నివారించవచ్చు... నిరోధించవచ్చు..!
మహిళలకు తాము కోరుకున్నప్పుడు గర్భం ధరించడం ఎంతగా ఆనందం కలిగించే అంశమో... తాము కోరుకోని సమయంలో గర్భధారణ జరగడం అంతగా బాధించే విషయం. అందుకే తాము వద్దనుకున్న సమయంలో గర్భధారణ జరగకుండా చూసుకునేందుకు మహిళలకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయిప్పుడు. అయితే ఎవో ఒకటి రెండు విధానాలు... ఎవరో కొందరికి మినహా... అవాంఛిత గర్భధారణను నివారించే మార్గాల గురించి అంతగా అవగాహన లేదు. ఆ అవగాహనను పెంచడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం.
గర్భధారణను నివారించేందుకు అందరికీ తెలిసిన మార్గాలు మహిళలు నోటిద్వారా వేసుకునే ఓరల్ పిల్స్, పురుషులు ఉపయోగించే కండోమ్స్. ఇవే కాకుండా మహిళలు మరెన్నో విధానాలను అనుసరించడం ద్వారా అవాంఛిత గర్భధారణను ఆపవచ్చు. అందులో కొన్ని పద్ధతులివి...
నోటి ద్వారా తీసుకునే మాత్రలు: ఓరల్ పిల్స్‌గా పేర్కొనే ఇందులో ప్రధానంగా రెండు రకాలున్నాయి. అవి... కంబైన్‌డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ప్రోజెస్టిన్ పిల్స్.
కంబైన్‌డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ : వీటిలో రెండు హార్మోన్లు ఉంటాయి. అందులో ఒకటి ఈస్ట్రోజెన్, మరొకటి ప్రోజెస్టిన్. ఈ మాత్ర రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి మహిళలో అండం విడుదల కాకుండా చూడటం. మరోటి వీర్యం కదలికలకు అడ్డుకట్ట వేసి అది అండంతో కలవకుండా చేయడం. అయితే ఇవి కూడా పూర్తిగా రక్షణ కల్పించలేవు. ఎనిమిది శాతం మందిలో ఇవి ఉపయోగించినా గర్భం వచ్చే అవకాశాలుంటాయి. వీటితో ప్రయోజనాలతో పాటు కొన్ని ప్రతికూల అంశాలూ ఉన్నాయి. ఇవి మహిళల్లో ఒవేరియన్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్‌లతోబాటు రుతుక్రమం సమయంలో నొప్పిని, అధిక రక్తస్రావం జరగడాన్ని తగ్గిస్తాయి. అయితే ఇవి కొందరిలో తలనొప్పి, డిప్రెషన్‌ను కలిగించడాన్ని ఈ మాత్రల విషయంలో ప్రతికూల అంశాలుగా భావించవచ్చు.
ప్రొజెస్టిన్ పిల్స్: దీన్ని రోజుకు ఒకటి చొప్పున వాడాల్సి ఉంటుంది.
ఇందులో కేవలం ప్రోజెస్టిన్ అనే హార్మోన్ మాత్రమే ఉంటుంది. ఇది గర్భాశయ ముఖద్వారంలో ఉండే (సెర్వికల్) మ్యూకస్‌ను మందంగా అయ్యేలా చేస్తుంది. అంతేకాదు గర్భసంచి (యుటెరస్) లైనింగ్‌ను కూడా మందంగా మారుస్తుంది. తద్వారా వీర్యం... అండంతో కలవడాన్ని నిరోధిస్తుంది. ఒక్కోసారి అండం విడుదలను కూడా ఆపేస్తుంది. అయితే ఇవి వాడేవారిలోనూ ఒక్కోసారి అకస్మాత్తుగా గర్భం వచ్చే అవకాశం ఉంది. అయితే డాక్టర్ల సూచన మేరకు, వారు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ వాడినవారిలో ప్రతి 1000 మందికి కేవలం ముగ్గురికి మాత్రమే ఇలాంటి ప్రమాదం ఉంది. ఇందులోనూ కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. ఇందులో ఈస్ట్రోజెన్ ఉండదు కాబట్టి ఆ మేరకు ఆ హార్మోన్ వల్ల కలిగే దుష్ర్పభావాలనుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. కొత్తగా తల్లి అయిన వారు మళ్లీ వెంటనే గర్భధారణ కలగకుండా ఉండటానికి ఈ ‘ప్రోజెస్టిన్-ఓన్లీ’ పిల్స్ వాడవచ్చు. కంబైన్‌డ్ ఓరల్ పిల్స్ లాగే ఇవి కూడా హెచ్‌ఐవీ లేదా సెక్స్ ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులనుంచి రక్షణ కల్పించలేవు. ఇవి వాడుతున్న కొందరిలో త్వరత్వరగా పీరియడ్స్ వచ్చే అవకాశాలున్నాయి.
సర్వైకల్ క్యాప్ : దీన్ని మృదువైన రబ్బర్ వంటి పదార్థం (లాటెక్స్)తో తయారు చేస్తారు. ఎవరైనా డాక్టర్ గాని లేదా నైపుణ్యం ఉన్న నర్స్ గాని దీన్ని సరిగ్గా గర్భాశయ ముఖద్వారం వద్ద సరిగ్గా అమరేలా ఫిక్స్ చేస్తారు. ఈ క్యాప్‌పైన వీర్యాన్ని నాశనం చేసే పదార్థం (స్పెర్మిసైడ్) రాసి ఉంటుంది. ఇది సరిగ్గా గర్భసంచిలోకి వీర్యం వెళ్లని విధంగా గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వద్ద ఫిక్స్ చేసి ఉండటంతో పాటు, దానిపై వీర్యనాశని ఉంటుంది కాబట్టి వీర్యాన్ని అండంతో కలవకుండా నిరోధిస్తుంది. కానీ ఇది వాడే వారిలో పదహారు శాతం మందిలో గర్భధారణ జరిగే అవకాశాలున్నాయి. అయితే దీన్ని సరిగ్గా అమర్చుకోవడం తెలిసి, సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఈ ప్రమాదాన్ని తొమ్మిది శాతానికి తగ్గించవచ్చు. దీన్ని సెక్స్‌లో పాల్గొనడానికి ఒక గంట ముందుగా అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇది 48 గంటల పాటు గర్భధారణ నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే ఇది హెచ్‌ఐవీ లేదా సెక్స్ ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులనుంచి రక్షణ కల్పించలేదు. కాబట్టి ఆ రక్షణ కూడా పొందాలంటే సర్వైకల్ క్యాప్‌తో పాటు పురుషుడు కండోమ్ ధరించడం మేలు. ఇక దీనిలో ప్రతికూల అంశాలేమిటంటే... దీన్ని అమర్చడానికి నిపుణుల సహాయం (క్లినికల్ అసిస్టెన్స్) కావాలి. ఒక్కోసారి సెక్స్‌కు ఇది అడ్డంకిగా కూడా పరిణమించవచ్చు. ఒక్కోసారి గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్)లో దీనివల్ల మంట (ఇన్‌ఫ్లమేషన్) కూడా వచ్చే అవకాశాలున్నాయి. కొందరిలో ఇది అలర్జీ కలిగించవచ్చు.
వెజినల్ కాంట్రసెప్టివ్ ఫిల్మ్: ఇది రెండు అంగుళాల పొడవు, రెండంగుళాల వెడల్పు ఉండే పలుచటి ఫిల్మ్‌లాంటి పొర. దీనిపై నోనోగ్జైనాల్-9 అనే వీర్యకణాలను సంహరించే పదార్థం ఉంటుంది. దీన్ని మహిళల్లో గర్భాశయ ముఖద్వారం వద్ద అమర్చుతారు. అక్కడ ఉంచిన కొద్ది క్షణాల్లోనే ఇది కరిగిపోతుంది. అయితే ఈ మార్గాన్ని అనుసరించే వారిలో 29 శాతం మందిలో మొదటి ఏడాది 29 శాతం మందిలో గర్భధారణ జరిగిన దాఖలాలున్నాయి. దీన్ని చాలా సులభయంగా వాడుకోవచ్చు. ఇది మందుల షాపుల్లో తేలిగ్గా దొరుకుతుంది. సెక్స్ ద్వారా సంక్రమించే కొన్ని రకాల వ్యాధులనూ నివారిస్తుంది. అయితే హెచ్‌ఐవీనుంచి లేదా మరికొన్ని వైరస్‌లను గాని ఇది నిరోధించలేదు. ఇక నోనోగ్జైనాల్-9 అనే పదార్థాన్ని రాసి ఉన్న ఫిల్మ్‌ను వాడే కొందరిలో ఇది లోపల మంటగా ఉండే అవకాశాలూ ఉన్నాయి. దీన్ని సెక్స్‌లో పాల్గొనబోయే గంట ముందు ఉపయోగించాలి. సెక్స్‌లో పాల్గొనే ప్రతిసారీ కొత్త ఫిల్మ్‌ను వాడాలి. దీన్ని లోపల ఉంచుకున్న ప్రతిసారీ మహిళ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
కాంట్రసెప్టివ్ ఫోమ్: అక్షరాలా చెప్పాలంటే ఇది ‘గర్భనిరోధక నురగ’. ఈ నురగ వంటి పదార్థాన్ని మహిళ తన యోనిమార్గం ద్వారా లోపలికి ప్రవేశపెట్టుకుంటుంది. ఈ నురగ... వీర్యకణాలను అండంతో కలవకుండా నిరోధించడం మాత్రమే కాకుండా, వీర్యకణాలను చంపేస్తుంది. అయితే ఒకసారి ప్రవేశపెట్టుకున్న నురగ ఒకసారి సెక్స్‌లో మాత్రమే గర్భధారణ నుంచి రక్షణ కల్పిస్తుంది. మరోసారి సెక్స్‌లో పాల్గొనేవారు మరోమారు ఫ్రెష్‌గా నురగను వాడటం మంచిది. దీన్ని సెక్స్‌కు 20 నిమిషాల ముందు వాడితే చాలు. ఇది చాలా ప్రభావపూర్వకమైనది, సురక్షితమైనది. దీన్ని వాడటం వల్ల సెక్స్ హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడదు. అయితే ఇది హెచ్‌ఐవీ లేదా సెక్స్‌ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులనుంచి రక్షణ కల్పించలేదు. కొంతమందిలో ఈ నురగ మంటను కలిగించవచ్చు. లోపల ఏదో అవాంఛితమైన పదార్థం ఉన్న ఫీలింగ్‌తో అసౌకర్యం కూడా కలిగించవచ్చు. పైగా ఈ నురగ ఉన్న కంటెయినర్ కాస్త పెద్దదిగా ఉండి తీసుకెళ్లడంలో కాస్త ఇబ్బంది(ఎంబరాస్‌మెంట్)ని, అసౌకర్యాన్ని కలిగించచ్చు.
కాంట్రసెప్టివ్ స్పాంజ్ : ఈ స్పాంజ్ కూడా మహిళలు ఉపయోగించే గర్భనిరోధక సాధనం. దీన్ని గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) దగ్గర అమర్చాలి. ఇది వీర్యకణాలకు అడ్డుకట్టగా నిలిచి గర్భం రాకుండా కాపాడుతుంది. ఇది అడ్డుకట్టగా నిలిచే సాధనం (వెజినల్ బ్యారియర్ మెథడ్) కాబట్టి కొద్దిమేర గనేరియా, క్లమీడియా, ట్రైకోమోనియాసిస్ వంటి వ్యాధులనుంచి కాపాడుతుంది. ఈ కాంట్రసెప్టివ్ అంత ఖరీదైనది కాదు. పైగా సెక్స్‌లో పాల్గొనడానికి ముందే తమ పురుష పార్ట్‌నర్‌కు తెలియకుండానే లోపల పెట్టుకోవచ్చు.
కాంట్రసెప్టివ్ సపోజిటరీస్: ఇది కూడా అడ్డుకట్ట వేసే పద్ధతే (బ్యారియర్ మెథడ్). సపోజిటరీ అనేది యోని మార్గంలో ఉంచుకునే మాత్ర వంటిది అనుకోవచ్చు. ఈ పదార్థాలను సెక్స్‌కు ముందుగా మహిళ తమ యోనిమార్గంలో ప్రవేశపెట్టుకున్న కాసేపటికే ఇవి లోపల కరిగిపోతాయి. అయితే ఈ సపోజిటరీస్‌లో వీర్యకణాలను చంపేసే పదార్థాలు (స్పెర్మిసైడ్) ఉంటాయి. దాంతో వీర్యం లోపల ప్రవేశించగానే గర్భాశయవ ుుఖద్వారం (సర్విక్స్) దాటే లోపే ఆ వీర్యకణాలన్నీ చనిపోతాయి. అయితే సపోజిటరీస్ ద్వారా సెక్స్ ద్వారా సంక్రమించే హెచ్‌ఐవీ లేదా ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందడం సాధ్యం కాదు. పైగా ఒకే రోజు మాటిమాటికీ ఈ ప్రక్రియను అనుసరించడం కూడా మంచిది కాదు. ఎందుకంటే వీర్యకణాలను సంహరించే నోనోగ్జైనాల్-9 వంటి స్పెర్మిసైడ్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల హెచ్‌ఐవీ లేదా సెక్స్ ద్వారా సంక్రమించే ఇతర వ్యాధుల వ్యాప్తికి అవకాశాలు పెరుగుతాయి. అందుకే మహిళలు ఈ మార్గాన్ని ఉపయోగించినప్పుడు, పురుషులూ సమాంతరంగా కండోమ్ వాడటం మంచిది.
ఇవే గాక మహిళలు తమ గర్భాశయ ముఖద్వారం వద్ద ఉపయోగించడానికి వీలుగా డయాఫ్రమ్, ఫీమేల్ కండోమ్ (మహిళలు ఉపయోగించే వాటిని గతంలో రియాలిటీ కండోమ్స్ అని కూడా అనేవారు), షాట్ అని పిలుచుకునే ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాల్సిన డెపో-ప్రొవేరా అనే ప్రోజెస్టరాన్‌లాంటి హార్మోన్ (ఇది మహిళల్లో అండం విడుదల కాకుండా ఆపుతుంది), ప్యాచ్, నువా రింగ్, తేలికపాటి సిలికాన్ కప్‌లా రూపొందించిన షీల్డ్ వంటి ఇతర మార్గాలున్నాయి. ఇక్కడ పేర్కొన్న ఈ గర్భనిరోధక సాధనాలన్నీ అవగాహన కోసమే. వాటిని ఉపయోగించాలని భావించే వారు తప్పనిసరిగా డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. అప్పుడే వాటి ఉపయోగాలు, ప్రతికూలతలు తెలిసి, పూర్తి ప్రయోజనం పొందడానికి ఆస్కారం ఉంటుంది.
-నిర్వహణ: యాసీన్
కాంట్రసెప్టివ్ ఇంప్లాంట్స్ : ఇవి మహిళల శరీరంలో స్థానికంగా అనస్థీషియా (మత్తు) ఇచ్చి అమర్చే ఉపకరణాలు. వీటి నుంచి కొద్ది కొద్ది మోతాదుల్లో ప్రోజెస్టిరాన్ వంటి హార్మోన్లు విడుదలవుతూ మహిళల్లో గర్భధారణను నిలిపివేస్తుంటాయి. (ఇదే హార్మోన్ ప్రతి రుతుస్రావం తర్వాత రెండు వారాలకు విడుదలవుతుంది). అయితే ఇది అమర్చిన ప్రతి 1,000 మందిలోనూ ఐదుగురికి అకస్మాత్తుగా గర్భధారణ జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని అమర్చడానికి డాక్టర్ల సహాయం (క్లినికల్ అసిస్టెన్స్) అవసరం. ఇది అమర్చాక కనీసం మూడేళ్ల పాటు ఇది గర్భం రాకుండా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిసారీ సెక్స్‌లో పాల్గొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అగత్యం తప్పిపోయి, సురక్షితంగా, నిర్భయంగా సెక్స్‌లో పాల్గొనడానికి వీలవుతుంది. అయితే వీటి వల్ల హెచ్‌ఐవీ లేదా సెక్స్ ద్వారా సంక్రమించే ఇతరత్రా వ్యాధలనుంచి రక్షణ పొందడం వీలు కాదు. ఇవి అమర్చుకున్న కొందరు మహిళల్లో రుతుక్రమం క్రమబద్ధంగా రాకుండా పోవచ్చు. కొందరిలో లావెక్కడం, జుట్టు రాలడం, తలనొప్పి రావడం వంటి దుష్ర్పభావాలు కూడా కనిపించవచ్చు.
డాక్టర్ ప్రశాంతి రాజు
సీనియర్ ఫిజీషియన్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్