హోమియో కౌన్సెలింగ్
మా అమ్మాయి వయసు 25 ఏళ్లు. రాత్రి షిఫ్ట్‌లో ఉద్యోగం చేస్తోంది. ఆమె జాబ్‌లో ఒత్తిడి ఎక్కువ. ఒక రోజు కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఉంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. డాక్టర్లు చూసి కన్వల్షన్స్ (మూర్ఛ) అన్నారు. జీవితాంతం మందులు వాడాలి అని చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - లక్ష్మీ, కందుకూరు
మూర్చ వ్యాధి అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకు, మెదడుకు సంబంధించిన వ్యాధులలో ఒకటి. మెదడులో రసాయనిక చర్యల వల్ల విద్యుత్ తరంగాలు వెలువడటంతో కేంద్రనాడీ వ్యవస్థలో, యాంత్రిక నాడీ వ్యవస్థలో పెనుమార్పులు సంభవించి, మనిషి స్పర్శ కోల్పోవడం, కండరాలు బిగుసుకుపోవడం, శరీరంలోని భాగాలలో వణుకు రావడం వంటి లక్షణాలు ఏర్పడటాన్ని కలగలిపి మూర్చవ్యాధి అంటారు. మూర్చవ్యాధి చిన్నపిల్లల్లోనూ, పెద్దవారిలోనూ వచ్చే అవకాశం ఉంది.
ఈ జబ్బుతో బాధపడేవారు కొందరు కిందపడిపోయి గిలగిలా కొట్టుకుంటూ స్పృహతప్పి పడిపోతుంటారు. ఈ సమయంలో వారి నోటి నుంచి నురగ కూడా వస్తుంటుంది. దాంతో వారిని మూర్చవ్యాధిగ్రస్తులుగా మనం గుర్తిస్తాం. పక్కవారు కొందరు వారి చేతిలో తాళాల గుత్తి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఏ విధమైన ఉపశమనమూ ఇవ్వదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
కారణాలు: జ్వరం, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల మూర్చవ్యాధి రావచ్చు మెదడులో లోపాలు లేదా మెదడులో కంతులు, మెదడు రసాయనాల్లో మార్పులు/అసమతుల్యత, ఇన్ఫెక్షన్లు అతిగా మద్యపానం, ఆకలితో ఎక్కువసేపు ఉండటం నిద్రలేకపోవడం
లక్షణాలు: మూర్చపోయే ముందు తీవ్రమైన వణుకులు, నోటి నుంచి చొంగ కారడం, ఒక్కోసారి నాలుక కరచుకోవడం వంటివి చేస్తుంటారు. స్పర్శ కోల్పోవడం, అరుపులతో శబ్దాలు చేయడం ఒళ్లంతా చెమటలు పట్టడం తెలియకుండా మూత్రవిసర్జన చేయడం.
చికిత్స: హోమియోలో ఈ వ్యాధికి చికిత్స వయసును బట్టి ఉంటుంది. దీనికి కోనియం, ఫై మెట్, సెలీనియమ్, కాల్కేరియా కార్బ్, క్యూప్రమ్‌మెట్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని హోమియో డాక్టర్లు మందులు సూచిస్తారు. అనుభజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాటిని వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి
హైదరాబాద్
కిడ్నీ ఫెయిల్యూర్ అంటే..?
కిడ్నీ కౌన్సెలింగ్
మా నాన్నగారి వయసు 45 ఏళ్లు. ఆయనకు డయాబెటిస్ ఉంది. కిడ్నీ పాడైందని డాక్టర్లు చెప్పారు. సమస్యను డయాబెటిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటున్నారు. అంటే ఏమిటి? దీనికి కారణాలు, లక్షణాలు, నిర్ధారణ పరీక్షల గురించి చెప్పండి. - ప్రసాద్, గుంటూరు
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ అన్నది చాలా సాధారణమైంది. మారుతున్న జీవనశైలి, స్థూలకాయం, లోపించిన దేహ పరిశ్రమ, డయాబెటిస్ వ్యాధి పట్ల అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతోంది. కొన్ని ఏళ్ల తరబడి నియంత్రణలో లేని డయాబెటిస్ దుష్ర్పభావాల వల్ల చాలా మంది మూత్రపిండాల వైఫల్యానికి గురై, మృత్యువాత పడటం జరుగుతోంది. డయాబెటిస్ మూలంగా వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ గురించి అవగాహన కల్పించాలి. దాదాపు అరవై రకాల వ్యాధులకు డయాబెటిస్ ప్రధాన కారణమవుతోందని అధ్యయనాల్లో గుర్తించారు. దీర్ఘకాలికంగా డయాబెటిస్‌తో బాధపడేవారిలో ఎక్కువ మంది డయాబెటిస్ కిడ్నీ ఫెయిల్యూర్‌కి గురవుతుంటారు.
మానవ శరీరంలోని విసర్జక వ్యవస్థలో కిడ్నీలు ప్రధానమైన పాత్ర పోషిస్తుంటాయి. శరీరంలోని అబ్డామిన్ క్యావిటీకి వెనుక భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఈ కిడ్నీలు అమరి ఉన్నాయి. ఒక్కొక్క కిడ్నీ పొడవు 11 సెం.మీ. వెడల్పు 6 సెం.మీ., మందం 3 సెం.మీ. కలిగి, బరువు 150 గ్రాములు ఉంటుంది. ఈ కిడ్నీల్లో నెఫ్రాన్స్ అనే ఫిల్టర్స్ ఉంటాయి. అవి అవిశ్రాంతంగా రక్తాన్ని వడపోస్తూ అందులోని విష, వ్యర్థ, మలిన పదార్థాలను మూత్రరూపంలో బయటకు పంపుతుంటాయి. ఈ రక్త వడపోత కార్యక్రమంలో అంతరాయం ఏర్పడటాన్ని డయాబెటిస్ కిడ్నీ ఫెయిల్యుర్ అంటారు.
కిడ్నీ ఫెయిల్యూర్ రకాలు: 1.అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ 2.క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్.
కారణాలు: కిడ్నీ ఫెయిల్యూర్‌కి అనేక కారణాలున్నాయి. వాటిలో కొన్ని... పుట్టుకతో జన్యుపరంగా వచ్చే వ్యాధులు తర్వాతి కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు మూత్ర విసర్జక వ్యవస్థలో ఏ అవయవానికైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, సరైన సమయంలో చికిత్స చేయించకపోతే కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారితీయవచ్చు దీర్ఘకాలికంగా డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండెజబ్బులకు సరైన చికిత్స తీసుకోనివారిలో ఎక్కువ శాతం మంది కిడ్నీ వైఫల్యానికి గురవుతుంటారు మన శరీరాన్ని రక్షించాల్సిన వ్యాధి నిరోధక శక్తి మన మూత్రపిండాలపైనే దాడి చేస్తే అవి దెబ్బతింటాయి. ఈ కండిషన్‌ను క్రానిక్ గ్లోమెరులో-నెఫ్రైటిస్ అని అంటారు.
లక్షణాలు: ముఖం, పొట్ట, కాళ్లు, పాదాలకు బాగా నీరుపడుతుంది ఆహారం తీసుకున్న వెంటనే వాంతి వచ్చినట్లుగా ఉంటుంది మూత్రవిసర్జనలో మార్పులు వస్తాయి ఆకలి తగ్గిపోతుంది బరువు తగ్గుతుంది బద్దకంగా ఉండటం తలనొప్పి కళ్లు తిరగడం ఒళ్లంతా దురదలు మగతగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వ్యాధి నిర్ధారణ: సీరమ్ క్రియాటినిన్ బ్లడ్ యూరియా యూరిక్ యాసిడ్స్, ప్రోటీన్స్ మొదలైనవి నార్మల్ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి ఆల్బుమిన్ మూడు ప్లస్ ఉంటుంది అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఐవీపీ ఎక్స్‌రే ద్వారా కిడ్నీ వైఫల్యాన్ని గుర్తించవచ్చు రీనల్ బయాప్సీ ద్వారా కిడ్నీ ఎంత మేరకు దెబ్బతిన్నదనే అంశాన్ని, కిడ్నీ భవిష్యత్తును పూర్తిగా తెలుసుకోవచ్చు.
డాక్టర్ ఎమ్.కమల్ కిరణ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్