చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి | Homeo Counselling For Nerve System | Sakshi
Sakshi News home page

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

Published Thu, Jul 11 2019 11:55 AM | Last Updated on Thu, Jul 11 2019 11:55 AM

Homeo Counselling For Nerve System - Sakshi

నా వయసు 56 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా?– బి. రామకృష్ణ, నెమ్మికల్‌

మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్‌ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా,  జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది.

కారణాలు : ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం             ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్వు సమయం మెడను వంచి ఫోన్‌లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం                       మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు.

హోమియో చికిత్స: జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు.డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్,హైదరాబాద్‌

మా బాబు వయసు మూడేళ్లు దాటుతోంది. ఇంకా మాట్లాడటం గానీ, పిలిస్తే పలకడం గానీ, పిల్లలతో ఆడటం కానీ చేయడం లేదు. చూడటానికి బాగానే ఉంటాడు. ఎవ్వరినీ కలవడు. పిల్లల డాక్టర్‌కు చూపిస్తే ఇది ఆటిజం కావచ్చని, అవే లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా?– ఎమ్‌. సుకుమార్, వైజాగ్‌

ఆటిజం ఇటీవల చాలా ఎక్కువ మంది పిల్లల్లో కనిపిస్తోంది. ఆటిజాన్ని ‘పర్వేజివ్‌ డెవలప్‌మెంట్‌ డిసార్డర్‌’ అంటారు. ఆటిజం అనేది ఒక లక్షణం కాదు. దీనిలో వివిధ లక్షణాలు, ఎన్నో స్థాయులు, మరెన్నో భేదాలు ఉంటాయి. ఆటిజం అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ఆటిజం లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని క్లాసికల్‌ ఆటిజం అంటారు. మకొంతమందిలో లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అది జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీన్ని మైల్డ్‌ ఆటిజం అంటారు. ఆటిజం ఉన్న పిల్లలందరూ ఒకేలా ఉండకపోవచ్చు.

ఆటిజం అనేది మెదడు, నాడీవ్యవస్థ ఎదగకపోవడం వల్ల పుట్టుకతో వచ్చే సమస్యే అయినా కొంతమంది పిల్లల్లో మూడేళ్ల వరకు దాన్ని గుర్తించకపోవచ్చు. ఆటిజం జన్యుపరమైన కారణాల వల్ల వస్తుందని తెలిసినా, దానికి సంబంధించిన జన్యువును ఇంకా గుర్తించలేదు.

కారణాలు: ∙జన్యుసంబంధిత కారణాల వల్ల ∙గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ సోకడం వల్ల ∙తల్లిదండ్రుల్లో మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు ఉంటే ∙డయాబెటిస్, థైరాయిడ్‌ లాంటి సమస్యలతో బాధపడుతూ సరైన చికిత్స తీసుకోని వారిలో ఆటిజం వచ్చే అవకాశం ఉంది. ∙మెదడులో సెరిటోనిన్, డోపమైన్‌ వంటి రసాయనాల మార్పులు కూడా ఈ వ్యాధికి కారణం కావచ్చు. ∙తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవడం వల్ల పిల్లల్లో వచ్చే మానసిక ఎదుగుదల లోపాలు కూడా ఈ వ్యాధికి మూలం కావచ్చు.

లక్షణాలు: ∙ఎదుటివారి మనోభావాలు అర్థం చేసుకోలేకపోవడం ∙నలుగురిలో కలవలేకపోవడం లేదా ఆనందాలు, బాధలు పంచుకోలేకపోవడం ∙చేతులు, కాళ్లు కదపడం ∙కొత్తదనానికి తొందరగా అలవాటు పడలేకపోవడం, రొటీన్‌గా ఉండటాన్నే ఇష్టపడటం  ∙అలవాటు పడ్డ వ్యక్తులతో మాత్రమే ఉండటం.

చికిత్స: ఆటిజం వ్యాధికి హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను, ఆహారపు అలవాట్లను, జీవనవిధానం, వ్యక్తిత్వం చూసి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధి కోసం కార్కినోసిస్, తుజా, సిక్రెటిన్‌ వంటి మందులను లక్షణాలను ఇవ్వాలి. వ్యాధిని త్వరగానూ, ముందుగానే  గుర్తిస్తే మంచి ఫలితం ఉంటుంది. -డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

నా వయసు 41 ఏళ్లు.  ఐదు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతో మంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా?– కె. బాలకృష్ణ, చిత్తూరు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్‌ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు.
లక్షణాలు : ∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ∙కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ∙తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది.
కారణాలు: వంశపారంపర్యం; అధిక ఒత్తిడి; ఆటోఇమ్యూన్‌ డిజార్డర్లు సోరియాసిస్‌కు ప్రధాన కారణాలు.  ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో  మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఇటీవలి వ్యాధి ట్రెండ్‌: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి.
చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్‌ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో  ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది.డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement