తమిళ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ప్రధాన పార్టీలు పరస్పర విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ సవాళ్లు.. ప్రతి సవాళ్లకు దిగుతున్నాయి. ముఖ్యంగా సీఎం ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మధ్య మాటల తూటాలను పేలుతున్నాయి. మహిళలను అవమానించిన డీఎంకే నేతలకు బుద్ధి చెప్పాలని ఎడపాడి పిలుపునిస్తే.. అవినీతి అన్నాడీఎంకేను ఓడించాలని స్టాలిన్ కోరుతున్నారు. అమ్మ పాలన కొనసాగాలంటే రెండాకులకే ఓటెయ్యాలని పళనిస్వామి విన్నవిస్తుంటే.. ఉదయ సూర్యుడిని గెలిపిస్తే ప్రజా హక్కులను కాపాడుతామని హామీ ఇస్తున్నారు. మరోవైపు మక్కల్ నీది మయ్యం తరఫున కమల్‌హాసన్ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో నేతలు తీవ్రస్థాయిలో వాగ్బాణాలు సంధిస్తున్నారు.
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే, డీఎంకే మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పరస్పరం ఘాటు విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.
మహిళా ద్రోహి డీఎంకేకు బుద్ధి చెప్పండి : ఎడపాడి
మహిళలను కించపరుస్తూ దుర్భాషలాడిన డీఎంకే నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ముఖ్య మంత్రి ఎడపాడి పళనిస్వామి పిలుపునిచ్చారు. సోమవారం చెన్నై మైలాపూర్, అశోక్‌నగర్, టీ నగర్ నియోజకవర్గాల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం చేశారు. చెన్నై మేయర్‌గా, మంత్రిగా ఏళ్ల తరబడి పనిచేసిన స్టాలిన్ ప్రజల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళలను చులకనగా చూసే డీఎంకేను ఓడించాలని కోరారు. రెండాకులకు ఓటేసి గెలిపిస్తే ఇంటి వద్దకే రేషన్ సరుకులు చేరుస్తామని హామీ ఇచ్చారు. అమ్మ జయలలిత ఆశయాలను నెరవేర్చేలా పాలన సాగిస్తామన్నారు. ఆరు నెలల వంట గ్యాస్ ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు.
మనీ కోసమే ‘మణి’ల ఆరాటం : స్టాలిన్
అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ముగ్గురు ‘మణి’లు మనీ కోసం ప్రజలను యథేచ్ఛగా దోచుకున్నారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ఎడపాడి పళనిస్వామి కేబినెట్‌లోని మంత్రులు వేలుమణి, తంగమణి, కేసీ వీరమణి ప్రజాధనం లూటీ చేశారని మండిపడ్డారు. కేసీ వీరమణి, అతని బినామీల ఇళ్లపై నాలుగేళ్ల క్రితం ఐటీ దాడులు జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. ఉదయ సూర్యుడికి ఓటేసి డీఎంకేను గెలిపిస్తే ప్రజా హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. డీఎంకే నేత, ఎంపీ కనిమోళి తిరుచెందూరులో ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అన్నాడీఎంకేకు తగిన గుణపాఠం నేర్పా లని పిలుపునిచ్చారు.
అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కమల్
మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గ ప్రజలతో ఆన్‌లైన్‌లో ముచ్చటించారు. రమ్య అనే అభిమాని మిమ్మల్ని నేరుగా చూడాలని ఉందన్నారు. ఆదివారం రాత్రి కామరాజపురంలో ప్రచారానికి వచ్చిన కమల్ ప్రసంగం మధ్యలో ఆమె పేరును పేర్కొంటూ ఆహ్వానించారు. ప్రచార వాహనం వద్దకు వచ్చిన నిండు గర్భిణి అయిన రమ్యకు డైరీలో ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆనందపరిచారు.
కమల్‌పై గౌతమి ఫైర్
కమల్‌కు హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించిన గౌతమి.. కొన్నేళ్లపాటు ఆయనకు సన్నిహితరాలిగా మెలిగారు. ఆ తర్వాత ఇద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. ఈ క్రమంలో కమల్‌పై గౌతమి పలు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తానని కమల్ చెబుతున్నారని, అయితే ఆ మార్పును ప్రజలు కోరుకుంటున్నారో.. లేదో మే 2న తెలిసిపోతుందని చెప్పారు. మార్కెటింగ్ మాయాజాలంలో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment