
మా తాతగారు, నానమ్మ, పెద్దనాన్న, మా నాన్నగారు క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్ బారిన పడి ఉంటే, ఆ కుటుంబ వారసులూ జాగ్రత్తగా ఉండాలని చదివాను. మా కుటుంబ వైద్య చరిత్రలో క్యాన్సర్ ఉంది కాబట్టి నేనూ క్యాన్సర్‌తో చనిపోతాననే ఆందోళన ఉంది. దయచేసి నా అనుమానాలకు తగిన సమాధానాలు ఇవ్వండి.
– రఘు, విజయవాడ
మీరిలా అనుమానించడం కరెక్టే. క్యాన్సర్ వ్యాధి బారిన పడి చనిపోయిన కుటుంబ చరిత్ర ఉంటే వాళ్ల వారసులకు ఈ వ్యాధి సోకే ముప్పు కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. దీనికి స్త్రీ, పురుషులు, వయసు వంటి అంశాలతో సంబంధం లేదు. ఎవరికైనా రావచ్చు. అయితే మీ తాతగారి కాలంలో క్యాన్సర్ వ్యాధికి సరైన చికిత్సే కాదు... దానిని ముందుగా కనిపెట్టేందుకు తగినంత వైద్యపరిజ్ఞానం కూడా లేదు. దాంతో అప్పట్లో క్యాన్సర్ పదం వింటేనే ఆ వ్యాధి బారిన పడ్డవారిపై ఆశలు వదలుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో పాటు నిపుణులైన డాక్టర్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. అంతేకాదు, ముఖ్యంగా ఈ క్యాన్సర్ వ్యాధిని ముందే గుర్తించే అధునాతనమైన వైద్య పరికరాలు, ఉపకరణాలు, వైద్య పరీక్షలు, ఇతరత్రా అనేక ప్రక్రియలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఏ రకమైన క్యాన్సర్‌నైనా మొదటిదశలోనే గుర్తిస్తే దాన్ని సమూలంగా రూపుమాపవచ్చు. సకాలంలో గుర్తిస్తే దాదాపు 75 శాతం వరకు దీనిని ఎదుర్కొనే వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ దీని బారిన పడ్డవారు చివరిదశలో చికిత్సకోసం వస్తే మాత్రమే వారి జీవితానికి 25 శాతం హామీ ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే... మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న అలవాట్లను బట్టి మీరు వెంటనే కొన్ని వైద్యపరీక్షలు చేయించుకుంటే మీకు క్యాన్సర్ వస్తుందా, రాదా అని కూడా చెప్పవచ్చు. మీకు ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చు. ఒకవేళ చెడు అలవాట్లకు లోనైతే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే అందరూ గుర్తించి, పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి... ∙పొగతాగే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మానేయాలి ∙విపరీతంగా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు ∙క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ∙తాజా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు తినాలి ∙చిన్నప్పుడు ఇవ్వాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్‌లను పిల్లలకు ఇవ్వాలి.
కాంబినేషన్ కీమోథెరపీతో క్యాన్సర్‌కు చెక్
నా వయసు 33 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతుంటే చెన్నై వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్ అని తేలింది. వెంటనే కీమోథెరపీ మొదలుపెట్టాలని డాక్టర్లు చెప్పారు. కానీ కొందరు బంధువులు, స్నేహితులు కీమోథెరపీ అంటే భయపెడుతున్నారు. అసలు కీమోథెరపీ అంటే ఏమిటి? క్యాన్సర్ చికిత్సలో దాని ప్రయోజనాలు ఏమిటి? – భానుప్రసాద్, కర్నూలు
మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు. సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా శరీరంలోని కొన్ని ప్రాంతాలలో తిష్టవేసిన క్యాన్సర్ కణజాలాన్ని తొలగించగలుగుతాం లేదా నాశనం చేయగలం. కీమో ద్వారా శరీరంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ క్యాన్సర్ కణజాలాన్ని నిర్మూలించవచ్చు. కీమోథెరపీ ద్వారా శరీరంలో ముందుగా ఏర్పడిన క్యాన్సర్ కణితి మొదలుకొని శరీరంలోని అనేక భాగాలకు విస్తరించిన క్యాన్సర్ కణజాలాన్ని సైతం ధ్వసం చేయవచ్చు. కీమోథెరపీలో 100కు పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి క్యాన్సర్ చికిత్స కోసం వీటిలో ఒకే మందును సైతం వాడవచ్చు. అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక క్రమపద్ధతిని అనుసరించి అందించే విధానాన్ని కాంబినేషన్ కీమోథెరపీ అని వ్యవహరిస్తారు. పలు రకాల మందులు, వాటి ప్రభావాల తీరు వల్ల ఉమ్మడిగా క్యాన్సర్ కణాలపై పోరాడి వాటిని సమూలంగా సంహరించగలుగుతాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్ కణాలు ఆ మందుకు లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కాంబినేషన్ కీమోథెరపీని వినియోగిస్తారు. మీ విషయంలో ఏ విధానం అవలంబించాలన్నది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. అలాగే కీమోథెరపీలో భాగంగా మందులను ఎంత మోతాదులో, ఏవిధంగా, ఎప్పుడెప్పుడు, ఎంతకాలం ఇవ్వాలన్నది కూడా చికిత్సలో భాగమే. ఈ నిర్ణయాలన్నీ కూడా మీరు ఏ రకమైన క్యాన్సర్ కణితితో బాధపడుతున్నారు, శరీరంలో అది ఏ భాగంలో ఉంది, ఎంత పెద్దగా ఉంది, అది మీ శరీర కార్యకలాపాలను, ఆరోగ్యాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తోంది అన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీలో భాగంగా ఇచ్చే మందులను బట్టి మీ శరీరంలో అనేక విధాలుగా అతివేగంతో విస్తరించే క్యాన్సర్ కణాల విధ్వంసం జరుగుతుంది. క్యాన్సర్‌లో చాలా రకాలున్నాయి. అవి శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా పెరుగుతుంటాయి. కాబట్టి అవి పెరిగే విధానాన్ని అనుసరించి, వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక కీమోథెరపీ మందులను రూపొందించడం జరిగింది.
డాక్టర్ నిఖిల్ గడియాల్ పాటిల్,
సీనియర్ మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment