అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు!
- రిచా చద్దా, హీరోయిన్
‘ఒయ్ లక్కీ! లక్కీ ఒయ్’తో చిత్రసీమకు పరిచయమైన రిచా చద్దా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’ మొదటి, రెండు భాగాలలో నటించారు. ఉత్తమనటిగా ‘ఫిలింఫేర్’ అవార్డ్ గెలుచుకున్నారు. ఆమె మనసులో మాటలు...‘‘నేను హీరోయిన్ కావాలనుకుంటున్నాను’’ అని ఇంట్లో చెప్పినప్పుడు ‘‘అయ్యి ఏంచేస్తావమ్మా?’’ అని వ్యంగ్యంగా అన్నారే తప్ప నా తల్లిదండ్రులు ప్రోత్సాహకరంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ, ఆ మాటలతో నేనేమీ నిరాశ పడిపోలేదు. నా కలను నెరవేర్చుకోవడానికి ముంబాయికి వచ్చాను. నాకు గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేరు. ‘మనలోని ప్రతిభే మన గాడ్‌ఫాదర్’ అనుకొని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను.
కేన్స్ ఫెస్టివల్‌లో ఎందరో ప్రముఖులతో మాట్లాడే అవకాశం వచ్చింది. ‘‘మీరు బాలీవుడ్ హీరోయిన్ కదా!’’ అని అక్కడ ఎవరో పలకరింపుగా అడిగారు.‘‘కాదు’’ అన్నాను.‘‘అదేమిటి? మీరు ఫలానా సినిమాలో హీరోయిన్‌గా చేశారు కదా’’ అని ఆశ్చర్యంగా అడిగారు ఆయన. ‘‘మీరన్నది నిజమేగానీ, నేను బాలీవుడ్ నటిని కాదు... భారతీయ నటిని’’ అన్నాను. ‘బాలీవుడ్ నటి’ అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానిలో ‘దేశీయత’ ధ్వనించదు.
‘‘చేతి నిండా సినిమాలు ఉన్నాయి’’ అని చెప్పుకోవడానికి మూస పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. నమ్ముతారో లేదోగానీ కొన్ని పెద్ద సినిమాలను కూడా నేను తిరస్కరించాను. నచ్చిన పాత్రలు లభించక మొదటి సినిమాకు రెండో సినిమాకు మధ్య నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాను. ఆ సమయంలో నాకు నచ్చిన నాటకాల్లో నటించాను.‘కెనడీ బ్రిడ్జి’ అనే నాటకం నాకు ఎంతో పేరు తెచ్చింది. కొందరైతే ‘‘నాటకాన్ని భుజాల మీద మోశావు’’ అన్నారు. ఎక్కువ సినిమాలు చేశామనే తృప్తి కంటే ఇలాంటి ప్రశంసల వల్ల లభించే తృప్తే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.