నా వయసు 35 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి అల్సర్ అన్నారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?
ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి.
జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణాశయంలో ఆల్సర్లు పెరుగుతాయి.
కారణాలు:
►80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి
►చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది
►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం
►మద్యపానం, పొగతాగడం
►వేళకు ఆహారం తీసుకోకపోవడం
►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి.
లక్షణాలు:
►కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం
►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం
►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు
►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం
►నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం.
నివారణ... జాగ్రత్తలు:
►పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి
►మద్యపానం,
►పొగతాగడం అలవాట్లు మానేయాలి
►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి
►కంటినిండా నిద్రపోవాలి
►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి
►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి.
చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
ఆటిజమ్ తగ్గుతుందా?
మా బాబుకు మూడున్నర ఏళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో ఈ సమస్యకు చికిత్స అందుబాటులో ఉందా? దయచేసి వివరంగా చెప్పండి.
ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడే వారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటిజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి.
ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ∙వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారికి స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలను బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా?
నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా?
మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ తిరగబెట్టడం మామూలే.
కారణాలు:
►దీర్ఘకాలిక మలబద్దకం
►ఎక్కువకాలం విరేచనాలు
►వంశపారంపర్యం
►అతిగా మద్యం తీసుకోవడం
►ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం
►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది.
లక్షణాలు:
►తీవ్రమైన నొప్పి, మంట
►చురుకుగా ఉండలేరు
►చిరాకు, కోపం
►విరేచనంలో రక్తం పడుతుంటుంది
►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట.
చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,
పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
Comments
Please login to add a commentAdd a comment