కందులిమరి గ్రామం చేల గట్ల మీద మొదలైన హిమాదాస్ పరుగు ఫిన్లాండ్‌లోని టాంపేర్ స్టేడియం ట్రాక్ ఎక్కింది. ఈ రెండింటి మధ్య సాగిన హిమ ప్రయాణం అంత పెద్దదీ కాదు, మరీ చిన్నదీ కాదు. గోల్డ్ మెడల్ కోసం ఆమె ఆయాస పడి శ్రమించింది లేదు, ఒక ఏడాది కష్టపడిందంతే!
పిల్లలు హక్కులు ప్రదర్శిస్తుంటారు. ప్రశ్నలు సంధిస్తుంటారు. అలాంటి హక్కులున్న చిన్న పిల్ల హిమాదాస్. ఐదుగురు పిల్లల్లో చిన్నమ్మాయి. అందరి కంచాల్లోకి అన్నం రావాలంటే, ఇంట్లో అందరి ఒంటి మీద శుభ్రమైన దుస్తులు ఉండాలంటే ఇంట్లో అందరూ కష్టపడాల్సిన కుటుంబ నేపథ్యం వారిది. అయినా సరే ఆడుతూపాడుతూ బాల్యాన్ని బాల్యంగా ఆస్వాదించే విరచిత హక్కులు దఖలు పరచబడిన అమ్మాయి హిమ. చిన్నప్పుడు హిమ అబ్బాయిలతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూంటే అమ్మానాన్నలు మురిసిపోయారు. ‘అదేంటి మగపిల్లాడిలా’ అనలేదు. ఇప్పుడీ అమ్మాయి సాధించిన విజయానికి దేశం మొత్తం బుగ్గలు పుణికి మొటికలు విరుస్తుంటే పొంగిపోతున్నారు. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వంటి దేశ ప్రముఖులైతే ప్రపంచ స్థాయిలో మన జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు హిమను చూసి గర్వపడుతున్నారు. ఇంత పెద్ద దేశం, నూటా ముప్పై కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం... ఇన్ని కోట్లమందిలో ఇంతవరకు ఒక్కరూ సాధించని విజయాన్ని పద్దెనిమిదేళ్ల అమ్మాయి సాధించింది. ఆమె తెచ్చిన బంగారు పతకమే..
ఈ దేశానికి ప్రపంచ స్థాయి అథ్లెటిక్ రంగంలో తొలి గోల్డ్ మెడల్. ఐఏఏఎఫ్ అండర్ 20 కేటగిరీలో అథ్లెటిక్స్‌లో పాల్గొని 51.46 సెకన్లలో నాలుగు వందల మీటర్ల లక్ష్యాన్ని చేరుకుని తొలి స్థానంలో నిలిచింది హిమాదాస్. క్రీడాకారులు విరాట్ కోహ్లీ, వీరేందర్ సింగ్ సెహ్వాగ్, బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌తోపాటు అనేకమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ‘దేశానికి ప్రపంచస్థాయి బంగారు పతకం తెచ్చిన బంగారం’ అని ప్రశంసల్లో ముంచెత్తారు.
సౌకర్యాలు లేకుండానే సాధన!
అస్సాం రాష్ట్రం, నాగోన్ జిల్లా, థింగ్ పట్టణానికి సమీపంలో కందులిమరి గ్రామం చేల గట్ల మీద మొదలైన హిమ పరుగు ఫిన్లాండ్‌లోని టాంపేర్ స్టేడియం ట్రాక్ ఎక్కింది. ఈ రెండింటి మధ్య సాగిన హిమ ప్రయాణం అంత పెద్దదీ కాదు, మరీ చిన్నదీ కాదు. గోల్డ్ మెడల్ కోసం ఆమె ఆయాస పడి శ్రమించింది లేదు, ఒక ఏడాది కష్టపడిందంతే. అలాగని వడ్డించిన విస్తరిలా ఆమెకు అన్నీ సిద్ధంగా ఉన్నాయా అంటే.. ఏ ఒక్క సౌకర్యమూ లేదు. కనీసం కాళ్లకు స్పోర్ట్స్ షూ కొనడానికి కూడా తండ్రి దగ్గర డబ్బుల్లేవు. హిమలో అథ్లెట్ ఉందని గుర్తించింది ఆ స్కూల్ పీఈటీ నిపాన్ దాస్. అథ్లెటిక్స్ వైపు ఆమె దృష్టిని మరల్చింది కూడా అతడే. జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకెళ్లడంతోపాటు రాష్ట్ర క్రీడల కార్పొరేషన్ సహాయంతో మెరుగైన శిక్షణ ఇప్పించడంలోనూ సహకరించాడతడు. పల్లెటూరిలోనే ఉంటే స్పెషల్ కోచింగ్ కుదరదు. అందుకే గౌహతికి తాత్కాలికంగా మకాం మార్చమని హిమ తల్లిదండ్రులు రంజిత్, జోనాలి దాస్‌లకు సూచించాడు. గౌహతిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు దగ్గరగా ఇల్లు అద్దెకు తీసుకుని శిక్షణ ఇప్పించారు.
తన పోటీ తనతోనే!!
హిమాదాస్ పరుగెత్తిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ... ‘పక్క ప్రత్యర్థులను చూడను కూడా చూడదు. లక్ష్యం వైపు సాగడమే తన పని అన్నట్లు పరుగెడుతుంది. తన టైమింగ్ తానే అధిగమించాలనే లక్ష్యంతో పరుగెత్తుతుంది’ అన్నారు నిపాన్. అందరి ప్రశంసలు ఒక ఎత్తయితే క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మెచ్చుకోలు ఒక్కటీ ఒకెత్తు. ఆయన ట్విట్టర్‌లో ‘హిమ చరిత్ర సృష్టించింది, ఈ చాంపియన్ షిప్ సాధించిన తొలి ఇండియన్. దేశానికే గర్వకారణం ఈ నారీ శక్తి’ అంటూ హిమాదాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ మంత్రి ఎన్నికల్లో గెలుపు ఓటములనే కాకుండా, క్రీడల్లో గెలుపు ఓటములు కూడా తెలిసిన వాడు కదా మరి.
Comments
Please login to add a commentAdd a comment