ఒక ఊరిలో ఒక వృద్ధుడు తన ధార్మిక చింతనతో, దైవారాధనలతో ఎంతోమంది అనుయాయులను సంపాదించుకున్నాడు. ఒకరోజు అనుయాయుడొకరు వచ్చి, ‘‘గురువర్యా! నా వ్యాపారం అభివృద్ధి చెందాలని దీవించండి’’ అని ప్రాధేయపడ్డాడు. ‘‘దైవం నీ వ్యాపారంలో వృద్ధీ వికాసాలు ప్రసాదించుగాక. ధాన్యాన్ని నిజాయితీగా తూచి ఇవ్వు. వ్యాపారంలో నిజాయితీగా వ్యవహరించు. మోసాలకు పాల్పడకు’’ అని హితవు పలికాడు వృద్ధుడు. దీంతో తనలో గూడుకట్టుకుని ఉన్న మోసబుద్ధిని గురువుగారి హితవుతో పూర్తిగా మానుకున్నాడు.
వ్యాపారాన్ని నిజాయితీగా, ఎలాంటి కల్తీలు, మోసాలకు పాల్పడకుండా సాగించాడు. అనతికాలంలోనే మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఆ ప్రాంతంలో నిజాయితీగల వ్యాపారిగా అందరి మన్ననల్ని అందుకున్నాడు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. తూనిక రాళ్లను బంగారంతో తయారు చేయించేంతగా వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు.
ఫలానా షావుకారు వద్ద బంగారు తూనికరాళ్లు ఉన్నాయని ప్రజలు గొప్పగా చెప్పుకునేవారు. ఆ తూనికరాళ్లను ఆశ్చర్యంగా చూసి వెళ్లేవారు. ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువుగారి వద్దకు వచ్చి ‘‘గురువుగారూ! మీ ఆశీర్వాదం వల్ల నా వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. నేను ధాన్యాన్ని తూచడానికి బంగారపు తూనికరాళ్లను ఉపయోగిస్తున్నాను’’ అని ఎంతో సంతోషంగా చెప్పాడు.
‘‘అవునా? అయితే ఆ పుత్తడి తూనిక రాళ్లను తీసుకెళ్లి వాగులో పడవేయి’’ అన్నాడు వృద్ధుడు. గురువు గారి ఆజ్ఞకు వ్యాపారి బిత్తరపోయాడు. ఆజ్ఞ పాటించక తప్పదన్నట్లుగా ఆ రాళ్లను వాగులో విసిరేశాడు. ఈ సంఘటన జరిగిన రెండు మూడు రోజుల తర్వాత కొంతమంది రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం వాగును దాటుతుండగా ఆ తూనిక రాళ్లు వారి కాళ్లకు తగిలాయి.
వెంటనే అవి వ్యాపారికి సంబంధించినవిగా గుర్తించి, అతడికి అప్పగించారు. ఆ వ్యాపారి వాటిని తీసుకుని వెళ్లి.. ‘నేనైతే వీటిని వాగులో పడేశాను. కాని తిరిగి ఇవి నా వద్దకే వచ్చాయి’’ అని గురువుగారికి చెప్పాడు. ‘‘ఇది ఒక పరీక్ష మాత్రమే. నిజాయితీగా సంపాదించిన నీ సొమ్మును నువ్వు వాగులో పడేసినా తిరిగి నీ దగ్గరికే వచ్చిందంటే ఇది నీ కష్టార్జితం. నిజాయితీగా సంపాదించినదే. ఇలాంటి సంపద గౌరవమైనది’’ అన్నాడు వృద్ధుడు.
– సుమయ్యా
Comments
Please login to add a commentAdd a comment