ఇమ్యూనిటీని పెంచే చిలగడదుంప
గుడ్ ఫుడ్
ఉడకబెట్టుకొని తింటే అద్భుతంగానూ, నిప్పుల మీద కాల్చుకుని తింటే పరమాద్భుతంగానూ ఉండే చిలగడదుంప అంటే చాలామందికి ఇష్టమే. వేర్వేరు ప్రాంతాల్లో దీనికి గణుసుగడ్డ, మోరంగడ్డ అంటూ రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. కేవలం రుచి విషయంలోనే కాదు... ఆరోగ్యపరంగానూ దీని విశిష్టతలు ఎక్కువే.
►చిలగడదుంపలో విటమిన్–బి6 పాళ్లు పుష్కలం. విటమిన్–బి6 అనేది హోమోసిస్టిన్ అనే రసాయనం దుష్ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుండెజబ్బులు వచ్చేందుకు ఈ హోమోసిస్టిన్ కారణమవుతుంది. అంటే చిలగడదుంప వల్ల అనేక గుండెజబ్బులు నివారితమవుతాయని నిర్ద్వంద్వంగా తేలింది.
►చిలగడదుంపలో బీటా–కెరొటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి.
►చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తికి విటమిన్–సి బాగా దోహదపడుతుంది. అందుకే విటమిన్–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుందన్నమాట. చిలగడదుంపలోనూ విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. అందుకే దీన్ని తినేవారి చర్మం అంత త్వరగా ఏజింగ్ దుష్ప్రభావాలకు గురికాదు.
►చిలగడదుంపలో శరీరంలోని విషాలను బయటకు పంపే గుణం ఉంది. ఒత్తిడి వల్ల ఒంట్లో పేరుకునే విషాలను కూడా చిలగడదుంప తొలగిస్తుంది.
►చిలగడదుంపలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల ఒంట్లో రక్తహీనత తగ్గడంతో పాటు, తగినన్ని ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల ఉత్పాదన జరుగుతుంది.
►ఇందులోని మెగ్నీషియమ్ మన ఒంట్లోని ధమనులు, ఎముకలు, గుండె, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.