
వినూత్నమైన సూది
మెదడులోని వేర్వేరు భాగాలకు అతి కచ్చితత్వంతో మందులు చేర్చేందుకు మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన సూదిని అభివద్ధి చేశారు. మనిషి వెంట్రుక మందం మాత్రమే ఉండే ఈ సూదితో కేవలం ఒకే ఒక ఘనపు మిల్లీలీటర్ మోతాదు మందులను కూడా పంపవచ్చు. ఎలుకలపై పరిశోధనలు జరపడం ద్వారా తాము వాటిలోని కదలిక సమస్యలను పరిష్కరించగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కానన్ డాగ్‌డేవీరెన్ తెలిపారు. ఈ సూదిలో కొన్ని అతిసూక్ష్మమైన గొట్టాలు ఉండటం.. వాటిద్వారా వేర్వేరు మందులను ఏకకాలంలో మెదడులోకి పంపగలగడం దీని ప్రత్యేకతలని వివరించారు.
పది సెంటీమీటర్ల పొడవు, 30 మైక్రోమీటర్ల వెడల్పు ఉండే గొట్టాలను ఉక్కుతో తయారైన సూదిలోపల ఉంటాయని ప్రత్యేకమైన పంపులు, వ్యవస్థ ద్వారా మందుల మోతాదులను నియంత్రించవచ్చునని వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఏ మందైనా మెదడు మొత్తం వ్యాపించిన తరువాతే పనిచేస్తుందని.. ఫలితంగా కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయని.. కొత్త సూదితో ఈ సమస్యలు ఉండవని చెప్పారు. సమస్యకు అనుగుణంగా మెదడులోని ఏ భాగానికి మందు చేరాలో నిర్ణయించుకోగలగడం ద్వారా వేగంగా ఫలితాలు పొందవచ్చునని తెలిపారు.