హోమ్‌మేడ్
ప్రస్తుతం మనం తీసుకునే ఆహారమే కలుషితమైందని బాధపడుతుంటే మరోవైపు బ్యూటీ ప్రాడక్ట్స్, హెల్త్ ప్రాడక్ట్స్‌లో ఉండే రసాయనాల కారణంగా ఆరోగ్యం మరింత చెడిపోతోంది. దానికి పరిష్కారంగా ఇంట్లో కొన్ని వస్తువులను తయారు చేసుకోవచ్చు. అలా ఆర్గానిక్ ప్రాడక్ట్స్‌ను నిశ్చింతగా ఉపయోగించుకోవచ్చు..
టూత్ పేస్ట్: మార్కెట్‌లో దొరికే టూత్‌పేస్ట్‌లలో సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఉండటం వల్ల దీర్ఘకాలం వాటిని వాడితే అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి ఇంట్లోనే ఆరోగ్యవంతమైన టూత్ పేస్ట్‌ను తయారు చేసుకోండి.
కావాల్సినవి: బేకింగ్ సోడా-1 టీ స్పూన్, మెత్తని ఉప్పు- 1/2 టీ స్పూన్, పెప్పర్‌మెంట్ ఆయిల్- 1 చుక్క, లవంగ నూనె- 1 చుక్క, శుద్ధమైన నీరు- కొన్ని చుక్కలు
తయారీ: పైన పదార్థాలన్నింటినీ ఒక ప్లాస్టిక్ గిన్నెలో వేయాలి. వాటిని మెత్తగా అయ్యేవరకు బాగా కలపాలి. నీళ్లు సరిపోకపోతే మరి కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. అంతే! ఆరోగ్యవంతమైన టూత్ పేస్ట్ రెడీ..
హెయిర్ డై: ఇప్పుడు చిన్నా పెద్దా అని వయసుతో పరిమితం లేకుండా అందరికీ జుట్టుకు తెల్లగా మారుతోంది. దాంతో చాలామంది హెయిర్ డై వేసుకుంటున్నారు. ఆ డైలోని అమోనియా కారణంగా జుట్టు రాలడం, డ్రై స్కాల్ప్ కావడం లాంటివి జరుగుతాయి. వాటిని దూరం చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే హెయిర్ డైను తయారు చేసుకోండి.
కావాల్సినవి: బ్లాక్ వాల్‌నట్ పౌడర్- 1/4 కప్పు, నీళ్లు- 3 కప్పులు, బ్లాక్ టీ బ్యాగులు- 2-3, ఖాళీ టీ బ్యాగ్-1
తయారీ: ఒక ప్లాస్టిక్ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఖాళీ టీ బ్యాగ్‌లో బ్లాక్ వాల్‌నట్ పౌడర్‌ను నింపి దాన్ని ఓ ఆరు గంటల పాటు నీళ్ల గిన్నెలో నానబెట్టాలి. తర్వాత ఆ నీటితో జుట్టును కడుక్కొని ఆరే వరకు గాలికి కూర్చోండి. తర్వాత మరో నీళ్ల గిన్నెలో నానబెట్టిన బ్లాక్ టీ బ్యాగ్‌లను తీసుకోవాలి. ఆ ఆరిన జుట్టును ఇప్పుడు రెండో గిన్నెలోని నీళ్లతో కడుక్కోవాలి. అంతే! మీ జుట్టు డార్క్ గ్రే కలర్‌లోకి మారుతుంది. ఇలా తరచూ చేస్తే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఇందులో ఏ రసాయనాలు లేకపోవడం వల్ల అవసరమైతే వారానికి మూడుసార్లైనా ఈ నేచురల్ హెయిర్ డై వేసుకోవచ్చు.
షేవింగ్ క్రీమ్: కొన్ని షేవింగ్ క్రీముల కారణంగా చాలా మందికి సున్నితమైన చర్మంపై ర్యాషెస్ అవుతుంటాయి. అలాగే రేజర్ బర్న్స్‌ను కొన్ని క్రీములు రెట్టింపు చేస్తాయి. అదే ఆర్గానిక్ షేవింగ్ క్రీమ్ ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుంది.
కావాల్సినవి: కాస్టైల్ సోప్ (ఆలివ్ ఆయిల్, సోడాతో చేసింది)-1/4 కప్పు, కరిగించిన కోకో బట్టర్-1/4 కప్పు, ఆల్మండ్ ఆయిల్- 1/2 కప్పు, ఎస్సెన్షియల్ ఆయిల్ ఏదైనా..ఉదా: లావెండర్ ఆయిల్-5 చుక్కలు, తేనె-1/4 కప్పు, గోరు వెచ్చని నీళ్లు-3/4 కప్పు
తయారీ: ఒక మూకుడులో కొన్ని నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. దానిపైన మరో మూకుడు పెట్టి అందులోనూ కొన్ని నీళ్లు పోయాలి. తర్వాత ఆ పైన మూకుడులో కోకో బట్టర్ వేయాలి. అది కరుగుతున్నప్పుడు అందులో ఆల్మండ్ ఆయిల్, సోప్, తేనె వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఎస్సెన్షియల్ ఆయిల్‌తో కలిపి ఓ ప్లాస్టిక్ గిన్నెలో తీసుకోవాలి. తర్వాత అది క్రీమ్‌లా కావడానికి కొన్ని నీళ్లు పోసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపితే నేచురల్ షేవింగ్ క్రీమ్ రెడీ అవుతుంది.
ఇంట్లోనే తయారీ...
Published Mon, Aug 10 2015 10:41 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement