గుర్రప్ప నాడార్ కథ | Humor plus | Sakshi
Sakshi News home page

గుర్రప్ప నాడార్ కథ

Published Thu, Aug 6 2015 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

గుర్రప్ప నాడార్ కథ

గుర్రప్ప నాడార్ కథ

హ్యూమర్ ఫ్లస్
 
ఆజానుబాహుబలి కూరగాయల మార్కెట్‌కి వచ్చాడు. వర్షమొచ్చింది. కీలకమైన సమయాల్లో వానరావడం సినిమాల్లోనే కాదు, జీవితంలో కూడా సంభవమే. ఉన్నట్టుండి సర్రున ఎవరో జారుతున్న శబ్దం వినిపించించింది. ఉలిక్కిపడి చూశాడు.
 ఎదురుగా ఒక వ్యక్తి మోకాళ్లపై జోరుగా జారుతూ అతివేగంగా వచ్చి బ్రేకు వేశాడు.

‘తొక్కమీద కాలేశారా?’’ అడిగాడు బలి.
‘‘ఇలా జారడం మా ఆచారం బాహుబలి’’
‘‘నా పేరు నీకెలా తెలుసు?’’
‘‘నాకింకా చాలా తెలుసు. నా పేరు గుర్రప్ప నాడార్. నాడా దొరికితే గుర్రాలను వెతికే వ్యక్తిని నేను. అందుకే ఆ పేరు’’
 ‘‘ఈ మెరుపులు మనకు ఫ్లాష్ కొడుతున్నాయి కానీ, నువ్వు ఫ్లాష్ లేకుండా బ్యాక్‌స్టోరీ చెప్పు’’ అన్నాడు బలి.

 ‘‘నేను చెప్పే కథ మీ చిన్నతాత ముక్కల దేవుడి దగ్గర మొదలవుతుంది. ఆయన చదవడు, రాయడు కానీ పేకాటరాయుడు. ముక్కలు పట్టుకుని పట్టుకుని ఒక చెయ్యి పనికి రాకుండా పోయింది. ఆయన దగ్గర ఎవరూ గెలవలేరు. ఒకవేళ గెలిచినా ఆయన ఓడిపోవడానికి ఒప్పుకోడు. గెలిచిన వాళ్లని చావగొడతాడు. అందువల్ల ఎవరూ గెలవకుండా జాగ్రత్తపడేవాళ్లు. దాంతో ఆయన పే అంటే పేకముక్కలు పడేవి. ఈ విషయం నాకు తెలియక ఆయనతో పేకాటకి సవాల్ చేశాను. అప్పుడు నేను, ఎక్కిన ప్రతి గుర్రం పారుతుందనే ఆవేశంలో ఉండేవాణ్ణి. ఎత్తిన ప్రతిముక్కా జోకరేననే అజ్ఞానంలో ఉండేవాణ్ణి. గ్రహచారం బాలేక ముక్కల దేవుడితో మూడుముక్కలాటకి కూచున్నాను. నేను గెలిస్తే ఆరుతరాలు, ఆయన గెలిస్తే మూడుతరాలు బానిసగా నేనే ఉండాలని షరతుతో ఆట మొదలైంది. కన్‌ఫ్యూజన్‌లో ఒప్పుకున్నాను. మూడుతరాల బానిసత్వం, పాత పేకముక్కలు మిగిలాయి నాకు’’ అంటూ గుర్రప్ప ఒక్క క్షణం ఆగి బాహుబలి పాదాన్ని తన నెత్తిన ఉంచమన్నాడు.

 ‘‘నెత్తి మీద చేతులు పెట్టడం తెలుసు కానీ, కాలు పెట్టడం వినలేదే’’ అనుమానంగా అడిగాడు బాహుబలి.
 ‘‘వేదం కంటే వాదమే గొప్పదని మా ఆచారం’’
 ‘‘మై ఫుట్. ఆచారాలు మానేసి కథ చెప్పు’’
 ‘‘ఇలా ఉండగా మీ తాత పోగా, కొన్ని నెలలకు మీ నాన్నని కని మీ నాయనమ్మ వెళ్లిపోయింది. మీ చిన్న నాయనమ్మ హరహర మహాదేవ సాంబశివగామి...’’
 ‘‘ఇంత పెద్దపేరు అవసరమా?’’

 ‘‘ఆ పేరంటే ఆమెకి చాలా ఇష్టం. నోరు తిరగని వాళ్లని కొరడాలతో కొట్టించేది’. ప్రశ్న వేయకుండా కథ వినండి. ఆమె మీ నాన్నని, చిన్నాన్న డైమండ్ బళ్లాలుణ్ణి పెంచింది. పెరిగి పెద్దవాళ్లయి వాళ్ళు కూడా పేకాటలో నిష్ణాతులయ్యారు. మీ నాన్న కళ్ళు మూసుకుని కూడా ఆడగలిగితే, మీ చిన్నాన్న కళ్ళు తెరుచుకుని అందరి ముక్కలు చూడ్డంలో రి‘కార్డు’ సాధించాడు. ఇలా ఉండగా మీ దగ్గర నమ్మకంగా ఉన్న ఆఠీన్ జాకీ అనే అనుచరుడు మీ శత్రువైన కళావర్ కేయుడు అనేవాడికి పేకాట రహస్యాలు చేరవేశాడు. దాంతో వాడు మందీమార్బలంతో ‘పేకోబలి’ అని అరుస్తూ వచ్చాడు.

 ‘‘మీ నాన్న, చిన్నాన్న ఆటకి దిగారు.
 ‘‘డైమండ్ జాకీ, కళావర్ ఆసు, ఆఠీన్ కింగ్, ఇస్పేట్ రాణి’’ అని శత్రువు అరిస్తే అది వాడి భాషనుకుని పొరబడ్డాం. ఇస్పేట్ రాణి అని తననే అంటున్నాడని అనుమానించిన మీ చిన్న నాయనమ్మ హర హర మహా..’’
 ‘‘వద్దులే నాయనమ్మ అను చాలు’’

 ‘‘మీ నాయనమ్మ పేకోద్రేకంతో కళావర్‌కేయుడి మొలతాడుతో సహా ఎవరు గెలిస్తే వాడికే ‘ఆసు’ష్మతి రాజ్యమని ప్రకటించింది. ఈ కళావర్‌కేయుడి బలహీనత ఏమంటే వాడికి రాణుల పిచ్చి. క్వీన్ ముక్క కనబడితే బోన్స్ విరిగినా లెక్కచేయడు. ఇది గ్రహించి మీ నాన్న వాడికి పనికిరాని ప్లెయిన్ ముక్కలు వేసి సులభంగా ఓడించాడు. చివరికి మొలతాడు, పంచె మిగిలాయి. పంచె గెలుచుకున్నా ప్రమాదమే. మొలతాడు గెలుచుకున్నా ప్రమాదమే. మొలతాడు లేకపోతే పంచె ఎలాగూ ఊడిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి ప్రజలు పారిపోవడానికి ప్రయత్నించడం వల్ల తొక్కిసలాట జర గొచ్చు. ప్రజాసంక్షేమం దృష్ట్యా మీ నాన్న ఆలోచనలో పడగా మూర్ఖుడైన మీ చిన్నాన్న షో చూపించి మొలతాడు లాగేశాడు. ఊహించినట్టే ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. గెలిచిన మీ చిన్నాన్నను కాకుండా, ప్రజల గురించి ఆలోచించిన మీ నాన్ననే వారసుడిగా ప్రకటించింది నాయనమ్మ’’.

 ‘‘అయితే కింగ్ ఆఫ్ ది కార్డ్స్‌గా వున్న మా నాన్న అమరేంద్ర నరబలిగా ఎలా మారాడు? వంటవాడు ఎలా అయ్యాడు?’’
 ‘‘అది వేరే ఫ్లాష్‌బ్యాక్’’ ఇంతలో ‘‘గుర్రప్పా’’ అని పిడుగులాంటి కేక వినిపించింది. స్లో మోషన్‌లో చూస్తే హరహర మహాదేవ సాంబశివగామి.

 మోకాళ్లపై ఒక రౌండ్ స్కేటింగ్ చేద్దామనుకున్నాడు కానీ చిప్పలు టకటకలాడేసరికి తమాయించుకున్నాడు. ‘‘మొత్తం ఫ్లాష్‌బ్యాక్ చెప్పే అర్హత నీకు లేదు, నువ్వు బానిసవి’’
 ‘‘మహాప్రసాదం తల్లీ. మరోసారి పాదం ఇస్తే ఆనెలు అవి ఉన్నాయేమో చెక్ చేసి ఇస్తా’’
 అతని మాటలు వినిపించుకోకుండా సాంబశివగామి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లింది.
 (ఆ వివరాలు వచ్చే సంవత్సరం)    
 - జి ఆర్ మహర్షి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement