చలికాలం వచ్చేసింది. కీళ్లు బిగుసుకుపోతుంటాయి. నువ్వులతో దేహాన్ని వెచ్చబరచాలి. ఎముకలకు తగినంత శక్తినివ్వాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లో పాటు ఒక ఓట్స్ లడ్డు. ఈవెనింగ్ స్నాక్‌గా డేట్స్ లడ్డు. రాత్రి భోజనంలోకి వేడిగా నువ్వుల రైస్. చలికాలం పేజీలను నవ్వుతూ తిప్పేద్దాం.
డేట్స్ లడ్డు.
కావలసినవి: కర్జూరాలు – 300 గ్రాములు (సీడ్‌లెస్ అయితే 280 గ్రాములు చాలు); నువ్వులు – కప్పు; నువ్వులు – పావు కప్పు (పైన చల్లడానికి); జీడిపప్పు పలుకులు – పావు కప్పు; యాలకులు – 4.
తయారీ: ∙మంద పాటి బాణలిలో నువ్వులను (అన్నింటినీ) వేయించాలి (నూనె వేయకూడదు). చల్లారిన తర్వాత పావు కప్పు విడిగా తీసి పెట్టుకుని మిగిలిన నువ్వులను, యాలకులకు మిక్సీలో పొడి చేయాలి ∙కర్జూరాలను గింజలు తొలగించి వెడల్పు పాత్రలో వేసి చిదమాలి. అందులో నువ్వుల పొడి వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో చిదుముతూ కల పాలి. బాగా కలిసిన తరవాత జీడిపప్పు పలుకులను వేసి పెద్ద నిమ్మకాయంత సైజులో లడ్డులు చేయాలి. వేయించి పక్కన తీసి పెట్టిన నువ్వులను ఒక ప్లేట్‌లో పలుచగా వేయాలి. లడ్డును ఆ నువ్వుల మీద పెట్టి రోల్ చేయాలి. లడ్డుకు అంటుకున్న నువ్వులు రాలిపోకుండా ఉండడానికి రెండు అర చేతుల్లో పెట్టి గట్టిగా అదమాలి. ఇవి వారం పాటు తాజాగా ఉంటాయి.
ఓట్స్ సెసెమీ లడ్డు
కావలసినవి: ఓట్స్ – పావు కేజీ; నువ్వులు – పావు కేజీ; యాలకులు – 4; బెల్లం తురుము – ఒకటిన్నర కప్పులు; జీడిపప్పు పలుకులు – 20
తయారీ: ∙మంద పాటి పాత్రలో ఓట్స్ వేసి మీడియం మంట మీద వేయించాలి (నూనె లేకుండా). చిటపటలాడుతుంటే సమంగా వేగినట్లు గుర్తు. చిటపటలాడేటప్పుడు ఒకసారి గరిటెతో కలియతిప్పి దించేయాలి. వేగిన ఓట్స్‌ను ఒక ప్లేట్‌లోకి మార్చి అదే పాత్రలో నువ్వులను వేయించాలి. నువ్వులు కూడా చల్లారిన తర్వాత ఓట్స్, నువ్వులు, యాలకులను కలిపి మిక్సీలో పొడి చేయాలి. అందులో బెల్లంపొడి వేసి మరోసారి తిప్పాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లో పోసి చేత్తో చిదిమినట్లు కలిపి, జీడిపప్పు పలుకులు కలిపి పెద్ద నిమ్మకాయంత లడ్డులు చేయాలి. ఇవి వారం రోజులు తాజాగా ఉంటాయి.
నువ్వుల రైస్
కావలసినవి: నువ్వులు – వంద గ్రాములు; బియ్యం – పావు కేజీ; ఎండుమిర్చి – 6; మినప్పప్పు – టీ స్పూన్ ; నువ్వుల నూనె– టేబుల్ స్పూన్; ఉప్పు పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి.
పోపు కోసం: నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు.
తయారీ: ∙బియ్యం కడిగి అన్నాన్ని కొంచెం పలుకుగా వండుకోవాలి. వెడల్పు పాత్రలోకి మార్చి చల్లారనివ్వాలి. అందులో ఉప్పు, టీ స్పూన్ నువ్వుల నూనె వేసి గరిటెతో జాగ్రత్తగా కల పాలి మిగిలిన నూనె బాణలిలో చేసి వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి వేయించాలి. అవి వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు చిట్లుతున్న శబ్దం వచ్చిన తర్వాత ఒక అరనిమిషం పాటు బాగా కలియబెట్టి స్టవ్ ఆపేయాలి నువ్వులు, ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీలో ముందుగా ఎండుమిర్చి వేసి పొడి చేయాలి. అవి గరుకుగా మెదిగిన తర్వాత బాణలిలో ఉన్న అన్నింటినీ వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని అన్నం మీద పలుచగా చల్లాలి అదే బాణలిలో పోపు కోసం తీసుకున్న నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించాలి. ఈ పోపును అన్నంలో వేయాలి. నువ్వుల పొడి, పోపు సమంగా కలిసే వరకు గరిటెతో కలపాలి. రుచి చూసుకుని అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment