కొత్త సంవత్సరం అనగానే చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఈ ఏడాదినుంచైనా తప్పక అమలుపరచాలనుకుంటారు. ఇలా నిర్ణయాలు తీసుకుంటూ, తప్పుతూ ఉండటం సహజం. కానీ కరోనా మహమ్మారి నేర్పిన గుణపాఠాల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకుందాం. సరికొత్త ఏడాది 2022 సందర్భంగా ఈ తీర్మానాలు అమలు చేద్దాం. తు.చ. తప్పకుండా ఆచరిద్దాం.
కరోనా మనకు మాస్క్ పెట్టుకోవడం నేర్పింది. కోవిడ్ నేపథ్యంలో స్వచ్ఛందంగా అమలు చేసుకున్న ఈ నిర్ణయం మరెన్నో శ్వాసకోస వ్యాధుల్నీ నివారించింది. ఈ విషయాన్ని డాక్టర్లు, పల్మనాలజిస్టులే నిర్ధారణ చేశారు. ఈ మంచి అలవాటును కోవిడ్ పూర్తిగా తగ్గేవరకే కాదు... ఆ తర్వాత కూడా అమలు చేయండి. మరీముఖ్యంగా సమూహాల్లోకి వెళ్లేటప్పుడు.
గతంలో డాక్టర్లు మాత్రమే ఆల్కహాల్ బేస్‌డ్ శానిటైజర్ వాడేవారు. కోవిడ్ సందర్భంగా మనందరమూ దాన్ని వాడటం మొదలుపెట్టాం. ఈ శానిటైజర్ కేవలం కరోనానే కాదు... చాలా రకాల వ్యాధికారక క్రిములను నిర్మూలిస్తుంది. అందుకే మహమ్మారి సమయంలోనే కాదు... ఆ తర్వాత కూడా మన మెడికల్ కిట్‌లో శానిటైజర్ ఉండేలా చూసుకోండి.
ఏదైనా విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు చాలామంది మరీ దగ్గరగా వచ్చి చెబుతుంటారు. ఎదుటివారికి అది ఇబ్బందిగా అనిపించవచ్చు. భౌతికదూరం అనే నిబంధన అలవాటైనందున ఇకపై కూడా గౌరవపూర్వకమైన దూరం పాటిస్తూనే సంభాషించండి. ఇది వ్యాధులను నివారించే పద్ధతి మాత్రమే కాదు... మంచి మర్యాద లక్షణం కూడా.
ఈ కోవిడ్ సమయంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవడం కోసం మంచి సమతులాహారం, తాజా కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి తీసుకోవడం ఓ అలవాటుగా మారింది. ఇది అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ అలవాటును కొనసాగించండి. అలాగని ఖరీదైనవి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు అందుబాటు ధరల్లో ఉండే మేలైన ఆహారాలనే తీసుకోండి.
ఆత్మవిశ్వాసం, సంకల్పబలం, సానుకూల దృక్పథం రోగనిరోధక శక్తిని పెంచుతాయనీ... చాలామందిలో క్యాన్సర్ వంటి జబ్బులనూ తగ్గించాయని అనేకమార్లు చదివాం. ఆత్మవిశ్వాసాన్ని, పాజిటివ్ ఆలోచనలను పెంచుకోడానికి నిర్ణయం తీసుకోండి.
మీరు పూర్తి ఆరోగ్యవంతులై... రక్తదానం చేసే అవకాశం ఉన్నవారైతే ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోమారు రక్తదానమో లేదా ప్లేట్‌లెట్స్ దానం చేస్తాననే సంకల్పం తీసుకోండి. ఇది మీకు మంచి ఫీల్‌గుడ్ భావన ఇవ్వడమే కాదు... మీ ఆరోగ్యానికీ దోహదపడుతుంది.
ఆహారాలన్నీ తాజాగా ఉంటేనే ఎంతో మేలు. నిల్వ చేసిన పదార్థాలకు దూరంగా ఉండండి. ఫ్రిజ్జులో పెట్టిన వాటిల్లో 50% – 60% పోషకాలు నశిస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు తాజావే తీసుకోవాలనే నియమం పెట్టుకోండి.
ఒక వయసు దాటాక ఒకసారి పూర్తి హెల్త్ చెకప్ చేయించుకుని, నిశ్చింతగా ఉండండి,. ఆ తర్వాత ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, లక్షణాలు కనిపిస్తూ ఉండి, డాక్టర్ సలహా ఇస్తే తప్ప... మాటిమాటికీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, బీఎమ్‌ఐ వంటివి చెక్ చేసుకోకండి. ఆ రీడింగ్స్‌లో కొద్దిపాటì తేడా కనిపించినా అది మరింత ఒత్తిడి పెంచి, మాటిమాటికీ తప్పుడు రీడింగ్స్ చూపుతుంది. అందుకే ఒకసారి వార్షిక పరీక్షల తర్వాత, మీరు ఆరోగ్యవంతులని నిర్ధారణ అయ్యాక... ఇక ఏడాది మధ్యలో మళ్లీ మళ్లీ సాధారణ వైద్యపరీక్షలు వద్దు.
ఆహారం తీసుకునే ముందర సలాడ్స్/గ్రీన్‌సలాడ్స్ తీసుకోవాలని నిర్ణయించుకోండి. దీనివల్ల కడుపు త్వరగా నిండిపోతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదమూ ఉండదు. బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ఆరోగ్యకరమని గుర్తుంచుకోండి.
కంటి నిండా నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. అయితే... మరీ ఎక్కువగా నిద్రపోవడం డిప్రెషన్‌కు సూచిక. మరీ తక్కువగా నిద్రపోవడం గుండెకు హాని చేస్తుంది. మీ రోజువారీ పనులన్నీ ఎలాంటి అలసట లేకుండా చేసుకోగలుగుతున్నారంటే... మీ నిద్ర మీకు సరిపోతోందని అర్థం. వృత్తిపరంగా సాధ్యమైనవారు మధ్యాహ్నం పూట చిన్న పవర్‌న్యాప్ తీసుకున్నా మంచిదే. అయితే అది అరగంటకు మించకూడదు.
ప్రతిరోజూ వ్యాయామం చేయాలనే నిర్ణయం తీసుకోండి. దాని వల్ల మీరు పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. అది అన్ని కండరాలకూ బలం పెంచినట్టే గుండె కండరాలనూ బలోపేతం చేస్తుంది. అందువల్ల గుండెపోటు ముప్పు కూడా నివారితమవుతుంది. అయితే వ్యాయామం కూడా మితిమీరకూడదని, శ్రమ కలిగించేలా ఉండకూడదని గుర్తుంచుకోండి.
మానసిక, శారీరక ఒత్తిడి మితిమీరితే కీడు చేస్తుంది. అయితే కొన్ని పనులు వేళకు జరగడానికి ఒత్తిడి కొంతమేర ఉపయోగపడుతుంది. దాన్ని ఆ మేరకే ఉండనివ్వండి. ఒకవేళ ఒత్తిడి మితిమీరుతున్నట్లు గ్రహిస్తే... వెంటనే టీమ్ వర్క్ ప్రాధాన్యాన్ని గుర్తెరగండి. దాంతో పనులు సకాలంలో పూర్తవుతాయి. చాలా పనులను మంచి టీమ్ వర్క్‌తో సాధించేందుకు... ఆ సామర్థ్యం ఉన్నవారిని ఎంచుకుని సంసిద్ధంగా ఉంచుకోండి.అవసరమైనప్పుడు వారి సేవలను తీసుకోండి.
కొన్ని రకాల పనుల్లో ఉండేవారు లేట్ నైట్ పార్టీలకు వృత్తిపరంగా హాజరు కావాల్సి ఉండవచ్చు. అలాంటి వారు ఓ టైమ్ నిర్ణయించుకుని, అంతకు మించి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకండి. ఇది సామాజికంగా, ఆరోగ్యపరంగా... రెండు విధాలా మంచిదే.
పొగతాగడం పూర్తిగా మానేయండి. పొగాకును చుట్ట, బీడీ, సిగరెట్, తంబాకూ, గుట్కా, ఖైనీ, నశ్యం... ఇలా ఏ రూపంలో తీసుకుంటున్నా వాటిని పూర్తిగా మానేయండి. ఒకవేళ మానలేకపోతే... మీ నికొటిన్ వాంఛను భర్తీ చేసే చ్యూయింగ్‌గమ్ వంటివి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి సహాయంతో చాలా తేలిగ్గా ఈ దురలవాట్లను వదులుకోవచ్చు.
తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. మీ రోజువారీ భోజనమూ మితంగా ఉండాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పకూడదు. రాత్రి భోజనం మరీ ఎక్కువగా తినకూడదు.
ఆరోగ్య కారణాల వల్ల మీకు ఇష్టమైన పదార్థాలను ఎక్కువగా తినకూడదని డాక్టర్ చెప్పినా లేదా చాలా చాలా పరిమితంగానే తీసుకోవాల్సి వచ్చినా... ఆ పదార్థాలను పూర్తిగా మానేస్తామనే నిర్ణయం తీసుకోకండి. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలే విఫలమవుతాయి. దీనికి బదులు... ఒక నిర్ణీతమైన రోజును ఎంచుకుని, ఆనాడు పరిమితమైన మోతాదులో దాన్ని తీసుకుంటానంటూ మనసుకు సర్దిచెప్పుకోండి. పూర్తిగా మానేయలనే సంకల్పం వల్ల దానికి పూర్తిగా దూరమవుతామనే ఓ ఒత్తిడి కలుగుతుంది. దానికి బదులు ఫలానా రోజున దాన్ని ఆస్వాదిస్తామనే భరోసా మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఎప్పుడూ బిజీగా ఉండటమే కాదు... ఇన్‌డోర్స్‌లో పనిచేసేవారు ఈ ఏడాది నుంచి కనీసం అరగంట లేదా గంటసేపు ఆరుబయట పచ్చికలో... ఆకాశం కింద గడపాలని నిర్ణయం తీసుకోండి. ఇది మీకు తాజా శ్వాసనూ, విటమిన్–డిని అందించి, మీ ఆరోగ్యాన్ని మరింత బాగుచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment