలాంటి పోలికలు పెట్టి, ‘మేం తెలివిగలవాళ్లం’ అని ఫీలైపోతుంటారేమో. అసలు నా వ్యక్తిగత విషయానికీ, జయ విషయానికీ పోలికేంటి?
⇔ అంటే... కమల్ మీద మీకెలాంటి కోపం లేదంటారు?
ఆ వ్యక్తి మీద కోపం, కక్ష ఉంటే అంత హుందాగా ఆ ఇంటి నుంచి బయటకు రాను. ఆయన కూడా డిగ్నిఫైడ్ పర్సన్. మేమిద్దరం మా డిగ్నిటీని కాపాడుకున్నాం. విడిపోవాలన్నది ఇద్దరి నిర్ణయం. అది నేను స్పష్టంగా ఆ రోజు నా లెటర్ ద్వారా అందరికీ చెప్పా ను. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకిలా చేస్తాను? నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ చాలా హుందాగా బతికాను. డబ్బు సంపాదన కూడా ముఖ్యం అనుకోలేదు. జీవితంలో హుందాగా బతకాలనుకున్నాను.
⇔ దాదాపు పదిహేనేళ్లు కమల్‌గారితో కలిసి ఉన్నారు. సడన్‌గా బయటికొచ్చేశారు. యాభై ఏళ్ల వయసుకు దగ్గరవుతున్నప్పుడు ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం...?
నా జీవితంలో నేను తీసుకున్న అతి పెద్ద నిర్ణయం అది అని ఆ రోజే ట్విట్టర్‌లో చెప్పాను. నా వయసులో ఉన్న ఏ స్త్రీ అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టం. కానీ, తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ‘పరిస్థితిలో మార్పు వస్తుంది’ అని కొన్ని చాన్సులు ఇచ్చి చూసుకున్నాను. ‘ఇక ఇలానే ఉంటుంది’ అని ఇద్దరికీ తెలిసిపోయింది. అందుకే ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాం. ఉదయం లేచినప్పుడు ‘ఈ రోజు బాగుంటుంది. భవిష్యత్తు బాగుంటుంది’ అనే ఆలోచనతో నిద్ర లేవాలి. ఈరోజు ఎలా ఉంటుందో? ఎంత భారంగా గడుస్తుందో అనుకోకూడదు.
⇔ మీ టీనేజమ్మాయి సుబ్బలక్ష్మి ఈ మార్పునెలా తీసుకుంది?
‘ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్’. వెరీ మెచ్యూర్డ్. మొత్తం అర్థం చేసుకుంది.
⇔ ‘నా జీవితంలో తొలి ప్రాధాన్యం నా కూతురు’ అని గతంలో అన్నారు. ఆమె ఎలా స్థిరపడాలనుకుంటున్నారు
ఇప్పుడు చదువుకుంటోంది. ఏం చేయాలి? ఎలా సెటిల్ కావాలనే నిర్ణయాలు తీసుకోవడం చాలా తొందరపాటు అవుతుంది. కానీ, ఒక్కటి మాత్రం స్పష్టంగా చెబుతాను. ఎప్పటికీ నా తొలి ప్రాధాన్యం నా కూతురే. పిల్లలు తమను ఈ ప్రపంచంలో తీసుకురమ్మని అడగరు. తల్లితండ్రులు కంటారు. భూమ్మీదకు తీసుకురావడంతో పనైపోయిందనుకోకూడదు. వాళ్ల కోసమే బతకాలి. మన మీద ఆధారపడ్డ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి. అప్పుడే ఆ మాతృత్వానికి ఓ అర్థం ఉంటుంది.
⇔ ప్రస్తుతం మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ మధ్య రెండు సినిమాల్లో నటించారు. కంటిన్యూ అవుతారా?
సినిమాల్లో నటించాలనుకుంటున్నా. సీరియల్స్ కూడా చేయాలనుకుంటున్నా. కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చేస్తా. నిర్మాతగానూ చేయాలనుంది. చూద్దాం.
– డి.జి. భవాని