పురాతన ఆయుర్వేద కాలం నుండి, నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని ఏదో విధంగా రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి వేడిని అందిస్తాయి. అలాగే బెల్లంతో కలిపి చేసిన నువ్వుల లడ్డూలను పిల్లలకు తినిపిస్తే బోలెడన్ని పోషకాలు లభిస్తాయి. నువ్వులు, నువ్వుల లడ్డూ ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
నువ్వులను అనేక రకాలుగా వంటకాల్లో వాడతారు. నువ్వుల పొడి, నువ్వుల కారంతోపాటు నువ్వులతో తీపి వంటకాలను చేస్తారు. ముఖ్యంగా బెల్లం, నువ్వులను కలిపి తయారు చేసిన లడ్డూలు మంచి రుచిగా ఉండటమేకాదు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
వీటిల్లో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. నువ్వులలోని మెగ్నీషియం సుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుతుంది.
ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టు నాణ్యతను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి సహాయపడతాయి. ఇందులోని జింక్ , సెలీనియం వంటి ఖనిజాలతో అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు.
నువ్వుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. చిన్నారులు, గర్భిణీలకు ఎంతో పోషణ లభిస్తుంది. నువ్వుల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది . రక్తహీనత ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి.
ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులకు మంచి పరిష్కారం.
నువ్వుల గింజలలో లిగ్నాన్స్, విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లు రక్తప్రసరణను సులభం చేస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
నువ్వుల గింజలలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ లాగా పనిచేసే మొక్కల ఆధారిత సమ్మేళనాలు. ఇవి హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, సాధారణ ఋతు చక్రానికి మద్దతు ఇస్తాయి. అందుకే రజస్వల అయినపుడు ఆడపిల్లలకు నువ్వుల చిమ్నీ తినిపిస్తారు.
నువ్వుల లడ్డూ తయారీ
కావాల్సిన పదార్థాలు: ఆర్గానికి బెల్లం, నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి. వేరు శనగ పప్పు. కావాలంటే జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు.
తయారీ
ముందుగా ఓ కడాయిలో నువ్వులను దోరగా వేయించాలి. చిటపడ లాడుతూ కమ్మటి వాసన వస్తాయి. అపుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో వేరు శనగ పప్పులను కూడా వేయించి ముక్కా చెక్కలాగ మిక్సీ పట్టాలి.
ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తరిగి, పాకం పట్టుకోవాలి. ఇది పాకం వచ్చాక నువ్వులు, మిక్సీ పట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్య రాసిన ప్లేట్‌లోకి తీసుకోవాలి. వేడి మీదే వీటిని ఉండలు చుట్టుకోవచ్చు. లేదంటే అచ్చుల్లాగా కట్ చేసుకోవచ్చు.
నువ్వులను ఇలా పలురకాలుగా
నువ్వులు రెండు రకాలుగా లభిస్తాయి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. తెల్ల, నల్ల నువ్వులను వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. నువ్వుల తైలంతో శరీరానికి మర్ధన చేస్తే మంచిదని చెబుతారు. అయితే నల్ల నువ్వులను మాత్రం పూజాది కార్యక్రమాలకు వాడతారు. అలాగే శనిదోష నివారణకు నల్ల నువ్వులను దానం చేస్తారు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిదని భావిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment