
‘ఆ నీటిని నువ్వు అక్కడవున్న చామంతి
చెట్టుకు పోసివుండొచ్చుకదా?’ మళ్లీ
అన్నాడు గురువు. తను చేసిన తప్పేమిటో
తెలిసివచ్చి సిగ్గుపడ్డాడు శిష్యుడు.
అదొక బౌద్ధాశ్రమం. ఒక జెన్ మాస్టర్ స్నానం చేయడానికి వేడినీటిని తొట్టిలోకి వంపుకున్నాడు. ఆ వేడినీటిలో కలపడానికి కొన్ని చన్నీళ్లు తెమ్మని శిష్యుడిని పురమాయించాడు. శిష్యుడు బావి నుంచి చేదుకుని ఒక కుండలో నీళ్లు తెచ్చాడు. వాటిని వేడినీటి తొట్టిలో పోస్తూ, చేతితో వేడిని అంచనా వేస్తూ, గోరువెచ్చగా అయ్యేదాకా పోశాడు. అలా పోయగా అడుగున కొన్నినీళ్లు మిగిలిపోయినై. వెంటనే వాటిని నేలమీద పారబోశాడు. అది గమనించిన, జెన్ మాస్టర్‌కు ఆగ్రహం వచ్చింది. ‘ఆ నీటిని అలా అనాలోచితంగా ఎందుకు పారబోశావు?’ అడిగాడు గురువు. దానికి శిష్యుడి నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది.
‘ఆ నీటిని నువ్వు అక్కడవున్న చామంతి చెట్టుకు పోసివుండొచ్చుకదా?’ మళ్లీ అన్నాడు గురువు.తను చేసిన తప్పేమిటో తెలిసివచ్చి సిగ్గుపడ్డాడు శిష్యుడు. ‘గురువర్యా! మీరు చెప్పిన ఈ పాఠాన్ని నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. అలా గుర్తుంచుకునేలా ఈ రోజునుంచీ నా పేరును ‘తెకుసుయి’గా మార్చుకుంటున్నాను’ అని స్థిరంగా జవాబిచ్చాడు. తెకుసుయి అంటే ఒక నీటిచుక్క.గురువు సంతృప్తిగా స్నానం చేయడానికి తొట్టిలోకి దిగాడు.ఒక విలువైన పాఠం నేర్చుకోవడానికి ఒక జీవితం మొత్తాన్ని అంకితం చేస్తేనేమి!
Comments
Please login to add a commentAdd a comment