ఐఈఎస్ / ఐఎస్‌ఎస్ | ies/iss | Sakshi
Sakshi News home page

ఐఈఎస్ / ఐఎస్‌ఎస్

Published Mon, Mar 2 2015 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

ఐఈఎస్ / ఐఎస్‌ఎస్

ఐఈఎస్ / ఐఎస్‌ఎస్

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్.. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌లో పీజీ, డిగ్రీ పూర్తి చేసి సర్కారీ కొలువు సొంతం చేసుకోవాలనుకునే వారికి సరైన మార్గం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షల్లో విజయం సాధిస్తే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని పలు విభాగాలు, గణాంక శాఖ, ప్రణాళిక విభాగం, గ్రామీణాభివృద్ధి విభాగం తదితర విభాగాల్లో జూనియర్ టైం స్కేల్‌తో అసిస్టెంట్ డెరైక్టర్‌గా కెరీర్ ప్రారంభించి సెక్రటరీ స్థాయికి చేరుకునే అవకాశం లభిస్తుంది.  యూపీఎస్సీ.. ఐఈఎస్/ఐఎస్‌ఎస్-2015 ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఎంపిక విధానం, విజయ వ్యూహాలు..
 
అర్థశాస్త్రం, స్టాటిస్టిక్స్ విద్యార్థులకు అద్భుత అవకాశం
ఐఈఎస్/ఐఎస్‌ఎస్.. సివిల్ సర్వీసుల మాదిరిగానే జాతీయస్థాయిలో ప్రాముఖ్యమున్న కేంద్ర సర్వీసులు. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక విభాగం తదితర విభాగాల్లో అకడమిక్‌గా సొంతం చేసుకున్న కోర్ నైపుణ్యాలను నేరుగా అన్వయించే అవకాశమున్న సర్వీసులు. అందుకే వీటికి ఎంపిక పరీక్ష కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకోసం యూపీఎస్సీ ప్రతి ఏటా ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ప్రకటన విడుదల చేసి, పరీక్ష నిర్వహిస్తోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
 
ఎంపిక ఇలా
ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ఎంపిక ప్రక్రియ రెండు దశలుగా ఉంటుంది. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ. రాత పరీక్షకు 1000 మార్కులు, ఇంటర్వ్యూకు 200 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష ఐఈఎస్, ఐఎస్‌ఎస్ అభ్యర్థులకు వేర్వేరుగా ఉంటుంది.
 
రాత పరీక్ష వివరాలు
ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ఔత్సాహికులు రాత పరీక్షలో భాగంగా ఆరు పేపర్లు రాయాలి. ఇందులో మొదటి రెండు పేపర్లు జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్ పేపర్లు రెండు సర్వీసులకు ఉమ్మడిగా ఉంటాయి. మిగతా నాలుగు పేపర్లు ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌కు సంబంధించిన సబ్జెక్ట్ పేపర్లు. ఐఈఎస్ అభ్యర్థులు ఎకనామిక్స్ పేపర్లు (పేపర్-1 నుంచి పేపర్-4), ఐఎస్‌ఎస్ అభ్యర్థులు స్టాటిస్టిక్స్ పేపర్లు (పేపర్-1 నుంచి పేపర్-4) రాయాలి.
 
పీజీ స్థాయిలో సిలబస్
పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే ఐఈఎస్/ఐఎస్‌ఎస్ సబ్జెక్ట్ పేపర్ల సిలబస్ పీజీ స్థాయిలో ఉంటుంది. స్టాటిస్టిక్స్‌కు కనీస అర్హతగా బ్యాచిలర్స్ డిగ్రీనే పేర్కొన్నప్పటికీ ఆ సబ్జెక్ట్ పేపర్ల సిలబస్ కూడా పీజీ స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా గణాంకాలను విశ్లేషించాల్సిన విధంగా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ నుంచే విభిన్న దృక్పథంతో వ్యూహాలు అమలు చేయాలి.
 
పరిశీలన, విశ్లేషణ నైపుణ్యాలు
ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ పేపర్లలో ముందంజలో నిలవాలంటే.. అభ్యర్థులు ప్రిపరేషన్ దశలోనే సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని పరిశీలనాత్మక దృక్పథంతో అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ఒక నిర్దిష్ట అంశాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించే నైపుణ్యాలు కూడా ఎంతో మేలు చేస్తాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే దాదాపు అన్ని ప్రశ్నలు కూడా ప్రాథమిక భావనల ఆధారంగా వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే నైపుణ్యం అవసరమైనవిగా ఉన్నాయని నిపుణుల అభిప్రాయం.
 
ఐఈఎస్ ప్రిపరేషన్ ఇలా..
 
ఎకనామిక్స్ పేపర్-1 (జనరల్ ఎకనామిక్స్)

పార్ట్-ఎ, పార్ట్-బిగా ఎకనామిక్స్ బేసిక్స్‌తో కూడిన ఈ పేపర్‌లో రాణించాలంటే సూక్ష్మ అర్థ శాస్త్రం, ఉత్పత్తి-పంపిణీ వంటి అంశాలపై దృష్టి సారించాలి. అదే విధంగా శ్యాంప్లింగ్ టెక్నిక్స్, కొరలేషన్, లీనియర్ ప్రోగ్రామింగ్‌లపై అవగాహన కూడా ఎంతో అవసరం.
 
ఎకనామిక్స్ పేపర్-2 (జనరల్ ఎకనామిక్స్-2)
ఈ పేపర్‌లో అధిక శాతం ప్రశ్నలు స్థూల అర్థ శాస్త్రం నుంచి అడుగుతారు. అంతర్జాతీయ అర్థ శాస్త్రం, వృద్ధి సిద్ధాంతాలు వంటి స్థూల అర్థ శాస్త్రంలోని మూల భావనలతోపాటు, వ్యాపార-వాణిజ్య రంగాల్లో అంతర్జాతీయ సంస్థలు (ఉదా: ఐఎంఎఫ్, డబ్ల్యుటీఓ తదితర) గురించిన అవగాహన లాభిస్తుంది.
 
ఎకనామిక్స్ పేపర్-3 (జనరల్ ఎకనామిక్స్-3)
ఈ పేపర్‌కు నిర్దేశించిన సిలబస్‌ను పరిశీలిస్తే వాస్తవ సమాజంలో సమ్మిళితమైన అర్థ శాస్త్ర అంశాలకు ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. అభ్యర్థులు పన్నుల సంస్కరణలు, పర్యావరణ అర్థ శాస్త్రం, క్రెడిట్ మేనేజ్‌మెంట్, వివిధ రకాల పెట్టుబడులు-విధానాలు, ధరల సిద్ధాంతాలపై దృష్టి పెట్టి ప్రిపరేషన్ సాగించాలి. వీటికి సంబంధించి సమకాలీనంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై పరిశీలన కూడా ఎంతో ముఖ్యం.
 
ఎకనామిక్స్ పేపర్-4 (ఇండియన్ ఎకనామిక్స్-4)
మొత్తం పేపర్లలో అభ్యర్థులకు కొంత సులువుగా పేర్కొనే పేపర్ ఇండియన్ ఎకనామిక్స్. ఇప్పటికే ఆయా పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులు, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ స్థాయిలో అకడమిక్‌గా పట్టున్న అభ్యర్థులు సులువుగా ఆకళింపు చేసుకోగలిగే పేపర్ ఇండియన్ ఎకనామిక్స్. ఆర్థిక రంగంలో సంస్కరణలు, ద్రవ్య విధానాలు, బ్యాంకింగ్ వ్యవస్థ, రిజర్వ్ బ్యాంక్ విధి విధానాలు, కోశ విధానాలపై అవగాహనతో ఈ పేపర్‌లో సులువుగా రాణించొచ్చు.
 
ఐఎస్‌ఎస్ ప్రిపరేషన్ ఇలా..
 
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఔత్సాహికులు నాలుగు సబ్జెక్ట్ పేపర్లు రాయాల్సి ఉంటుంది.
 
స్టాటిస్టిక్స్ పేపర్-1:
ఈ పేపర్ సిలబస్‌ను పరిశీలిస్తే సంభావ్యత(ప్రాబబిలిటీ)కి ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. ప్రాబబిలిటీలోని బేసిక్ కాన్సెప్ట్స్ /సిద్ధాంతాలపై దృష్టి సారించాలి. అదే విధంగా ఒక డేటాకు సంబంధించిన విశ్లేషణ నైపుణ్యాలను పరిశీలించే స్టాటిస్టికల్ మెథడ్స్ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్, ప్రైమరీ అండ్ సెకండరీ డేటా చార్ట్స్ రూపకల్పన వంటి అంశాలపై పట్టు సాధించాలి.
 
స్టాటిస్టిక్స్ పేపర్-2:
స్టాటిస్టిక్స్‌కు సంబంధించి సిద్ధాంతాలతో కూడిన అంశాలను సిలబస్‌గా పేర్కొన్న ఈ పేపర్‌లో రాణించాలంటే అభ్యర్థులు మల్టీ వెరయిటీ అనాలిసిస్, హైపోథీసిస్ టెస్టింగ్, లీనియర్ మోడల్స్, ఎస్టిమేషన్ టెక్నిక్స్‌పై దృష్టి సారించాలి.
 
స్టాటిస్టిక్స్ పేపర్-3:
ఆయా డేటాల సేకరణ, సర్వేలు-గణాంకాలతో కూడిన అంశాలు సిలబస్‌గా పేర్కొన్న ఈ పేపర్‌లో మంచి మార్కులు పొందాలంటే ముందుగా స్టాటిస్టిక్స్‌లో ముఖ్యమైందిగా భావించే శ్యాంప్లింగ్ టెక్నిక్స్‌లో చక్కటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. అదేవిధంగా అర్థశాస్త్రంతో సమ్మిళితంగా ఉండే గణాంకాలు (ఉదా: ప్రైస్ ఇండెక్స్) గురించిన నైపుణ్యం కూడా ఎంతో అవసరం.
 
స్టాటిస్టిక్స్ పేపర్-4:
స్టాటిస్టిక్స్‌లో రీసెర్చ్ అంశాలు, డేటాకు సంబంధించి కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధిత అంశాలు సిలబస్‌గా ఉన్న ఈ పేపర్‌లో విజయానికి స్టాటిస్టిక్స్‌లో కీలకంగా భావించే పలు చార్ట్‌లు, కర్వ్‌లు, టేబుల్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా నిర్దిష్ట డేటాను సాఫ్ట్‌వేర్‌తో అన్వయించగలిగే నైపుణ్యాలు అందుకు అవసరమైన నిర్వహణ సిద్ధాంతాలపై అవగాహన కూడా ఎంతో ముఖ్యం.
 
ఉమ్మడి సబ్జెక్ట్‌లకు ఇలా
ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ఎగ్జామినేషన్‌లో ఉమ్మడి సబ్జెక్ట్‌లు/పేపర్లు.. జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్.

జనరల్ ఇంగ్లిష్
ఎస్సే రైటింగ్, ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉండే ఇంగ్లిష్ పేపర్‌లో మంచి మార్కుల కోసం వొకాబ్యులరీని పెంచుకోవాలి. అదేవిధంగా ప్రెసిస్ రైటింగ్ అంశం కూడా ఉన్న నేపథ్యంలో రీడింగ్ కాంప్రహెన్షన్ మెరుగుపరుచుకునేందుకు కృషి చేయాలి.
 
జనరల్ స్టడీస్
కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్‌కు ఎక్కువ వెయిటేజీ ఉండే ఈ పేపర్‌లో రాణించాలంటే.. ఇటీవల కాలంలో ప్రముఖ సంఘటనలు, పరిణామాలు - వాటి నేపథ్యాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీలోనూ కోర్ అంశాలతోపాటు వాటికి సంబంధించి తాజాగా చోటు చేసుకున్న అంశాలపై పట్టు సాధించాలి.
 
రిఫరెన్స్ బుక్స్
 
 ఐఈఎస్
 ఇండియన్ ఎకానమీ                            - మిశ్రా అండ్ పూరీ
 హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్               - యూఎన్‌డీపీ
 వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్                    - ఐబీఆర్‌డీ
 ఇండియన్ ఎకానమీ                          - ఉమా కపిల
 పబ్లిక్ ఫైనాన్స్                                 - భాటియా
 ఎకనమిక్  ఎన్విరాన్‌మెంట్ ఆఫ్ బిజినెస్
                                                  - ఎం.ఎల్. జింగాన్,
 ఇంటర్నేషనల్ ఎకనామిక్స్                  - చేరునిలమ్
 గ్రోత్, సస్టెయినబిలిటీ అండ్ ఇండియాస్
    ఎకనమిక్ రిఫామ్స్                       - టి.ఎన్.శ్రీనివాసన్
 మ్యాథమెటికల్ అనాలిసిస్ ఫర్ ఎకనామిక్స్
                                                 - ఆర్.జి.డి. అలెన్, మ్యాక్‌మిలాన్
 స్టాటిస్టిక్స్ ఫర్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్
                                                 - అండర్సన్ అండ్ షెన్నీ
 స్టాటిస్టిక్స్ ఫర్ మ్యాథమెటిక్స్              - డి.ఆర్. అగర్వాల్
 
 
 ఐఎస్‌ఎస్
 యాన్ ఇంట్రడక్షన్ టు ప్రాబబిలిటీ     
  థియరీ అండ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్
                                                            - వి.కె.రోహ్‌తగి
 ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్     - ఎస్‌సి గుప్తా
 ఫండమెంటల్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (వాల్యూమ్-2)     - ఎఎం గూన్, ఎంకె     
                                                            గుప్తా, బి దాస్ గుప్తా
 ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టికల్ అప్లికేషన్స్
                                                          - పాల్ మేయర్
 శాంప్లింగ్ టెక్నిక్స్                                     - విలియమ్ జి.కొచ్రాన్
 శాంప్లింగ్ థియరీ ఆఫ్ సర్వేస్ విత్ అప్లికేషన్స్     - బి.వి.సుఖత్మే
 ఫండమెంటల్స్ ఆఫ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్
                                                          - ఎస్.సి. గుప్తా
 
 
 ఐఈఎస్/ఐఎస్‌ఎస్ పరీక్ష వివరాలు
 
 ఐఈఎస్        సబ్జెక్ట్                      మార్కులు             సమయం
 పేపర్-1        జనరల్ ఇంగ్లిష్            100               మూడు గంటలు
 పేపర్-2        జనరల్ స్టడీస్             100              మూడు గంటలు
 పేపర్-3        జనరల్ ఎకనామిక్స్-1    200            మూడు గంటలు
 పేపర్-4        జనరల్ ఎకనామిక్స్-2    200            మూడు గంటలు
 పేపర్-5        జనరల్ ఎకనామిక్స్-3    200            మూడు గంటలు
 పేపర్-6        ఇండియన్ ఎకనామిక్స్    200            మూడు గంటలు
 
 ఐఎస్‌ఎస్      సబ్జెక్ట్                       మార్కులు        సమయం
 పేపర్-1        జనరల్ ఇంగ్లిష్             100            మూడు గంటలు
 పేపర్-2        జనరల్ స్టడీస్              100            మూడు గంటలు
 పేపర్-3        స్టాటిస్టిక్స్-1                 200            మూడు గంటలు
 పేపర్-4        స్టాటిస్టిక్స్-2                 200            మూడు గంటలు
 పేపర్-5        స్టాటిస్టిక్స్-3                 200            మూడు గంటలు
 పేపర్-6        స్టాటిస్టిక్స్-4                 200            మూడు గంటలు
 
 ఐఈఎస్ / ఐఎస్‌ఎస్-2015 సమాచారం
 
 అర్హత: ఐఈఎస్- ఎకనామిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్‌లో పీజీ
 ఐఎస్‌ఎస్- స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో ఏదో ఒకటి ప్రధాన సబ్జెక్ట్‌గా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత (లేదా) స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ / అప్లైడ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లలో పీజీ ఉత్తీర్ణత.
 వయోపరిమితి: ఆగస్ట్ 1, 2015 నాటికి 21 నుంచి 30 ఏళ్లు
 
 ముఖ్య తేదీలు:
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 20, 2015
 పరీక్ష తేదీలు: మే 23, 2015 నుంచి
 తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రం: హైదరాబాద్
 వెబ్‌సైట్: www.upsconline.nic.in
 
 ఐఈఎస్/ఐఎస్‌ఎస్-2014 కటాఫ్ మార్కులు
 
 ఐఈఎస్/ఐఎస్‌ఎస్ 2014, 2013 రిక్రూట్‌మెంట్‌లలో సర్వీస్‌ల వారీగా 1000 మార్కులకు జరిగిన రాత పరీక్ష, 200 మార్కులకు నిర్వహించిన ఇంటర్వ్యూ ఆధారంగా రూపొందించిన తుది జాబితాలో జనరల్ కేటగిరీలో కటాఫ్ మార్కుల వివరాలు..
 
 2014 కటాఫ్స్
 సర్వీస్           రాత పరీక్ష        ఇంటర్వ్యూ       ఫైనల్
                                                           కటాఫ్

 ఐఈఎస్          389                  144          533
 ఐఎస్‌ఎస్         296                  166         462
 
 2013 కటాఫ్స్
 సర్వీస్            రాత పరీక్ష          ఇంటర్వ్యూ        ఫైనల్
                                                               కటాఫ్

 ఐఈఎస్            370                  157            527
 ఐఎస్‌ఎస్          283                  152            435
 
సిలబస్ పరిశీలన ముఖ్యం
ఐఎస్‌ఎస్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా ఆయా సబ్జెక్ట్ పేపర్ల సిలబస్‌ను పూర్తిగా పరిశీలించాలి. ప్రిపరేషన్ పరంగా ఇది ఎంతో ముఖ్యమైన అంశం. అదే విధంగా కచ్చితంగా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిచ్చే విధంగా ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించుకోవాలి. గణాంకాలు, డేటాలలో ఉండే సమాచారాన్ని డిస్క్రిప్టివ్ విధానంలో పొందుపరిచే విశ్లేషణ నైపుణ్యాలు అలవర్చుకోవాలి. ప్రతిరోజూ కనీసం 8 నుంచి 10 గంటల ప్రిపరేషన్‌తో సులువుగా విజయం సాధించొచ్చు.
 
 పంతంపల్లి అనిత
 ఐఎస్‌ఎస్ ట్రైనీ (17వ ర్యాంకు ఐఈఎస్/ఐఎస్‌ఎస్-2013)
 
 
టార్గెట్ 60 పర్సెంట్
ఐఈఎస్‌లో ఇంటర్వ్యూ కాల్ ఆశించాలంటే రాత పరీక్షలో 60 శాతం మార్కులు పొందే సంసిద్ధత సొంతం చేసుకోవాలి. ఎకనామిక్స్‌లోని బేసిక్ థీరమ్స్‌ను ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో చదివితే ‘బోర్’ అనే భావన కూడా వీడిపోతుంది. గత ప్రశ్నపత్రాల పరిశీలన, మాక్ టెస్ట్‌లు కూడా అనుకూలించే సాధనాలు. ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో వివరణకు, అంచెలవారీ సాధనకు ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్‌లో రీడింగ్‌తోపాటు ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 తోట సతీశ్ కుమార్
 అసిస్టెంట్ డెరైక్టర్
 (17వ ర్యాంకు ఐఈఎస్-2012)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement