ఆకలి తీర్చడమే ఆనందం! | Hunger, pleasure to meet! | Sakshi
Sakshi News home page

ఆకలి తీర్చడమే ఆనందం!

Published Sun, Apr 13 2014 10:14 PM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

ఆకలి తీర్చడమే ఆనందం!

ఆకలి తీర్చడమే ఆనందం!

ఆకలి విలువ తెలిసినవాడికి అన్నం విలువ తెలుస్తుంది. ఆకలి, అన్నం... ఈ రెండిటి విలువ తెలిసినవాడికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాల్సిన అవసరమేంటో తెలుస్తుంది. టోనీ టేకి అవన్నీ తెలుసు కాబట్టే రోజుకి మూడు వేల మందికి అన్నం పెడుతున్నాడు. అన్నార్తుల ఆకలి మంటలను చల్లారుస్తున్నాడు!
 
అది 2003వ సంవత్సరం. ఓ శ్మశాన వాటికలో ఒక మహిళకు అంత్యక్రియలు జరుగు తున్నాయి. అందరూ విషణ్ణ వదనాలతో నిలబడి ఉన్నారు. మరణించిన స్త్రీ ఆత్మ శాంతించాలని అందరూ మనసుల్లోనే ప్రార్థిస్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం అలాంటివేమీ చేయడం లేదు. అక్కడ ఉన్నవారందరి వైపూ తదేకంగా చూస్తున్నాడు. ఆ మరణించిన స్త్రీ కొడుకే అతను. అతడి ముఖంలో దిగులు కంటే ఆశ్చర్యం ఎక్కువగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న వ్యక్తి అది గమనించాడు.
 
‘‘ఏంటి అలా చూస్తున్నావ్’’ అన్నాడు.
 ‘‘వీళ్లెవరినీ నేనెప్పుడూ చూడలేదు. వీళ్లలో మా బంధువులు కానీ, స్నేహితులు కానీ లేరు. కానీ అమ్మ అంత్యక్రియలకు ఎందుకొచ్చారో అర్థం కావడం లేదు. మీతో సహా’’ అన్నాడతను.
 ‘‘ఓ అదా... మేం మీ బంధువులం, స్నేహితులం కాదు. మీ అమ్మగారి వల్ల సహాయం పొందినవాళ్లం. మాలో చాలామంది ఆమె చేతిముద్ద తిన్నాం. ఆ కృతజ్ఞతతోనే వచ్చాం.’’

అతడి మాట వినగానే మరింత ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. తన తల్లి ఇంతమందికి సాయం చేసిందా! ఆమె ఎంతో మంచిదని తెలుసు. ఇంటికెవరొచ్చినా కడుపు నిండా భోజనం పెట్టేది. ఏదైనా మిగిలితే పడేయకుండా లేనివాళ్లకి పంచిపెట్టి వచ్చేది. ఏదో అలా చేస్తోంది అనుకున్నాంగానీ ఆమె ఇంత మందికి సాయం చేసిందా అని విస్మయం చెందాడు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు... తన తల్లి మంచితనానికి తాను ప్రతినిధి కావాలని. ఆ నిర్ణయానికి ఫలితమే... విల్లింగ్ హార్‌‌ట్స. దాన్ని స్థాపించిన ఆ వ్యక్తి పేరు... టోనీ టే.
 
ఆలోచన ఉద్యమమయ్యింది...
 
టోనీ కుటుంబం సిరిగలదేమీ కాదు. కడుపు నింపుకోవడం కోసం కష్టపడి పని చేసుకున్నవాళ్లే. అందుకే అతడికి ఆకలి విలువ, అన్నం విలువ తెలుసు. దానికితోడు పోతూ పోతూ తల్లి నేర్పిన పాఠం అతడి ఆలోచనల్ని చాలా ప్రభావితం చేసింది. నాటి నుంచీ తనకున్నదాన్ని మరికొందరికి పంచడమే జీవితలక్ష్యంగా ఏర్పరచు కున్నాడు టోనీ. కానీ ఆ చిన్న చిన్న సాయాలు అతడికి తృప్తినివ్వలేదు. ఇంకా ఏదో చేయాలి. ఏం చేయాలా అని ఆలోచించాడు. అన్నం పెట్టడాన్ని ఓ పనిగా కాకుండా ఉద్యమంగా మలచాలని అనుకున్నాడు. ‘విల్లింగ్ హార్‌‌ట్స’ అనే సేవాసంస్థను స్థాపించాడు. ఆకలితో ఉన్నవారికి ఓ ముద్దపెట్టి కడుపు నింపుదాం రమ్మంటూ అందరినీ ఆహ్వానించాడు. మొదట ఎవ్వరూ అంతగా పట్టించు కోలేదు. కానీ టోనీ నిరుత్సాహపడలేదు. తన పని తాను చేసుకుపోయాడు.
     
రోజూ సాయంత్రం మార్కెట్ యార్డులకు వెళ్లి, మిగిలిన కూరగాయలు తెచ్చుకునేవాడు. బేకరీలు, రెస్టారెంట్లకు వెళ్లి, మిగిలిపోయిన పిండి, నెయ్యి, డాల్డా, మాంసం ఏదైనా నాకు ఇచ్చేయండి అని అభ్యర్థించేవాడు. వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని, ఉదయమే లేచి వంట మొదలెట్టేవాడు. పూర్తవగానే వండిన ఆహారాన్ని కొద్ది కొద్దిగా ప్యాక్ చేసుకుని బయలుదేరేవాడు. ఎక్కడ ఎవరు ఆకలితో ఉన్నారని తెలిసినా అక్కడికెళ్లి వాటిని పంచేవాడు. కొన్నాళ్లకు అతడి సేవ గురించి అంద రికీ తెలిసింది. ఒక్కొక్కరుగా వచ్చి అతడితో చేరారు.
 
ప్రస్తుతం విల్లింగ్ హార్‌‌ట్సలో 200 మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్లలో రిటైరైనవాళ్లు, గృహిణులు, విద్యార్థులు... ఇలా చాలామంది ఉన్నారు. కూరగాయలు సేకరించడం దగ్గర్నుంచి పాత్రల్ని కడగడం వరకూ అందరూ అన్ని పనుల్నీ పంచుకుంటారు. అందరూ తప్పకుండా రావాలన్న నియమం ఉండదు. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లు వస్తారు. పనుల్లో పాలుపంచుకుంటారు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే అందరికీ మెసేజిలిస్తాడు టోనీ. ఎవరికి వీలైతే వాళ్లు వచ్చి పని చేస్తారు. అది కూడా ఎంతో ఇష్టంగా చేస్తారు.
 
అయితే ఇప్పుడు ఆహారాన్ని తీసుకెళ్లి పంచడం లేదు టోనీ. సింగపూర్ మొత్తంలో 23 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశాడు. ఆకలిగొన్న వారంతా అక్కడికొచ్చి తినవచ్చని అందరికీ తెలిసేలా చేశాడు. ఉదయాన్నే వండిన ఆహారమంతా ఈ సెంటర్లకు తీసుకెళ్లిపోతారు. ఎవరు వచ్చినా ఉచితంగా భోజనం పెట్టి పంపిస్తారు. అలా రోజుకి మూడు వేల మంది కడుపుల్ని నింపు తున్నారు. ‘‘ఆకలి తీరిన తరువాత వారి కళ్లలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. దానికోసం ఎంత కష్టపడినా ఫర్వాలేదనిపిస్తుంది’’ అంటాడు టోనీ. మంచితనానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది!
 
- సమీర నేలపూడి
 
విశ్రమించడు... విసుగు చెందడు!

అనుకున్నది సాధించడానికి పెద్ద కసరత్తే చేశాడు టోనీ టే. రెండు వందల మంది వాలంటీర్లను ఒక్కచోట చేర్చడమంటే మాటలు కాదు కదా! అయితే అంతమంది ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్నా, అందరూ అన్నీ అయ్యి చేస్తున్నా... ఇప్పటికీ తనవంతు పని తాను చేస్తూనే ఉంటాడు టోనీ. ఉదయం నాలుగింటికి లేచి పని మొదలు పెడతాడు. స్వయంగా కొన్ని వంటకాలు వండుతాడు. అన్ని పనులూ దగ్గరుండి పర్యవేక్షించు కుంటాడు. ఎప్పుడో అర్ధరాత్రి పడక మీదికి చేరతాడు. ఎంత కష్ట పడుతున్నా పెదవుల మీద చిరునవ్వు చెరగ నివ్వక పోవడమే అతడి ప్రత్యేకత!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement