ఎంతవరకు పాత్ర ఉంటే.. అంతవరకే వేడి!
హౌ ఇట్ వర్క్స్? / ఇండక్షన్ స్టవ్
ఇండక్షన్ స్టవ్‌ల గురించి మీరు విన్నారా? వినే ఉంటారులెండి. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయాయి ఇవి. గ్యాస్‌కంటే తక్కువ ఖర్చుతో వంట చేసుకోవచ్చునని, పిల్లలు ముట్టుకున్నా అపాయం లేదని రకరకాల ప్రచారం జరుగుతోంది వీటిపై. ఈ విషయాలను కాసేపు పక్కనపెడితే ఇవి ఎలా పనిచేస్తాయన్నది మాత్రం చాలా ఆసక్తికరం. ఏదైనా మెటల్ తీగచుట్టలోకి కరెంటు ప్రవహిస్తే ఏమవుతుంది? ఆ తీగచుట్ట కాస్తా అయస్కాంతంగా మారుతుంది. ఫలితంగా దీని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇండక్షన్ కుక్కర్‌లో జరిగే తంతూ ఇదే. నిజానికి ఇండక్షన్ అంటేనే అయస్కాంతం సాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేయడమని అర్థం. ఇంకోలా చెప్పాలంటే విద్యుదయస్కాంత తత్వం తాలూకూ రెండు రూపాలు విద్యుత్తు, అయస్కాంత శక్తి అన్నమాట. ఇండక్షన్ స్టవ్‌లోనూ ఓ తీగచుట్ట ఉంటుంది. స్విచ్ ఆచ్ చేయగానే దాంట్లోకి కరెంటు ప్రవహిస్తుంది. విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. స్టవ్‌పై ఏదైనా పాత్రను ఉంచినప్పుడు అయస్కాంత క్షేత్రం పాత్రపై కూడా ప్రభావం చూపుతుంది. పాత్రలోని ఎలక్ట్రాన్లు క్షేత్రానికి తగ్గట్టుగా ప్రవహిస్తాయి.
ఈ కదలికలు అడ్డదిడ్డంగా ఉండటం వల్ల విపరీతమైన శక్తి పుడుతుంది. ఉష్ణం రూపంలో వెలువడుతూంటుంది. దీని ద్వారా పాత్ర లోపల ఉన్న పదార్థాలూ వేడెక్కుతాయన్నమాట. అంతే! స్టవ్‌పై పాత్ర ఉన్న ప్రాంతంలో మాత్రమే అయస్కాంత క్షేత్రాల్లో తేడాలు రావడం, ఉష్ణం పుడుతుంది కాబట్టి మిగిలిన చోట్ల అంతా మామూలుగానే ఉంటుంది. ఇంకో విషయం. ఇండక్షన్ స్టవ్ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలంటే వీలైనంత వరకూ ఇరన్ పాత్రలు లేదా అడుగున ఐరన్ పూత ఉన్న పాత్రలు వాడటం మేలు.