హోమియో కౌన్సెలింగ్
నా వయసు 49 ఏళ్లు. బాగా ముక్కితే గానీ మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ధనరాజు, అనకాపల్లి
మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్‌లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి. మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది.
ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా, కొలిన్‌సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్
నా కిడ్నీ పాడైందా?!
కిడ్నీ కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. గత పదేళ్ల నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాను. కానీ ఒకసారి శరీరంలో చక్కెరస్థాయి పెరిగి కళ్లు తిరిగి పడిపోయాను. చికిత్స తర్వాత కొన్నాళ్ల పాటు డాక్టర్లు ఇన్సులిన్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం వారి సూచనల మేరకే మళ్లీ మందులు వాడుతున్నాను. అయితే కొంతకాలం నుంచి నా ముఖం చాలా ఉబ్బినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా కాళ్లలో వాపుతో పాటు మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉండి కాస్త ఇబ్బంది కలుగుతోంది. ఈ లక్షణాలతో నేను తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాను. ఉద్యోగం కూడా సరిగా చేయలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు, ఆఫీసులోని కొలీగ్స్ అందరూ కిడ్నీ పాడైపోయిందని భయపెడుతున్నారు. అసలు నాకు ఏమైంది? వాళ్లు చెబుతున్నది నిజమేనా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - శ్రీనివాస్, అనంతపురం
మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీరు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. మీకు కాళ్లలో వాపులతో పాటు ముఖం ఉబ్బినట్లుగా ఉందని చెబుతున్నారు. అయితే వీటితో పాటు ఆకలి మందగించడం, నీరసంగా ఉండటం, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రం రావడం లాంటి లక్షణాలతో ఏమైనా సతమతమవుతున్నారా... అనే విషయాలను కాస్త గమనించండి. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మంచి నెఫ్రాలజిస్టును సంప్రదించండి. వారు మీకు ముందుగా సీరమ్ క్రియాటినిన్, అల్ట్రా సౌండ్ లాంటి కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఏమైనా అసాధారణ ఫలితాలు వస్తే మరింత లోతుగా పరిశీలించేందుకు జీఎఫ్‌ఆర్, స్కానింగ్ లాంటి పరీక్షల ద్వారా కిడ్నీ పనితీరును క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు తేలితే అందుకు తగ్గట్లుగా చికిత్సా విధానాన్ని అవలంబిస్తారు. ఇందుకు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కిడ్నీ సమస్యకు మంచి మందులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన పలితాలు పొందగలుగుతారు. అలాకాకుండా మీరు చికిత్సపై అనుమానాలు పెంచుకుని డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం చేస్తే మీ సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్‌కు గురైన కిడ్నీకి చికిత్సను తాత్సారం చేస్తే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి.
ఒక్కోసారి ఏకంగా కిడ్నీనే తొలగించాల్సి వస్తుంది. డయాబెటిస్ ఉందని చెప్పి మీరు మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. మాంసాహారాన్ని మితంగా తినండి. మద్యపానం, పొగతాగడం వంటి దురలవాట్ల జోలికి వెళ్లకండి. మీ ఎత్తుకు తగిన విధంగా మీ శరీర బరువు ఉండేలా చూసుకోండి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, రోజుకు 4 నుంచి 6 లీటర్ల నీటిని తాగడం, తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఆహారాన్ని ఒక్కోసారి పెద్దమొత్తంలో తీసుకోకుండా... కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకునేలా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా మీరు విలువైన సమయాన్ని వృథా చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్సను పొందండి.
డాక్టర్ సాయిరాం రెడ్డి సీనియర్ నెఫ్రాలజిస్టు అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ సికింద్రాబాద్