
మా నాన్న వెరీ గుడ్
‘మా నాన్న వెరీ గుడ్’ అంటోంది నమ్రత
‘‘అమ్మా! మా నాన్న కూడా వెరీ గుడ్’’
అంటున్నారు గౌతమ్, సితార
ఎవరి నాన్న వాళ్లకి వెరీ గుడ్...
హ్యాపీ ఫాదర్స్ డే .
♦ మహేశ్‌బాబు ఎలాంటి ఫాదర్?
నమ్రత: సేమ్ టు సేమ్... జస్ట్ లైక్ మా నాన్నలానే. ‘మీకు స్కూల్‌కి వెళ్లాలని లేదా? సర్లే వెళ్లొద్దు. మీకు ఆడుకోవాలని ఉందా? ఆడుకోండి. నిద్ర వస్తుందా.. వెళ్లి పడుకోండి. బొమ్మలు ఏవైనా కావాలంటే వెళ్లి కొనుక్కోండి’ – ఇలా పిల్లలు ఏం అడిగినా... ‘యస్’ చెప్తాడు. మహేశ్ నోటి నుంచి ‘నో’ అనే పదమే రాదు.
♦ మీరు స్ట్రిక్ట్‌గా ఉంటారా?
ఓ స్థాయి వరకు ఏం అనను. స్కూల్‌కి వెళ్లాల్సిన టైమ్‌లో ఆటలు ఆడుతుంటే... ఊరుకోను. అప్పుడప్పుడూ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాను.
♦ పిల్లల మార్కుల గురించి మహేశ్ పట్టించుకుంటారా?
చూస్తాడు. ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకుంటాడు. కాకపోతే పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్స్‌కి వెళ్లడు. వాటికి నేను వెళతాను. తప్పకుండా రావాల్సిందే అని గౌతమ్ అడిగితే మాత్రం ఆ ఈవెంట్ మిస్ కాకుండా చూసుకుంటాడు.
♦ మీ గురించి మహేశ్ దగ్గర పిల్లలు కంప్లైంట్ చేస్తారా?
అఫ్‌కోర్స్. రోజూ చేస్తారు. అప్పుడు ‘ఓకే.. అమ్మతో మాట్లాడతా. కూల్’ అంటాడు. ఒక్కోసారి ‘పిల్లలే కదా.. వదిలెయ్’ అని నాతో చెబుతుంటాడు.
♦ ఇప్పుడు మమ్మీ డాడీ కల్చర్ కదా. మరి మీ పిల్లలు అమ్మా, నాన్న అనే పిలుస్తారా?
నేను మా నాన్నని ‘పప్పా’ (నాన్న) అని పిలిచేదాన్ని. అమ్మను ‘మా’ (అమ్మ) అనేదాన్ని. పిలుపు విషయంలో మహేశ్ చాలా పర్టిక్యులర్. అమ్మా, నాన్న అని పిలిపించు కోవాలన్నది తన డెసిషనే. అందుకే మొదట్నుంచీ మా పిల్లలకు అమ్మా, నాన్న అని పిలవడం అలవాటు చేశాం.
♦ ఓ సారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం... మీ నాన్నకు మహేశ్‌బాబు ఎందుకు నచ్చారు? హ్యాండ్‌సమ్‌గా ఉంటారనా? ఆయన మనసు నచ్చిందా?
మహేశ్ ఈజ్ వెరీ కైండ్ అండ్ లవింగ్ పర్సన్. చాలా మంచోడు. అమ్మానాన్నలకు మహేశ్‌లో ఆ లక్షణాలు నచ్చాయి. నేను హ్యాపీగా ఉండడం వాళ్లకు కావాలి. మహేశ్‌తో నేను హ్యాపీగా ఉన్నాను. సో, ఓకే చెప్పేశారు. అంతే తప్ప... మహేశ్ బ్యాంక్ అకౌంట్‌లో ఎంత మనీ ఉంది? అతనెవరి కుమారుడు? అతని క్యాస్ట్ ఏంటి? అతనెక్కడి నుంచి వచ్చాడు? అనేవి ఆలోచించలేదు. మా అమ్మాయి హ్యాపీగా ఉంటుందా? లేదా? అనేది మాత్రమే నాన్న ఆలోచించారు.
♦ మీ ఫాదర్, మీ హజ్బెండ్‌లో ఉన్న సేమ్ క్వాలిటీస్ గురించి?
ఇద్దర్నీ కంపేర్ చేసి చూడలేను. కానీ, ఇద్దరిలో కొన్ని క్వాలిటీస్ కామన్‌గా ఉన్నాయి. ఇద్దరూ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. మహిళలను బాగా గౌరవిస్తారు. ఇద్దరూ వెరీ కైండ్ అండ్ గివింగ్.
♦ ఓ అమ్మాయికి నాన్న దగ్గర దొరికే సపోర్ట్ భర్త దగ్గర కూడా దొరికితే బాగుంటుంది...
(మధ్యలో అందుకుంటూ)... మహేశ్ ఈజ్ పిల్లర్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. నాకే కాదు... మా పిల్లలకు, మా ఫ్యామిలీ అందరికీ మహేశ్ ఎంతో సపోర్ట్. పిల్లలకు, ఫ్యామిలీకి కొంచెం టైమ్ కూడా కేటాయించలేని భర్త అయితే... పరిస్థితి మరోలా ఉండేదేమో! మహేశ్ అలా కాదు. ఎప్పుడూ మాతోనే, మాకు అండగానే ఉంటాడు.
♦ ఏ అమ్మాయికైనా నాన్న అంటే స్పెషల్ లవ్ ఉంటుంది. తండ్రి అంత మంచి వ్యకి భర్తగా రావాలని కోరుకుంటారు.. మీరలా అనుకునేవారా?
లేదండీ. నేనెప్పుడూ అలా అనుకోలేదు. ఎందుకంటే, మనల్ని సంతోషంగా ఉంచే వ్యక్తి మన లైఫ్ పార్ట్‌నర్ అయితే చాలనుకునేదాన్ని. నిజంగానే నాకలాంటి వ్యక్తే దొరికాడు. భర్త అంటే పెత్తనం చేసేవాడు.. భార్య అంటే అణిగి మణిగి ఉండాలనుకునే వ్యక్తి కాదు. ‘నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్విలానే ఉండాలి. వీళ్లతో మాట్లాడకూడదు. ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు’ అనే కండిషన్లు మహేశ్ పెట్ట లేదు. నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోవాల్సిన పరిస్థితి రాలేదు.
♦ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా?
యాక్చువల్‌గా ఎరేంజ్డ్ మ్యారేజెస్‌కి చాలా కట్టుబాట్లు ఉంటాయి. చీర కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవాలి. ఇతరుల కోసం ఇష్టం లేని పనులు కొన్ని చేయాలి. నేను వాటికి వ్యతిరేకిని కాదు. కానీ, ఒక భార్యాభర్త సంతోషంగా ఉండాలంటే అవి ముఖ్యం కాదని నా అభిప్రాయం. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడాలి. ఈ మూడూ ఉంటే సరిపోతుంది. ఏ భార్యాభర్త అయినా హ్యాపీగా ఉంటారు.
♦ మీరు లవ్ మ్యారేజెస్‌నే సపోర్ట్ చేస్తారా?
అవును. బట్, నేను ఎరేంజ్డ్ మ్యారేజ్ మంచిది కాదనడం లేదు. కాకపోతే ఎక్కువగా రాజీపడాల్సి ఉంటుంది. నా ఫ్రెండ్స్‌లో చాలామందికి ఎరేంజ్డ్ మ్యారేజెస్ జరిగాయి. 50 శాతం మంది హ్యాపీగా ఉన్నారు. మిగతా 50 శాతం మంది రాజీలతో సాగిస్తున్నారు. లవ్ మ్యారేజెస్‌లో కూడా అలా ఉంటాయనుకోండి. నా విషయం గురించి మాట్లాడతాను. మనిషి ఎలాంటివాడో తెలుసుకోకుండా అతనితో మిగతా జీవితాన్ని పంచుకోవాలనుకోలేదు. మహేశ్ ఏంటో పూర్తిగా తెలుసుకున్నాకే నేను పెళ్లి చేసుకున్నాను. అందుకే ఇవాళ మేం హ్యాపీగా ఉన్నాం. మా అమ్మానాన్నలది ఎరేంజ్డ్ మ్యారేజే. ఆ తర్వాత వాళ్లిద్దరూ లవ్‌లో పడ్డారు. జీవితాంతం హ్యాపీగా ఉన్నారు.
♦ మీ పెళ్లికి ముందు మహేశ్‌గారు, మీరు లవ్‌లో ఉన్నారు. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, వాళ్ల బాధ్యతలు.. ఇదంతా ఎలా ఉంది?
మా పెళ్లయి పన్నెండేళ్లు. అంతుకుముందు నాలుగేళ్లు ప్రేమించుకున్నాం. సో.. మా బంధం మొత్తం 16 ఏళ్లు. ‘ఇట్స్ వెరీ వెరీ గుడ్’. లవర్స్‌గా ఉన్నప్పటి ఫేజ్ చాలా బాగుండేది. ఆ తర్వాత భార్యాభర్తలయ్యాం. ఆ ఫేజ్ ఎప్పుడూ సూపర్. పేరెంట్స్‌గా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. 16 ఏళ్లలో వచ్చిన ఈ ఫేజ్‌లన్నీ స్వీట్ మెమొరీస్.
♦ మామూలుగా పెళ్లయిన ఏడేళ్లకు భార్యాభర్తల మధ్య ‘సెవన్ ఇయర్స్ ఇచ్’ స్టార్ట్ అవుతుందట.. టూ ఇంటూ సెవన్ 14 ఏళ్లు.. ఇంకా రెండేళ్లు అదనంగానే అయ్యాయి...
(నవ్వుతూ). అయినా మా మధ్య ఎలాంటి ‘ఇచ్’ లేదు. ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే, రోజంతా మేం పక్క పక్కన ఉండం. మహేశ్ షూటింగ్స్‌తో బిజీగా ఉంటాడు. నాకు ఇంటి వ్యవహారాలతో సరిపోతుంది. సంవత్సరంలో మేమంతా కలిసి గడిపే రోజులను లెక్కపెడితే... ఓ మూడు నాలుగు నెలలు ఉంటామేమో. ఆ టైమ్‌ని మేం నలుగురుం చాలా హాయిగా గడుపుతాం. అందుకే అంటున్నా... ‘ఐయామ్ బ్లెస్డ్’.
నాన్నకు గిఫ్ట్... సస్పెన్స్
♦ మీ నాన్నగారు వెరీ గుడ్డా? గుడ్డా? యావరేజ్ డాడీయా?
గౌతమ్: మా నాన్న వెరీ గుడ్. మా గురించి చాలా కేర్ తీసుకుంటారు.
♦ ఫాదర్స్ డేకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా?
గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. కానీ, అదేంటో చెప్పను. సస్పెన్స్. అయితే ఐ వాంట్ టు టెల్ హిమ్ ‘హ్యాపీ ఫాదర్స్ డే’.
♦ తక్కువ మార్కులు వచ్చినప్పుడు మీ నాన్నగారు తిడతారా?
అస్సలు తిట్టరు. కూల్‌గా ఉంటారు.
♦ మీ నాన్న యాక్ట్ చేసిన వాటిలో నీకు బాగా నచ్చిన సినిమా?
‘శ్రీమంతుడు’ అంటే బాగా ఇష్టం. చాలాసార్లు చూశాను.
♦ ‘1 నేనొక్కడినే’లో మీ నాన్నతో యాక్ట్ చేసినప్పుడు ఏమనిపించింది?
నాకు బాగా అనిపించింది. నాన్నతో ఇంట్లో ఉన్నా బాగుంటుంది. లొకేషన్‌లో ఉన్నా బాగుంటుంది. ఎక్కడున్నా బాగా అనిపిస్తుంది.
♦ మీ స్కూల్లో జరిగే ఈవెంట్స్ అన్నింటికీ మీ నాన్న హాజరవుతారా?
ఇంపార్టెంట్ ఈవెంట్స్‌కి తప్పకుండా వస్తారు.
♦ నిన్ను, సితారనీ బాగా గారం చేస్తారా?
చాలా చేస్తారు. ఎంత అల్లరి చేసినా తిట్టరు. మా నాన్న వెరీ వెరీ గుడ్.
♦ మరి.. అమ్మ గురించి?
అమ్మ కూడా వెరీ స్వీట్. కాకపోతే సరిగ్గా చదవకపోయినా, ఎక్కువ అల్లరి చేసినా కొంచెం తిడుతుంది.
♦ సితారా... మీ నాన్న గురించి నువ్వేం చెబుతావ్?
నాన్న వెరీ గుడ్. అన్నయ్య చెప్పాడు కదా. నేనూ నాన్నకి ‘హ్యాపీ ఫాదర్స్ డే’ చెబుతున్నా.
నమ్రత: సితార ఇంకా చిన్న పిల్ల. క్వొశ్చన్స్‌కి ఆన్సర్స్ చెప్పడం అంటే కష్టమే.
♦ మామూలుగా అయితే గౌతమ్‌కన్నా సితారే బాగా మాట్లాడుతుంది కదా..
నమ్రత: ఆ.. అవును. బిందాస్‌గా ఉంటుంది. అచ్చం నాలా. గౌతమ్ ఏమో వాళ్ల నాన్నలా కొంచెం రిజర్వ్(నవ్వేస్తూ).
♦ ఇద్దరిలో మహేశ్‌కి ఎవరు బాగా క్లోజ్?
ఇద్దరూ. నేనెప్పుడూ వాళ్లతోనే ఉంటాను. మహేశ్ షూటింగ్స్‌కి వెళుతుంటాడు కదా... ఎక్కువ మిస్సవుతారు కాబట్టి, పిల్లలిద్దరికీ మనసంతా వాళ్ల నాన్న మీదే ఉంటుంది.
మా నాన్న నేర్పిన విలువలే...
♦ ఫాదర్స్‌డే సందర్భంగా మీ ఫాదర్‌తో మీకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ గురించి?
నమ్రత: నాన్న (నితిన్ శిరోద్కర్), నేను వెరీ వెరీ క్లోజ్. అమ్మానాన్నలకు నేను, సిస్టర్ (శిల్పా శిరోద్కర్) మాత్రమే. నేనంటే నాన్నకు చాలా ఇష్టం. మా అమ్మకు సిస్టర్ అంటే ఇష్టం. నాన్న చాలా సరదా మనిషి. ఫన్ లవింగ్ అండ్ వెరీ కైండ్! ఎప్పుడూ మమ్మల్ని చెడగొట్టేవారు. బాగా గారాబం చేసేవారు. మా అమ్మ ఏమో నాన్నపై కోప్పడేవారు.
♦ మీకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు...
(ప్రశ్న మధ్యలోనే అందుకుంటూ...) ఏం లేదు. నేనే నాన్న దగ్గరకు వెళ్లి మార్కుల గురించి చెప్పేదాన్ని. ఏమీ అనేవారు కాదు. నాకు బాగా గుర్తు... 12వ తరగతిలో (ఇంటర్మీడియట్‌లో) మార్కులు సరిగ్గా రాలేదు. నాన్న దగ్గరకు వెళ్లి ‘సారీ’ చెప్పా. ‘నీకు పాస్ మార్కులు రాకపోతే మళ్లీ ఎగ్జామ్స్ రాయి. డోంట్ వర్రీ’ అన్నారు. నాతో నాన్న అలా ఉండేవారు. చాలా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైమ్... నిజంగా మేము ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మందలించేవారు.
నాన్న లేని లోటు మర్చిపోయాను!
♦ మీ మామగారిలో మీ నాన్నగారిని చూసుకునేంతగా కృష్ణగారు మిమ్మల్ని చేరదీస్తారా?
ఇవాళ మా నాన్నగారు లేరు. అమ్మా నాన్న చనిపోయి పదేళ్లవుతోంది. అది మాకో షాక్. మహేశ్ వల్ల ఆ బాధ నుంచి త్వరగా బయటపడగలిగా. తర్వాత తర్వాత మా మావయ్యగారు నాకు నాన్న లేని లోటుని తెలియనివ్వలేదు. ఇవాళ మావయ్యగారి గురించి ఎవరడిగినా ‘మా నాన్నగారి కన్నా ఎక్కువ’ అని చెబుతుంటాను. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో ఎవరినైనా ఇంకొకరితో పోల్చవచ్చు. కానీ, మా మావయ్యగారిని మాత్రం ఎవరితోనూ పోల్చలేం. అసలు ఆయనలా ఎవరూ ఉండరేమో. నా దృష్టిలో మా మావయ్యగారు ఎంతో ఎత్తులో ఉంటారు. నన్ను కూతురికన్నా ఎక్కువగానే చూస్తారు. ఆ మాటకొస్తే... నాది లక్కీ లైఫ్. మా ఫాదర్ సూపర్. మా ఫాదర్ ఇన్ లా సూపర్. నా హజ్జెండ్ మహేశ్ సూపర్. మహేశ్ ఈజ్ సూపర్ ఫాదర్ ఆల్సో.
♦ మీ నాన్నగారు అలా కోప్పడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?
(ఆలోచిస్తూ...) ఆయనెప్పుడూ అంత సీరియస్ కాలేదు. కానీ, ఎప్పుడైనా నేను, నా సిస్టర్ మాట్లాడిన మాటలు తప్పుగా ఉంటే అప్‌సెట్ అయ్యేవారు.
♦ ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ... అమ్మాయి హీరోయిన్ అవుతానంటే ఏ తండ్రికైనా టెన్షన్ ఉంటుంది కదా!
నో... నో! ఎప్పుడూ నాన్న టెన్షన్ పడలేదు. మా నానమ్మ (మీనాక్షీ శిరోద్కర్) మరాఠీలో ప్రముఖ నటి. నాన్న సిల్వర్ స్పూన్‌తో పుట్టి పెరిగారు. ఆయనొక్కరే పిల్లాడు కావడంతో అందరూ బాగా గారాబం చేశారు. నాన్న పెరిగిందే సినిమాల్లో. ఆయనకు నటన అనేది చాలా సహజమైన విషయం. నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు నాన్న పెద్దగా ఆశ్చర్యపోలేదు. టెన్షనూ పడలేదు.
♦ పోనీ... సలహాలు ఏవైనా ఇచ్చారా?
ఆయన ఆలోచనలు చాలా లిబరల్‌గా ఉంటాయి. అదే సమయంలో... మేము అమ్మాయిల్లాగానే ఉండాలని అనుకునేవారు. ఆయనెప్పుడూ మాతో ‘‘మీరేం చేసినా... మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. విలువలతో సంప్రదాయబద్ధంగా నడుచుకోండి. శక్తిమంతమైన మహిళగా ఉండండి’’ అని చెప్పేవారు. ‘‘మన కుటుంబానికి గానీ... ముఖ్యంగా మీకు గానీ అగౌరవాన్ని తీసుకొచ్చే ఏ పనులూ చేయవద్దు. మిమ్మల్ని చూసి ఎదుటి వ్యక్తులు గౌరవించేలా నడుచుకోండి’’ అని నాన్న చాలాసార్లు చెప్పారు.
♦ మీరిప్పుడు మంచి హోమ్ మేకర్‌గా ఉండటానికి కారణం మీ నాన్నగారు నేర్పించిన విలువలేనా?
అవును. కచ్చితంగా! అమ్మానాన్నలు ఇద్దర్నుంచి నాకు ఈ లక్షణాలు వచ్చాయి. స్పష్టంగా చెప్పాలంటే... నాన్నే. ‘‘మీరేం చేయాలనుకుంటు న్నారో... అది చేయండి. బట్, ఆల్వేస్ బీ స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్టెడ్ విమెన్. ఏ గుడ్ హోమ్ మేకర్’’ అని నాన్న చెప్పేవారు. నువ్వో అమ్మాయివి కనుక... ఏం చేసినా సక్సెస్‌ఫుల్‌గా చేయాలనే వారు. అప్పుడే ప్రతి ఒక్కరూ గౌరవంగా, ప్రేమగా చూస్తారని చెప్పేవారు.
♦ మీరు తెలుగింటికి కోడలిగా అడుగుపెడుతున్న టైమ్‌లో నాన్న ఏవైనా సలహాలు ఇచ్చారా?
అమ్మానాన్నలకు మహేశ్ అంటే ఎంతో ఇష్టం, ప్రేమ. మహేశ్, నేనూ లవ్‌లో ఉన్నప్పుడు వాళ్లు మహేశ్‌ను కలిశారు. అప్పుడే నచ్చేశాడు. మావయ్యగారిని (కృష్ణ) కూడా కలిశారు. అమ్మానాన్నలు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇక్కడో విషయం చెప్పాలి. మా ఇంట్లో కులమతాల పట్టింపులు లేవు. మా అమ్మానాన్నలనే కాదు... వాళ్ల తల్లిదండ్రులకు కూడా పట్టింపులు లేవు. అంటే.. అప్పటి తరంవాళ్లు అలా ఉండటం గొప్ప విషయం. ‘‘తప్పకుండా మహారాష్ట్ర వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉండకూడదు. మన క్యాస్ట్ అయ్యుండాలి’’ వంటి సమస్యలు మా ఫ్యామిలీలో ఎప్పుడూ లేవు. నేను హ్యాపీగా ఉండాలనేది అమ్మానాన్నల అభిమతం. నా విషయంలోనే కాదు... సిస్టర్ విషయంలోనూ అంతే. ప్రతి ఒక్కరూ నేర్చుకోవల్సిన పాఠమిది.
– డి.జి. భవాని