ఆ విలువ ఇప్పుడు తెలుసుకున్నా! | i kinow the value of relations | Sakshi
Sakshi News home page

ఆ విలువ ఇప్పుడు తెలుసుకున్నా!

Published Tue, Sep 23 2014 11:29 PM | Last Updated on Mon, Oct 22 2018 8:20 PM

ఆ విలువ ఇప్పుడు తెలుసుకున్నా! - Sakshi

ఆ విలువ ఇప్పుడు తెలుసుకున్నా!

గొప్పవాళ్లు అంటే డబ్బున్నవాళ్లు కాదు, మంచి మనసున్నవాళ్లు అన్న నిజాన్ని నాకెవ్వరూ చెప్పలేదు. అది తెలిసేనాటికి జరగరాని తప్పు జరిగిపోయింది.
 
మా ఇంట్లో ఒక ఆయా ఉండేది. నేను పుట్టకముందు నుంచీ తను మా ఇంట్లోనే ఉంది. నేను పుట్టాక నన్ను మాత్రమే చూసుకునే పనిని అప్పచెప్పారు తనకి. నాన్న బిజినెస్ టూర్లు, అమ్మ పార్టీలతో బిజీగా ఉంటే ఆవిడే నన్ను పెంచింది. నేను నిద్ర లేచేసరికి టూత్ బ్రష్‌తో రెడీగా ఉండేది. నేను బడి నుంచి వచ్చేసరికి ఫలహారం పళ్లెంతో సిద్ధంగా ఉండేది. నేను నిద్రపోదామనుకునేసరికి పాలగ్లాసుతో ప్రత్యక్షమైపోయేది. ఏదీ కావాలని అడగక్కర్లేదు. తనే అర్థం చేసేసుకునేది. కానీ నేనే తనని అర్థం చేసుకోలేకపోయాను. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు... తనకి టీబీ సోకింది.
 
ఆ విషయం తెలియగానే అమ్మానాన్నా తనని పని మానేసి వెళ్లిపొమ్మన్నారు. తను ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. పొమ్మన్నందుకు ఏడ్చిందనుకున్నాను కానీ కొన్నాళ్ల తర్వాత తను రాసిన ఉత్తరం చదివితే తెలిసింది... నన్ను వదిలి వెళ్లిపోలేక ఏడ్చిందని. కానీ అప్పుడిక చేసేదేమీ లేదు. ఎందుకంటే తను చనిపోయింది. కన్నుమూసే ముందు ఆ ఉత్తరం నాకు పోస్ట్ చేయమని మరీ మరీ చెప్పిందట. ఆ ఉత్తరం ఆసాంతం చదివాను.
 
మొదటిసారి... వెక్కివెక్కి ఏడ్చాను. ఓ ఆయా కోసం ఏడవటమేంటని అమ్మ చీవాట్లు వేసింది. నేను ఒకటే మాట అన్నాను... ‘‘నన్ను పెంచింది తనే కదా అమ్మా, తన కోసం ఏడవడంలో తప్పేముంది’’ అని. నా మాటకి అమ్మకి చిర్రెత్తుకొచ్చింది. పిచ్చి మాటలు మాట్లాడకు అని నాలుగు తిట్లు తిట్టి వెళ్లిపోయింది. కానీ నేను మాత్రం తట్టుకోలేకపోయాను. నిజంగా ఆయమ్మే నన్ను పెంచింది. నా చిన్నతనమంతా తన ఒడిలోనే గడిచింది. అలాంటి మనిషికి ఏదో జబ్బు చేస్తే... నిర్దాక్షిణ్యంగా గెంటేస్తుంటే... నేను కనీసం మాట్లాడలేదు. ఆమె మీద జాలి కూడా చూపించలేదు. తను ఏడుస్తోంది నా కోసమేనని కూడా నాకు అర్థం కాలేదు.
 
డబ్బు విలువ తప్ప బంధాల విలువ తెలియకుండా పెరిగాను కదా! అంతకంటే ఎలా ప్రవర్తిస్తాను! పాపం వైద్యానికి కూడా డబ్బులేక చాలా అవస్థ పడి చనిపోయిందని, చివరి వరకూ నన్నే తలచుకుందని తన కూతురి ద్వారా తెలిసింది. నేను అనుకుంటే నాన్నను అడిగి ఆయమ్మకి సాయం చేసి వుండవచ్చు. కానీ అలా చేయలేకపోయినందుకు నన్ను నేను క్షమించుకోలేకపోయాను. ప్రాయశ్చిత్తమైనా చేసుకోవాలి కదా! అందుకే అమ్మానాన్నలకు ఇష్టం లేకపోయినా సోషల్‌వర్క్ చదివాను. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆయమ్మ లాంటి పేదవాళ్లందరికీ ఉచిత వైద్యం చేయిస్తున్నాను.
     
ఇప్పుడు నేనందరికీ ఒకటే చెబుతున్నాను... ఎవరి విలువైనా వాళ్లు ఉన్నప్పుడే తెలుసుకోండి, తర్వాత తెలుసుకున్నా ఉపయోగం ఉండదు. అంతేకాదు... అనుబంధాలు, ఆప్యాయతల కంటే డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు. ఆ నిజాన్ని ఎప్పుడూ మర్చిపోకండి!

- అవంతిక, కాన్పూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement