ఆరోగ్యానికి అండ... నువ్వుండ
గుడ్ ఫుడ్
చిన్నప్పుడు నువ్వుల ఉండలు, నూజీడీలు తినకుండా పెరిగి పెద్దయిన వారు ఉండరు. నువ్వుల్లో ఐరన్, క్యాల్షియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, కాపర్, జింక్, ఫైబర్, థయామిన్, విటమిన్ బి6, ఫోలేట్, ట్రిప్టోఫాన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. రక్తహీనత ఉన్నవారికి బెల్లం–నువ్వులతో చేసిన ఉండలు తినమని నిపుణులు ఇప్పటికీ చెబుతుంటారు.
ఆహారంలో నువ్వులు క్రమం తప్పకుండా తినేవారిలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులోని మెగ్నీషియమ్ వ్యాసోడయలేటర్‌గా (రక్తనాళాలను విప్పార్చడం) పనిచేయడం వల్ల ఈ ప్రయోజనం చేకూరుతుంది. అన్ని రకాల ఖనిజాలు (మినరల్స్)తో పాటు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఫైటేట్ పుష్కలంగా ఉండటం వల్ల నువ్వులు శక్తిమంతమైన క్యాన్సర్ నిరోధకాలు. నువ్వుల్లో క్యాల్షియమ్, ఫాస్ఫరస్ చాలా ఎక్కువ. అందుకే అవి ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి. ఎముక ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నువ్వుల్లో పీచు చాలా ఎక్కువ కాబట్టి కడుపు ఆరోగ్యాన్ని కాపాడటంలో వాటి పాత్ర ఎంతో ఎక్కువ. మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. రోజూ గుప్పెడు నువ్వులు తినేవారిలో నోటి ఆరోగ్యం బాగుంటుంది. పళ్లు, చిగుర్ల వ్యాధులు తగ్గుతాయి. నువ్వులు క్రమం తప్పకుండా తినేవారిలో చర్మం మిలమిల మెరుస్తుంది. నువ్వుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం ఉండడం వల్ల అవి వాపు, మంట నొప్పిని తగ్గిస్తాయి.