స్నానం వేడినీళ్లతో చేస్తే మంచిదా? లేక చన్నీళ్లతోనా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు కాలంతో సంబంధం లేకుండా వేడినీళ్ల స్నానానికి అలవాటు పడితే, మరికొందరేమో చన్నీళ్లకు అలవాటు పడతారు. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గడంతో పాటు కండరాలు ఉత్తేజంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. చల్లటి నీళ్లలతో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది?
మనం ప్రతిరోజు స్నానం చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. దీని కారణంగా పలు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్ల వల్ల హానికారక క్రిములన్నీ తొలగిపోయి ఆరోగ్యం సమకూరుతుందనుకుంటారు. ఈ రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు. మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో స్నానమే ఆరోగ్యం.
ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయద్దు. ఒకవేళ మీరు మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం చేసే వ్యవధిని వీలైనంత కుదించండి.
అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు.ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది.
నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలి. చన్నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉన్నవారు... స్నానానికి ముందర చల్లటి నీళ్లు తాగకండి. చన్నీళ్లు గానీ లేదా వేణ్ణీళ్లు గానీ... వాటితో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్ అవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment