న్యూ ఇయర్‌ను ‘హ్యాపీ’గా మలచుకునే మార్గాలు కాలం ఒక మాయాజాలం. కళ్లముందే కరిగిపోతుంది. ఒడిసిపట్టేందుకు ఎంత ప్రయత్నించినా వేలి సందుల గుండా ఇట్టే జారిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది చూస్తుండగానే కరిగిపోయింది. తీపి, చేదు అనుభవాలను మిగిల్చి 2024 చరిత్ర పుటల్లోకి జారుకుంది. కొత్త ఆశలను, సరికొత్త ఆకాంక్షలను మోసుకుంటూ 2025 వచ్చేసింది.
బద్ధకం వదిలించుకుంటామని, ఇంకోటని, మరోటని... ఇలా న్యూ ఇయర్ అంటేనే ఎన్నో తీర్మానాలు, మనకు మనమే చేసుకునే వాగ్దానాలు. ఇటు చేసే పనిని, అటు ఈదే సంసారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంటిల్లిపాదితో పాటు మన ఆరోగ్యమూ జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించేయాలి. కొత్త అభిరుచులు పెంచుకోవాలి. మొత్తమ్మీద వీలైనన్ని ఆనందమయ క్షణాలను ఒడిసిపట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఎవరికైనా ఉండే ఆశలే. ఇవన్నీ తీరి 2025 ఆసాంతం హాయిగా సాగేందుకు ఏమేం చేయాలంటే..!
ఆందోళనకు చెక్
ఆధునిక జీవన విధానం పుణ్యమా అని అప్పుడప్పుడు ఒత్తిళ్లు ఎవరికైనా ఉండేవే. కానీ రోజులో చాలాభాగం ఆందోళన మధ్యే గడుస్తోందంటే మాత్రం డేంజరే. కాస్త ఆగి, అర్థం చేసుకునే లోపే పూడ్చుకోలేనంత నష్టం జరిగిపోతుంటుంది. కనుక మనసును కుంగదీసే ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిష్పాక్షికంగా మదింపు చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం వారానికోసారి కొంత సమయాన్ని ప్రత్యేకించుకోవాలి. ప్రథమ కోపం వంటివేమైనా పెరుగుతున్నాయా అని ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూసుకోవాలి.
ఆ లక్షణాలు కనిపిస్తే మొదట్లోనేవదిలించుకోవాలి. లేదంటే ఆఫీసులోనూ, ఇంట్లోనూ లేనిపోని సమస్యలు నెత్తిన పడటం ఖాయం. లేదంటే నచ్చనిది, ఊహించనిది జరిగితే వెంటనే అరిచేసి అవతలి వారిని గాయపరచడం లాంటివి పెరిగిపోతాయి. ఇది సంబంధాలను సరిచేయలేనంతగా దెబ్బ తీస్తుందని గుర్తుంచుకోవాలి. అది ఆఫీసైనా కావచ్చు, ఇల్లయినా కావచ్చు. అయితే ఎంత ప్రయత్నించినా మనమూ మనుషులమే గనుక ఎప్పుడైనా నోరు జారవచ్చు. అప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు మీరే చొరవ తీసుకోండి. అవసరమైతే అవతలి వారికి సారీ చెప్పినా తప్పు లేదు. అది మీకు నామర్దా అని అస్సలు అనుకోవద్దు. అవతలి వారి దృష్టిలో వ్యక్తిగా మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తుందని తెలుసుకోండి.
మంచి సావాసం
మీకన్నా తెలివైన వారితో, మంచివారితో వీలైనంత ఎక్కువగా గడపండి. తెలివైనవారి సాహచర్యంలో తెలియకుండానే బోలెడు విషయాలు నేర్చుకుంటారు. మంచివారు ఆచరించి చూపే జీవిత విలువలు మనకు దారి చూపే దీపాలవుతాయి. వాటిని ఎంతగా అలవర్చుకుంటే అహంకారం వంటి అవలక్షణాలు అంతగా అణగుతాయి. మానసిక ప్రశాంతతకు, నిజమైన తృప్తికి బాటలు పడతాయి.
బద్ధకానికి బై బై
బద్ధకాన్ని వదలించుకుందాం. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా దీన్ని న్యూ ఇయర్ తీర్మానాల చిట్టాకు పరిమితం చేయకండి. ఈ క్షణం నుంచే ఆచరణలో పెట్టండి. దీన్నొక్కదాన్ని దూరం చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారమైనట్టేనని గుర్తుంచుకోండి. మెదడును ఖాళీగా ఉంచకపోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఏఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. వృత్తి సంబంధ నైపుణ్యాలను మెరుగుపెట్టుకోండి. అది మీ ఆత్మవిశ్వాసాన్నీ అమాంతంగా పెంచేస్తుంది. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే అటు బద్ధకమూ వదులుతుంది. ఇటు చక్కని ఐడియాలూ పుట్టుకొస్తాయి. రెండిందాలా లాభమే.
ఇతరులకు సాయపడదాం
ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం వల్ల కలిగే ఆత్మసంతృప్తి అంతా ఇంతా కాదు. అది ఎన్ని వేలు, లక్షలు ఖర్చు చేసినా దొరికేది కాదు. మనకిష్టమైన వారికి సాయపడటం పెద్ద విషయమేమీ కాదు. మీకిష్టం లేని వారికి అవసరాల్లో సాయపడితే మనిíÙగా మరో మెట్టు ఎక్కినట్టే. ఇతరుల్లోని మంచిని గుర్తించడం, అభినందించడం అలవాటుగా మార్చుకుంటే మన సాన్నిధ్యాన్ని అంతా ఇష్టపడతారు.
పరిష్కారాలు సూచిద్దాం
ఎప్పుడూ సమస్యలను ఎత్తిచూపడం కాదు. అది అందరూ చేసేదే. ఇంతకాలంగా మనమూ చేస్తూ వస్తున్నదే. వాటికి ఆచరణసాధ్యమైన పరిష్కారాలను సూచించే ధోరణి అలవర్చుకుందాం. మొదట్లో కాస్త కష్టమే అనిపించినా మనల్ని అందరికీ అత్యంత ఇషు్టలను చేస్తుందిది. ముఖ్యంగా ఆఫీసుల్లో మేనేజర్ వంటి పొజిషన్లలో ఉంటే ఈ ఒక్క అలవాటుతో సహోద్యోగులందరి మనసూ ఇట్టే గెలుచుకోవచ్చు. వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి వాళ్లకు సలహాలివ్వడమే గాక ఎప్పటికప్పుడు తోడు నిలిస్తే వాళ్లకూ బాగుంటుంది. మనకూ తృప్తిగా ఉంటుంది. సంస్థా లాభపడుతుంది. అలా ఆల్ హ్యాపీసే.
చిన్న విజయాలనూ ఆస్వాదిద్దాం
విజయం సాపేక్షం. దానికి ఒక్కొక్కరూ ఒక్కో నిర్వచనమిస్తారు. భారీ లక్ష్యాలు సాధించినప్పుడు కలిగే విజయానందం గొప్పదే. కానీ దాని కోసమని ఆనందాన్ని అప్పటిదాకా వాయిదా వేసుకోవడమెందుకు? ఆ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సాఫల్యాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడాన్ని అలవాటుగా మార్చు కుందాం. అప్పుడిక ప్రతి రోజూ పండుగే.
ఆత్మానందమూ ముఖ్యమే
వ్యక్తిగత, వృత్తిగత, సాంసారిక సంతృప్తి చా లా ముఖ్యమే. కానీ ఆత్మానందం వీటన్నింటి కంటే విలువైనది. దాన్ని పొందేందుకు కూడా ఇప్పటినుంచే ప్రయత్నం మొ దలు పెడదాం.
అంటే ఎకాయెకిన కఠోర ఆధ్యాత్మిక సాధనలు చేసి తీరాలని కాదు. ఏ కవిత్వం, సంగీతం వంటివాటితో లోపలి ప్రయాణాన్ని మెల్లిమెల్లిగా మొదలు పెట్టవచ్చు. నేనెవరిని అనే మూలాలోచన అంటూ ఒకటి మనసులో ఒక పక్కన సాగుతూ ఉంటే చాలు. ఆత్మాన్వేషణకు క్రమంగా బాటలు అవే పడతాయి. చివరగా, వీలైనంతగా నవ్వండి. మానసికంగా అది కలిగించే సానుకూల ప్రభావం అంతా ఇంతా కాదని ఎన్నెన్నో అధ్యయనాలు ముక్త కంఠంతో తేల్చాయి. మొహంపై చిరునవ్వు చెరగని వారికి ప్రతి క్షణమూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. మరింకెందుకు ఆలస్యం?! ఈ క్షణమే రంగంలోకి దిగుదాం. బద్ధకాన్ని వదిలించుకుందాం. మనల్ని మనం నిత్యం సానబట్టుకుంటూ సాగుదాం. 2025ను మన జీవితంలోకెల్లా అత్యంత ఆనందమయమైన ఏడాదిగా మలచుకుందాం.
అవసరాలకే జై
కోర్కెలకు, కనీస అవసరాలకు చాలా తేడా ఉంది. ఆశలు అనంతమే గానీ ఆర్జన ఎప్పుడూ పరిమితమే. ఇదొక్కటి గుర్తుంచుకుంటే అవసరాలు, సౌకర్యాలు, ఆడంబరాలకు మధ్య స్పష్టమైన గీత గీయగలం. వేటిని తీర్చుకోవాలో, వేటిని దూరం పెట్టాలో, వేటిని వదిలించుకోవాలో తేల్చుకోవ డం తేలికవుతుంది. చాలా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అనుకోని అవసరాల కోసం కొంత మొత్తం కూడా పక్కన పెట్టుకోగలుగుతాం. ఆర్థిక ప్రశాంతత ఎంత బావుంటుందో అనుభవంలోకి వస్తుంది.
బంధాలే ముఖ్యం
చిన్న పొరపాట్లకు బంధాలు తెంచుకునేదాకా వెళ్లకండి. ఇందుకోసం ప్రత్యేకించి ఏమీ చేయనక్కర్లేదు. అవతలివాళ్లు కూడా మనలాగే మామూలు మనుషులేనని, అప్పుడప్పుడు తప్పులు, పొరపాట్లు చేస్తుంటారని గుర్తుంచుకుంటే చాలు. క్షమించే గుణాన్ని పెంచుకుంటే ప్రపంచమంతా మరింత అందంగా మారుతుంది. ఎప్పుడో జరిగిన అవమానాలను, చేదు సంఘటనలను మనసులో మోయకండి. ఆ భారం నానారకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
సహోద్యోగులు కీలకం
తిండీ, నిద్రా తదితరాలకు పోగా మన జీవితంలో మిగిలే నాణ్యమైన సమయంలో అత్యధిక భాగం గడిపేది కలిసి పనిచేసే సహోద్యోగులతోనే. వారితో సత్సంబంధాలు చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. చిన్నాచితకా కారణాలతో సహోద్యోగులతో కీచులాటలకు దిగకండి. అందుకోసం అవసరమైతే మీరే కాస్త తగ్గండి. తప్పేమీ లేదు. చక్కని పని వాతావరణం మన మానసిక, శారీరక ఆరోగ్యాలకు ఎంతో అవసరం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment