న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురయినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే అత్యుత్తమ స్థాయిలో భారత్ ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర పేర్కొన్నారు. ’బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి’ అనే అంశంపై ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (డీఎస్‌ఈ), ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...
► 2013తో పోల్చితే ప్రస్తుతం పరిస్థితి ఎంతో మెరుగుపడింది. భారత్ ప్రస్తుతం పటిష్ట స్థానంలో ఉంది. దేశ ఆర్థిక మూలస్తంభాలు బలంగా ఉన్నాయి. ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా తట్టుకుని నిలబడగలిసే సమర్థ్యాన్ని సంబంధిత సూచీలు సూచిస్తున్నాయి.
► ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ విధాన వైఖరిని మహమ్మారి ప్రభావిత స్థితి నుంచి సాధారణ స్థితికి మార్చాలని యోచిస్తున్నాయి. సరళతర ద్రవ్య విధాన వైఖరి కొంత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాల ప్రభావం భారత్ పైనా ఉంటుంది. కొంత ఒడిదుడుకుల పరిస్థితి ఉంటుంది. అయితే దీనిని తట్టుకునే సామర్థ్యం భారత్‌కు ఉంది.
► ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) పరంగా చూస్తే, భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
► 2040 నాటికి భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనాలు ఉన్నాయి. బ్రిక్స్ దేశాలతో (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) కలిసి ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా ఉండేందుకు భారత్ తొలుత సిద్ధపడాలి.
► 2009–10లో బ్రిక్స్ ప్రారంభం అయిన తర్వాత పలు కీలక మైలురాళ్లను అధిగమించడం జరిగింది. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ), కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (లేదా సీఆర్‌ఏ), బ్రిక్స్ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం (2021–2025), బ్రిక్స్ పేమెంట్స్ టాస్క్ ఫోర్స్ (బీపీటీఎఫ్) వంటి కీలక వ్యవస్థల ఏర్పాటును ప్రస్తావించుకోవచ్చు.
మూడు దశల్లో దేశ వృద్ధి తీరు...
డిప్యూటీ గవర్నర్ వివరించిన దానిప్రకారం, జీడీపీ వృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి సూచికగా విస్తృతంగా వినియోగిస్తున్నారు. గత 75 ఏళ్లలో భారతదేశ వృద్ధి పథం మూడు దశల్లో సాగిందని భావించవచ్చు. 1970 దశకం చివరి వరకు భారతదేశం సగటు వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంది. హిందూ వృద్ధి రేటు అని కూడా దీనిని పిలిచేవారు. ఇది ఆ కాలంలో అవలంబించిన విధానాలతో ముడిపడి ఉంది. 1980–2002 వరకూ చూస్తే సరళీకరణ, ఆర్థిక వ్యవస్థ క్రమంగా అంతర్జాతీంగా ముడివడ్డం అంశాలతో వృద్ధి ధోరణి 5.5 శాతానికి చేరుకుంది.
2003 నుంచి 2020 మహమ్మారి సవాళ్లు ప్రారంభమయ్యే వరకూ వరకూ సగటు 7 వృద్ధి ఏడు శాతంగా ఉంది. 2020లో వృద్ధి క్షీణతలోకి మారింది. అయితే సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయికి భారత్ పురోగమించింది. భారతదేశంలో వృద్ధి చోదకాలు ఏమిటన్నది గమనించాలి. గృహ, ప్రైవేటు వినియోగం ఇక్కడ కీలకమైన అంశాలు. ఈ రెండింటి వాటా మొత్తం 1960 జీడీపీలో 75 శాతం. ఇటీవల 55 శాతానికి తగ్గింది. అయినప్పటికీ, జీడీపీలో ఈ రెండింటిపాత్రే కీలకం కావడం గమనార్హం. దేశంలో ఎగుమతులు, పెట్టుబడుల ప్రేరిత వృద్ధి ధోరణి పటిష్టం కావాల్సి ఉంది.
పటిష్ట రికవరీ బాటన ఎకానమీ: ఆర్‌బీఐ ఆర్టికల్
అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందని ఆర్‌బీఐ ఆర్టికల్ ఒకటి పేర్కొంది. తగిన ద్రవ్య, రుణ పరిస్థితులు ఇందుకు దోహపడుతున్నట్లు వివరించింది. అంతర్జాతీయంగా నెలకొన్ని ఉన్న సరఫరాల సమస్యలు, తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లు, కరోనా కేసులు కొన్ని దేశాల్లో పెరుగుతుండడం వంటి అంశాలను ఆర్‌బీఐ ప్రచురించిన ఆర్టికల్ ప్రస్తావించింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ దేశంలో రవాణా, ఉపాధి రంగాల్లో మంచి పురోగతి ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ అభిప్రాయాలు పూర్తిగా ఆర్టికల్ రాసిన రచయితలకు చెందుతాయని, వీటితో సెంట్రల్ బ్యాంక్ ఏకీభవించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment