కొత్త సంవత్సరం తన్నుకొస్తోంది
పాత అలవాట్లను తన్నిపారేయండి
ప్రతి స్టెప్పులో కొత్త స్టెప్పేయండి
హ్యాపీ న్యూఇయర్ ఎవిరీ ఇయర్ వస్తది
హెల్దీ న్యూఇయర్ 2018లోనే రావాలి
ఆర్యూ రెడీ...?
శపథం చేస్తారా?
ఈ 18 రెసెల్యూషన్స్
తీసుకునే దమ్ముందా?
1. అనారోగ్యకరమైన జంక్‌ఫుడ్‌ను ఈ ఏడాది దరిచేరనివ్వకండి. దానికి బదులు అన్ని పోషకాలు సమతులంగా... అంటే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్ల వంటివి అన్నీ సమంగా ఉండేలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే నిర్ణయం తీసుకోండి. మితంగా తినండి. కాస్తంత ఆకలిగా ఉండగానే తినడం ఆపేయండి. భోజనానికి ముందర కాస్త రసం (సూప్) తీసుకోండి. దాంతో మీరు తక్కువ తింటారు. కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినండి. దాంతో మీ జీవరసాయన క్రియలు (మెటబాలిజం) సమర్థంగా జరుగుతాయి. ఇక ఏవైనా కారణాల వల్ల మీకు ఇష్టమైన పదార్థాలను పరిమితంగా తీసుకోవాల్సి వస్తే వాటిని మానేయాల్సి వస్తుందని భావన మీలో ఒత్తిడిని పెంచవచ్చు. అందుకే వాటిని పరిమితంగా తినేందుకు మీకెప్పుడూ అవకాశం ఉంటుందనే ఆలోచనను పెంచుకోండి. దీంతో మీకు ఇష్టమైన వాటి పట్ల మీరు దూరంగా ఉండాలన్న ఆందోళన తగ్గి ఏడాదంతా మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది.
2. మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఎప్పుడూ తాజాగా ఉండేలా చూసుకోండి. రోజూ తాజాగా ఉండే కూరగాయలు, పళ్లు తీసుకుంటే వాటిల్లోని పోషకాల వల్ల అనేక జబ్బులు, క్యాన్సర్ రిస్క్ దూరమవుతుంది. ఫ్రిజ్‌లో పెట్టిన వాటిల్లో 50% – 60% పోషకాలు నశిస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు తాజా పదార్థాలనే తినాలనే నిర్ణయం తీసుకోండి.
3. ఈ ఏడాది నుంచి ఒకసారి ఉపయోగించిన నూనెను ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ వాడకూడదనే నిర్ణయం బలంగా తీసుకోండి. దాంతో క్యాన్సర్లు మొదలుకొని ఎన్నో సమస్యలను అరికట్టడంతో పాటు, ఎన్నో జబ్బులను నివారించుకున్నట్లూ అవుతుంది.
4. పొగతాగడం అనేది పూర్తిగా హానికరమైన దురలవాటు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఒబేసిటీల కంటే పొగతాగడమే ఎక్కువ హానికరం అని అనేక అధ్యయనాలు నిరూపించాయి. దీన్ని బట్టే గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్, స్థూలకాయం కంటే పొగతాగడాన్నే సైంటిస్టులు ఎక్కువ ప్రమాదకరంగా పరిగణిస్తున్నారంటే... దానితో కలిగే హానిని గుర్తించండి.
5. ఆల్కహాల్ ఆరోగ్యపరంగా, సామాజికంగా, ఆర్థికంగా... అన్ని రకాలుగా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. ఆ అలవాటును మానేయాలని నిర్ణయం తీసుకోండి. ఇక ఇప్పటివరకు మీరు ఆల్కహాల్‌ను ముట్టనివారైతే మున్ముందు అస్సలు ఎప్పటికీ దాన్ని ముట్టుకోబోమని ప్రతిజ్ఞ తీసుకోండి. ఎందుకంటే అది మీ మెదడు మీద చాలా ప్రతికూలమైన ప్రభావాలు చూపుతుంది.
6. మీ చేతిలోని పనులన్నీ మీరే చేయాలని అనుకోకండి. మీరు మాత్రమే బాగా చేస్తారనే మొండి పట్టుదలతో ఉండకండి. కొన్ని ఇతరులకు అప్పజెప్పండి. పనులు చేసే విషయంలో పర్‌ఫెక్షనిజం పేరిట అతిగా కష్టపడకండి. ఏదో ఒక చోట పనిని ముగించాలి... అలా పని ముగిసి తీరాలి. ఈ సత్యం గుర్తుంచుకుంటే పర్‌ఫెక్షన్ కోసం అతిగా తాపత్రయపడటం తగ్గుతుంది.
7. మీలో చెలరేగే కోపం, ప్రేమ, విచారం లాంటి ఫీలింగ్స్ భావోద్వేగాలను అణచుకోకండి. వాటిని అణచుకోవడం వల్ల గుండెపోటుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎవరిపట్లనైనా మీకు కోపం వస్తే... వారి పట్ల మీరు ఏమాత్రం రియాక్ట్ కాకండి. మీకు కోపం కలిగించిన వారిని పూర్తిగా విస్మరించండి. (ఇగ్నోర్ చేయండి). దాంతో భవిష్యత్తులో ఇటు... మీకు వారితో వ్యవహారపరంగా గానీ, అటు... ఆరోగ్యపరంగా గానీ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రావు. వీలైతే మీ భావోద్వేగాలను ఒకచోట రాయండి. అలా నమోదు చేయడం మీకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఏదైనా విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోగలం అనే అతి విశ్వాసాన్ని వదులుకోండి. మీ అపరిమితమైన జ్ఞాపకశక్తి మీద నమ్మకం కంటే చిన్న పెన్సిల్... మీరు ఏ విషయాన్నీ మరచిపోకుండా ఉంచుతుంది. ఎందుకంటే ఏదో ఒక సమయంలో మరపు కలగడం ఎంతటి జ్ఞాపకశక్తి ఉన్నవాళ్లలోనైనా అరుదుగానైనా సంభవించే పరిణామమే.
8. మీ ఆత్మవిశ్వాసమే మీకు బలం. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ రోగనిరోధకశక్తిని మరింత పెంచుతుంది. తమ మీద తమకు నమ్మకం, పాజిటివ్ దృక్పథం అన్న అంశాలు క్యాన్సర్, గుండెజబ్బులతో పాటు అనేక వ్యాధుల విషయంలో ఒక ఆత్మరక్షణ చర్యలా పనిచేస్తాయి. అందుకే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోడానికి కృషి చేయండి.
9. మీ బెడ్‌రూమ్‌లో కంప్యూటర్లను, టీవీ వంటివాటిని అమర్చుకోకండి. టీవీ ప్రకటనల్లో కనిపించే ప్రతి వస్తువును కొనాలనో, సమకూర్చుకోవాలనో అనుకోకండి. నిద్రకు ఉపక్రమించే సమయంలో కంప్యూటర్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వాడకండి. బెడ్ రూమ్‌లో మీకు టీవీ, కంప్యూటర్ వాడాలనిపించినప్పుడు మంచి పుస్తకం చదవండి. దాంతో రీడింగ్ హ్యాబిట్స్ పెరుగుతాయి. విజ్ఞానమూ సమకూరుతుంది. కళ్లు అలసి నిద్రా వస్తుంది.
10. స్ట్రెస్‌కు దూరంగా ఉండండి. స్ట్రెస్‌ను కలిగించే అంశాల్లో 90 శాతం నిజానికి అంత ఒత్తిడి కలిగించాల్సినవేమీ కాదన్న విషయాన్ని గ్రహించండి. పిల్లల చదువులు అంటూ వారిపైనా ఒత్తిడి పెంచకండి. పరిమితమైన ఒత్తిడి వల్ల కాస్తంత ప్రయోజనం ఉండవచ్చేమో గానీ అది మితిమీరితే హానికరం. స్ట్రెస్ అన్నది స్త్రీ, పురుషులిద్దరికీ హాని చేసినప్పటికీ, అది పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా హాని చేస్తుందని గుర్తుంచుకోండి. అప్పుడప్పుడూ కాస్తంత ఒళ్లువిరుచుకుని ఒకసారి ఆవలించండి. ఒత్తిడి తగ్గుతుంది. అబద్ధాలు ఆడటం మీలో ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఎందుకంటే ఒకసారి అబద్ధం ఆడామంటే వాటిని నిత్యం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అది మీ స్ట్రెస్‌కు కారణమవుతుంది. మీ స్ట్రెస్‌ను ధ్యానం, యోగా వంటి ప్రక్రియలతో తొలగించుకొని ప్రశాంతంగా ఉండండి.
11. మీ సెల్‌ఫోన్స్‌ను అవసరం లేని సమయంలో దూరంగా పెట్టుకోవాలనే నియమం పెట్టుకోండి. మీ మొబైల్ మీ స్ట్రెస్‌ను అపరిమితంగా పెంచుతుందని గుర్తుంచుకోండి. మీ మొబైల్‌ను టాయిలెట్స్‌లో, మూవీలో ఇకపై ఉపయోగించబోమని నిర్ణయం తీసుకోండి. ఆధునికమైన గాడ్జెట్స్ వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గించండి. వాట్సాప్ వంటి వాటిని కేవలం అవసరం మేరకు మాత్రమే వాడండి.
12. పెంపుడు జంతువులు ఉన్నవాళ్లలో స్ట్రెస్ తగ్గి హైబీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, పక్షవాతం వంటి జబ్బులు తక్కువగా వస్తాయని తేలింది. వీలైతే పెట్‌ను పెంచుకోండి. అక్వేరియంలోని చేపల వల్ల హైపర్‌టెన్షన్ (రక్తపోటు) తగ్గుతుంది. పెట్స్ పట్ల అలర్జీలు ఉన్నవారు పక్షులు సంచరించే ప్రాంతాల్లో కొన్ని గింజలు చల్లి... వాటిని పరిశీలిస్తూ ఎక్కువ సేపు గడపండి. పెట్స్‌ను పెంచడానికి వీల్లేని వారికి ఈ పని పెట్స్‌ను పెంచినప్పుడు కలిగే ప్రయోజనాన్నే ఇస్తుంది.
13. మీ పాత ఫ్రెండ్‌షిప్స్ కొనసాగిస్తూ, వారితో ఆరోగ్యకరమైన బంధాలను నెరపుతా మని ప్రతిజ్ఞ తీసుకోండి. అలాగే కొత్త ఫ్రెండ్ షిప్స్ చేసుకుంటూ ఉండండి. నమ్మకమైన ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే పూర్తిగా ఓపెన్–అప్ అవండి.
14. పుకార్లనూ, గాసిప్స్‌ను నవ్వుకోవడం వరకే పరిమితం చేయండి. ఎప్పుడూ పరిశుభ్రమైన దుస్తులను ధరించి, నీట్‌గా కనిపించాలనే నిర్ణయం తీసుకోండి. వీలైతే ఒకరోజు వేసుకున్న దుస్తులను ఉతకకుండా మళ్లీ ధరించకండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని, ఎదుటివారికి నవ్వుతూనే కనిపించాలనే నిర్ణయం తీసుకోండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల గుండెజబ్బులు తగ్గుతాయని వైజ్ఞానికంగా నిరూపితమయ్యింది. లాఫ్టర్ థెరపీ వల్ల రక్తపోటు, ఒత్తిడి, క్యాన్సర్, గుండెజబ్బుల రిస్క్ తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ద్వంద్వంగా తేలింది.
15. పని తర్వాత విశ్రాంతి, వినోదం తప్పనిసరి. వారంలోని అన్ని రోజులూ మీ ఆఫీస్ కోసమైతే... మీ వారాంతం మాత్రం పూర్తిగా మీ కుటుంబం కోసమే. ఇక రోజంతా మీ ఆఫీస్ పని కోసమైతే... సాయంత్రాలు మాత్రం మీ కోసమే. ఇలా మీ కోసం కూడా మీరు సమయం వెచ్చించుకోక తప్పదనే నిర్ణయాన్ని ఈ ఏడాది తప్పక తీసుకోండి. ఏడాదిలో ఒకసారైనా కనీసం వారం రోజుల పాటు ఏ హాలిడేకో వెళ్లాలనే నిర్ణయం తీసుకోండి.
16. అందమైన పూలకుండీలు, కుండీల్లోని మొక్కల వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అకస్మాత్తుగా వినిపించే గట్టి చప్పుళ్లు లేదా మెల్లిగానైనా దీర్ఘకాలం వరకు వినిపించే శబ్దాలు గుండెజబ్బుల రిస్క్ పెంచుతాయని ఓ జర్మన్ రీసెర్చ్ చెబుతోంది. ప్రకృతిలో వినిపించే ఆహ్లాదకరమైన శబ్దాలు... అంటే... నీటి ప్రవాహం, పక్షి కూతల వంటివి గుండెకు సాంత్వననిస్తాయి. అందుకే మంచి ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటుండండి.
17. రాత్రి వేళ నిద్రకు ఉపక్రమించి, కంటినిండా నిద్రపోవాలనే నిర్ణయం తీసుకోండి. మరీ తక్కువ నిద్రపోవడం గుండెకు మంచిది కాదు. మరీ ఎక్కువ నిద్రపోవడం డిప్రెషన్‌కు సూచిక. వీలైతే మధ్యాహ్నం పూట ఒక కునుకు తీయండి. ఆ పవర్‌న్యాప్ గుండెకూ, మెదడుకూ మంచిది. మధ్యాహ్న భోజనం తర్వాత తీసే ఆ కునుకుతో మీ పని సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని గుర్తుంచుకోండి. తగినంత నిద్ర కచ్చితంగా అవసరం.
18. వ్యాయామం చేస్తామనే నిర్ణయాన్ని ఈ ఏడాది తీసుకొని, తప్పక అమలు చేయండి. మీరు నడిచే ప్రతి క్షణం మీ ఆయుర్దా యాన్ని పెంచుతుంది. వ్యాయామం వల్ల మీలో సంతోషం కలిగించే రసాయనాలు (ఎండార్ఫిన్స్) స్రవిస్తాయి. అవి మిమ్మల్ని ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉంచుతాయి. వ్యాయామం మొదలుపెట్టే సమయంలో వార్మప్‌తో ప్రారంభించి, ముగించడం అకస్మాత్తుగా చేయకుండా మెల్లగా కూల్‌డౌన్ చేస్తూ ముగించాలని గుర్తుపెట్టుకోండి.
- డాక్టర్ ఎం. రామకృష్ణ సీనియర్ జనరల్ ఫిజీషియన్
యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment