వేసవి కాలంలో చన్నీటి స్నానం ఎంతో హాయినిస్తుంది. అయితే శీతాకాలం వచ్చింది అనగానే స్నానానికి దాదాపు అందరూ వేడి నీళ్లే వాడతారు. ఎందుకంటే చల్లనీటితో స్నానం చేస్తే జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలొస్తాయనే భయం కూడా దీనికి ప్రధాన కారణం. మరోవైపు కార్తీకస్నానాలు, అయ్యప్పమాల ధరించిన భక్తులు ఎంత చలిగా ఉన్నా సరే చన్నీటి స్నానాలే ఆచరిస్తారు. అసలు స్నానానికి ఏ నీళ్లు వాడితే మంచిది? తెలుసుకుందాం.
అయితే ఏ కాలంలో అయినా స్నానానికి మరీ వేడినీళ్లు కాకుండా, గోరువెచ్చని నీళ్లు వాడాలి అనేది నిపుణుల మాట. రోజూ ఎక్కువ వేడి నీటి స్నానంతో చర్మానికి కొన్నిఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ముందుగా వేడి నీటి స్నానం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
వేడి నీటి స్నానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
వేడి నీటి స్నానంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలసట తీరుతుంది. చర్మానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. శరీరంలో బీపీ తగ్గుతుంది. శరీర నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో కుచించుకు పోయిన కండరాలకు, ఎముకలకు వేడి నీటి స్నానంతో రిలీఫ్ లభిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల (గుండె జబ్బు) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే హాట్ టబ్ బాత్, ఆవిరిస్నానంతో ఈ ప్రయోజనాలు మరింత మెరుగ్గా ఉంటాయంటున్నారు.
అసలే శీతాకాలంలో చర్మంలో తేమ శాతం తక్కువగా చర్మం పొడిగా మారిపోతుంది. దీనికి వేడి నీటి స్నానం మరింత ఆజ్యం పోస్తుంది. సేబుమ్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. చర్మంలోని సహజమైన ఆయిల్స్ తగ్గిపోతాయి. ఫలితంగా మంట, దురదలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సోరియాసిస్, ఎగ్జిమా, రోసాసియా లాంటి సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి.
జుట్టుకు చేటు
వేడి, వేడి నీళ్లతో తల స్నానం అస్సలు మంచిది కాదు. వెంట్రుకలు బలహీనంగా మారతాయి. జుట్టులోని కెరాటిన్, లిపిడ్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది.
చన్నీటితో స్నానం వల్ల కలిగే లాభాలు
మరీ గడ్డ కట్టేంత చల్లని నీరు కాకుండా, ఒక మాదిరి చన్నీటిస్నానం వల్ల శరీరానికి ఉపశమనం లభిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. జుట్టు, చర్మానికి మంచిది. బరువు తగ్గడానికి సహాయపడుతుందని కూడా చెబుతారు. తలకు కూడా చల్ల నీటి స్నానం మంచిదే.
నోట్: చిన్న పిల్లలకు, వృద్ధులకు, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, ఇతర అనారోగ్యంతో ఉన్నవారికి చన్నీటి స్నానం మంచిది కాదు. ఏ వయసు వారికైనా గోరు వెచ్చటి స్నానం ఉత్తమం. అటు వాటు ఉన్నవారు, తట్టుకోగల శక్తిఉన్నవారు చన్నీటి స్నానం చేయవచ్చు. లేదంటే గోరు వెచ్చని నీటితో స్నానం బెటర్. స్నానానికి ముందు శరీరానికి నూనెతో మసాజ్ చేసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే స్నానం తరువాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడాలి.
Comments
Please login to add a commentAdd a comment