
సర్ విద్యాధర్ సూరజ్‌ప్రసాద్ నైపాల్
గణించదగిన నా విలువేమైనా ఉంటే అదంతా నా పుస్తకాల్లో ఉంది. నా పుస్తకాల మొత్తం నేను, అన్నారు వి.ఎస్.నైపాల్‌గా సుపరిచితులైన సర్ విద్యాధర్ సూరజ్‌ప్రసాద్ నైపాల్ (1932–2018). ట్రినిడాడ్‌లో స్థిరపడిన భారతీయ కుటుంబపు రెండో తరంలో జన్మించాడు నైపాల్. చిన్నతనంనుంచే ‘రచయిత’ అనే మాటకు ఉండే ఆకర్షణ ఆయన్ని పట్టేసింది. దానికి తగ్గట్టుగానే యాభై ఏళ్లలో ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ముప్పై పుస్తకాలు వెలువరించారు. ఇండియా, ఆఫ్రికా, ఇస్లాం సమాజం, ఉత్తర దక్షిణ అమెరికాల గురించి విస్తృతంగా రాశారు. ట్రినిడాడ్‌లో వాళ్ల నాన్న జీవితాన్ని చిత్రించిన ‘ఎ హౌజ్ ఫర్ మిస్టర్ బిశ్వాస్’ ఆయనకు బాగా పేరు తెచ్చింది. ఈ నవలతో రచయితగా తన అప్రెంటిస్‌షిప్ ముగిసిందని సరదాగా వ్యాఖ్యానించారు. ‘ది ఎనిగ్మా ఆఫ్ ఎరైవల్’ ట్రినిడాడ్ నుంచి వెళ్లిన నైపాల్ ఇంగ్లండ్ జీవితాన్ని చిత్రిస్తుంది. ‘ఇండియా: ఎ వూండెడ్ సివిలైజేషన్’, ‘ఎ ఫ్లాగ్ ఆన్ ది ఐలాండ్’, ‘గెరిల్లాస్’, ‘హాఫ్ ఎ లైఫ్’, ‘ఏరియా ఆఫ్ డార్క్‌నెస్’, ‘ద రైటర్ అండ్ ద వరల్డ్’ ఆయన ఇతర రచనల్లో కొన్ని. 2001లో నోబెల్ గౌరవం పొందిన నైపాల్ మొన్న ఆగస్టు 11న మరణించారు.