ఆరోగ్యకరమైన బిడ్డల కోసం నాన్న సత్ప్రవర్తన కూడా ప్రధానమే!
పరిపరిశోధన
మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ అది గర్భధారణ మీద, పిండం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందన్నది తెలిసిన విషయమే. కానీ పిండం ఆరోగ్యంపై తండ్రి వయసు, అతడి జీవనశైలి కూడా ప్రభావం చూపుతాయని పరిశోధకులు తెలుసుకున్నారు. సాధారణంగా 35 ఏళ్లు దాటిన మహిళలకు గర్భధారణ జరిగితే బిడ్డలకు కొన్ని జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ అన్నది చాలా మందికి తెలిసిన సంగతే. అందుకే కాబోయే తల్లి సరైన వయసులో గర్భధారణ జరిగేలా చూసుకోవడం, ఆమె మానసికంగానూ ఉల్లాసంగా ఉండటం, ఆమె ఉండే పరిసరాలు ఆరోగ్యకరంగానూ, హార్మోన్లు సమతౌలంతో ఉండేలా జాగ్రత్త పడటం అవసరమని డాక్టర్లు చెబుతుంటారు. ఇదే విషయం కాబోయే నాన్నలకూ వర్తిస్తుందంటున్నారు అధ్యయనవేత్తలు. వారు పేర్కొన్న అంశాల ప్రకారం... తండ్రుల జీవనశైలి, అతడి వయసు జన్యువులపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు తల్లికి ఎలాంటి దురలవాట్లు లేకపోయినా తండ్రికి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే పిండానికి ‘ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఎఫ్‌ఏఎస్‌డీ)’ వచ్చే అవకాశాలు ఎక్కువ. పైగా ఇలాంటి పిల్లలు పెద్దయ్యాక తాగుబోతులుగా మారేందుకు 75 శాతం వరకు అవకాశం ఉంది. తండ్రికి ఆల్కహాల్, పొగ తాగే అలవాటు ఉంటే పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో ఉండటం, మెదడు పరిమాణం తగ్గడం, మానసిక వికాసం ఆలస్యంగా జరగడం వంటి ప్రమాదాలు ఉన్నాయి.
అలాగే పెద్ద వయసులో తండ్రి అయిన వారి పిల్లలకు స్కీజోఫ్రీనియా, ఆటిజమ్ వంటి సమస్యలూ వచ్చే అవకాశం ఉంది. తండ్రి వయసు ఎంతగా పెరుగుతుంటే బిడ్డలకు ఈ సమస్యలు వచ్చే అవకాశం అంతగా పెరుగుతుంది. అంతేకాదు... తండ్రికి స్థూలకాయం ఉంటే దాని దుష్ర్పభావం బిడ్డల్లో కణజాలంలో జీవక్రియలపైనా ఉండవచ్చు. బిడ్డకు భవిష్యత్తులో స్థూలకాయం రావచ్చు. డయాబెటిస్, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. అంతేకాదు... కాబోయే తండ్రిపై ఒత్తిడి కూడా పిల్లల మానసిక ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపవచ్చు. తమ అధ్యయనంలో తేలిన ఈ ఫలితాలన్నింటినీ అధ్యయనవేత్తలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ స్టెమ్ సెల్స్’ అనే పరిశోధన పత్రికలో ప్రచురించారు. తండ్రికి ఆల్కహాల్, పొగ తాగే అలవాటు ఉంటే పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో ఉండటం, మెదడు పరిమాణం తగ్గడం, మానసిక వికాసం ఆలస్యంగా జరగడం వంటి ప్రమాదాలు ఉన్నాయి.