ప్రార్థనకు నయం చేసే శక్తి ఉందా?...
సంజీవని
ప్రతి మనిషికి మరో మనిషిని స్వస్థత పరిచే శక్తి ఉంటుంది. మాట ద్వారానో, స్పర్శ ద్వారానో, ప్రార్థన ద్వారానో వారు సాటి మనిషిని రుగ్మత/జబ్బు/అనారోగ్యం నుంచి బయటపడేస్తారు. ఇళ్లల్లో కూడా చూస్తూ ఉంటాం. ఎవరో జబ్బు పడతారు... వాళ్లకు ఎవరో ఒక దగ్గరి బంధువు మీద ప్రేమ, అభిమానం లేదంటే మమకారం ఉంటాయి. ఎందరు పలకరించినా కోలుకోకుండా ఆ ఫలానావాళ్లు వచ్చి నీకేం కాలేదు లే అని అనగానే లేచి కూచుంటారు. అలా ఎందుకు జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కాని అలా జరుగడం అందరికీ తెలుసు. కాకపోతే ఈ శక్తి మహనీయులకు ఎక్కువగా ఉంటుంది.
రాముడి కాలు తగిలి బండరాయిలా పడి ఉన్న అహల్య మనిషయ్యిందని పురాణ కథనం. యదార్థ దృష్టిలో చూస్తే అంతవరకూ జడత్వంతో మనోవైకల్యంతో ముడుచుకుపోయిన అహల్య రాముడి సాంత్వనం వల్ల ఓదార్పు వల్ల కరస్పర్శ వల్ల కోలుకుందని అర్థం చేసుకోవాలి. ఏసుప్రభువు మాయలు మంత్రాలు ఏమీ చేయలేదు. తన కొద్దిపాటి స్పర్శతో అంధునికి చూపు తెప్పించాడు. కుష్టువ్యాధిగ్రస్తుడి దేహాన్ని రసి రహితం చేశాడు. సాయిబాబా జీవితంలో ఇతరులను స్వస్థత పరచిన ఉదంతాలు ఎన్నో గ్రంథస్తం అయ్యాయి. ఆయన తన భౌతిక దేహాన్ని చాలించినది కూడా ఇతరుల అస్వస్థతను తన వంటి మీదకు తెచ్చుకోవడం వల్లనే అని విశ్వాసం.
యోగుల జీవితాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా ఉంటాయి. దేశంలోని అనేక దేవాలయాలు, చర్చ్‌లు, మసీదులు, దర్గాలు... వెళ్లి ప్రార్థన చేస్తే నయం అవుతుందన్న నమ్మకాన్ని స్థిరపరిచి ఉన్నాయి. విశ్వాసం కూడా ఒక్కోసారి ఔషధంగా పని చేస్తుందనడంలో అవాస్తవం లేదు. హిమాలయ పరమగురువు స్వామి రామ తన పుస్తకం ‘ఎట్ ద ఫీట్ ఆఫ్ ఏ హిమాలయన్ మాస్టర్’ అనే పుస్తకంలో హిమాలయ పరమ గురువులు స్టెత్ పెట్టకుండా, నాడీ పరీక్షించకుండా ఎదుటివారిని ఎలా స్వస్థత పరిచారో విపులంగా రాశారు. స్వామి రామ గురువు పేరు ‘బెంగాలీ బాబా’. ఒకసారి వారిద్దరూ ఒక ఊరిలో భిక్షాటనకు వెళ్లారు. వీధిలో కనిపించిన ఒక వ్యక్తి మా యింటికి రండి భిక్ష వేస్తాను అని పిలుచుకువెళ్లాడు. కాని ఆ ఇంటి ఇల్లాలు అందుకు నిరాకరించింది. ‘మన కష్టాల్లో మనముంటే నీకు స్వామీజీలను ఇంటికి తీసుకురావాలని ఎలా అనిపించింది? మన పిల్లవాడు మసూచీతో బాధపడుతున్నాడని నీకు తెలియదా? వాడు చనిపోబోతున్నాడు. ఇలాంటి సమయంలో ఇతరులకు అతిథి మర్యాదలు మనం చేయగలమా?’ అని అతడిని నిందించింది. ఇది గురుశిష్యులు ఇద్దరూ విన్నారు. ఆ వ్యక్తి నిస్సహాయంగా బయటకు వచ్చి ‘క్షమించండి స్వామీ’ అన్నాడు. అప్పుడు స్వామి రామ గురువు ‘నేను మీ అబ్బాయిని రక్షిస్తాను’ అని అన్నారు. అని ఇంట్లోకి వెళ్లారు. ఒక గ్లాసు నీళ్లు తెప్పించి ఆ గ్లాసు పట్టుకుని రోగ గ్రస్తుడైన పిల్లవాడి మంచం చుట్టూ తిరిగారు. ఆ తర్వాత ఆ నీళ్లు తాగేశారు. కొన్ని నిమిషాల్లో పిల్లవాడి ఒంటి మీద ఉన్న మసూచి వ్రణాలు ఆయన శరీరం మీదకు వచ్చాయి. శిష్యుడైన స్వామి రామ అది చూసి భయపడిపోయాడు. గురువును చూసి రోదించసాగాడు. శిష్యుడిని తీసుకొని బయటకు వచ్చేసిన గురువు ఒక చెట్టు కింద నిలబడ్డారు. కాసేపటికి ఆయన ఒంటి మీద ఉన్న వ్రణాలు చెట్టు మీద ప్రత్యక్షమయ్యాయి. మరి కాసేపటికి అవి మాయమైపోయాయి. ఈ ఉదంతాన్ని ఆయన తన పుస్తకంలో రాశాడు.
అయితే స్వస్థత పరిచే శక్తి కలిగిన ఎందరో మహనీయులు దాదాపుగా ఆ పనికి ఇష్టపడకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి స్వస్థత పరిస్తే ప్రజలు ధన కనక వస్తు వాహనాలతో వారిని సత్కరించడానికి పూనుకుంటారు. దాని వల్ల వ్యామోహం కలుగుతుంది. ఫలితంగా స్వస్థత పరిచే శక్తి పోతుంది. ఇప్పటికీ నోట్ల కట్టలతో హిమాలయాల్లో ఉన్న మహనీయుల చుట్టూ తిరిగే కుబేరులు చాలామంది ఉన్నారు. వారిని తప్పించుకుని తిరిగే మహనీయులూ ఉన్నారు. ‘ఒక డబ్బున్న వ్యక్తి ఎంతకూ తగ్గని తన తలనొప్పిని తగ్గించమని నోట్ల కట్టలతో ఒక హిమాలయ గురువు దగ్గరకు వచ్చాడు. గురువు ఆ డబ్బును తిరస్కరించాడు. ఆ వ్యక్తి పదే పదే ప్రార్థించడంతో సరే... ఇక నీకు తలనొప్పి రాదు పో అని అన్నాడు. అంతే. తలనొప్పి పోయింది’ అని కూడా స్వామి రామ తన పుస్తకంలో రాశారు.
మహనీయులే కాదు ప్రజలు కూడా తాము అభిమానించే వారిని తమ అభిమానంతో బతికించుకోగలరు. సినీ నటుడు అమితాబ్ షూటింగ్ ప్రమాదంలో గాయపడినప్పుడు దేశమంతా ప్రార్థనలు చేసి అతణ్ణి బతికించుకుంది. వైద్యప్రమేయంతో పాటు దైవ ప్రమేయం కూడా ఒక్కోసారి అవసరమవుతుంది. రజనీకాంత్ అనేకసార్లు తీవ్రమైన అస్వస్థతకు లోనై కూడా అభిమానుల ప్రార్థనలతో కోలుకున్నాడని చెప్పాలి.
ఇప్పుడు జయలలిత వంతు.
తమిళనాడు ప్రజల విశేష అభిమానాన్ని చూరగొన్న జయలలిత గత కొన్నిరోజులుగా అస్వస్థతో ఆస్పత్రిలో ఉన్నారు. వైద్యులు హోరాహోరీగా ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆమె కోసం ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. స్వస్థత పరిచే శక్తిని తమ మనోభీష్టం నుంచి సృష్టించి ఆమెకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మనసు ఒకటి గట్టిగా కోరుకుంటేనే అది జరుగుతుందని నమ్మకం. అన్ని లక్షల మనస్సులు గట్టిగా ఒకటి కోరుకుండా ఆ కోరిక ఒక శక్తి రూపం దాల్చవచ్చు. అది స్వస్థతకు సహాయపడవచ్చు. నాస్తికులు, బుద్ధిజీవులు, తార్కికవాదులు ఇలాంటి వాదనలన్నింటినీ కొట్టి పడేయవచ్చు. పై వాదనను బలహీన పరిచే వాదనలు వారి దగ్గర బోలెడన్ని ఉండవచ్చు. కాని ఇండియా ఉద్వేగాల దేశం. విశ్వాసాల దేశం. బుద్ధికంటే ఎక్కువగా హృదయమే ఈ దేశాన్ని పాలించింది.