అశ్వత్థ నారాయణుడు | Importance of raavi tree | Sakshi
Sakshi News home page

అశ్వత్థ నారాయణుడు

Published Sun, May 20 2018 1:49 AM | Last Updated on Sun, May 20 2018 1:49 AM

Importance of raavi tree - Sakshi

ప్రకృతిలో ఉన్న వృక్షరాజాలలో రావి చెట్టు ఒకటి. ఇది దేవతావృక్షంగా పేరు పొందింది. అతి ప్రాచీనమైన రుగ్వేద మంత్రాలలో కూడా రావిచెట్టు ప్రస్తావన కనిపిస్తుంది. వృక్షాలలో తాను అశ్వత్థ వృక్షాన్నని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడంటే రావిచెట్టు ఎంతటి విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హిందూ మతంలోనే కాదు, బౌద్ధ. జైన మతాలలో కూడా రావిచెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మహిమాన్వితమైన వృక్షంగా పేరు పొందింది. బుద్ధుడు రావి చెట్టు కిందనే జ్ఞానం పొందాడు.

సంతానం లేనివారు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు స్వరూపిణే! అగ్రతశ్శివ రూపాయ వృక్షరాజాయతే నమః అని చదువుతూ రావిచెట్టు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేయడం శుభప్రదం. వైజ్ఞానిక పరంగా కూడా రావి గాలి వంటికి ఎంతో మంచిదని రుజువైంది. హోమంలో సమిధలుగా వాడేది రావి సమిధలనే. ఆయుర్వేదంలో రావిచెట్టుకు ఎంతో ప్రాధాన్యముంది. అనేక ఔషధాల తయారీలో విరివిగా ఉ పయోగిస్తారు. అయితే, రావిచెట్టును ఇంటి ఆవరణలలో పెంచకూడదని అంటారు.

కారణం రావి చెట్టు వేర్లు నేలలో బాగా లోతుకు చొచ్చుకుని పోయి, పునాదులను కూడా కదిలించి వేయగలగడమే. అందుకే ఇంటి ఆవరణలో ఎక్కడయినా రావిచెట్టు మొలిస్తే దానిని వెంటనే పెరికి వేస్తుంటారు. జాతకంలో శని, రాహు, కుజదోషాలున్నవారు ప్రతిరోజూ రావిచెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. కుజదోషం ఉన్నవారు రావిచెట్టు మొదలులో పచ్చిపాలు పోసి, తడిసిన మట్టిని నుదుట బొట్టుగా పెట్టుకోవడం మరిన్ని సత్ఫలితాలనిస్తుందంటారు.

రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు దానిని తాకరాదు. ఒక్క శనివారం మాత్రమే తాకాలని పెద్దలు చెబుతారు. రావిచెట్టును సంస్కృతంలో అశ్వత్థ వృక్షమని అంటారు. ఈ పవిత్ర వృక్షం పేరుమీదుగానే కొందరు అశ్వత్థ నారాయణ అని తమ పిల్లలకు పేరు పెట్టుకుంటారు. ప్రముఖ పౌరాణికుడు విదురుడు నాటిన అశ్వత్థవృక్షం విదురాశ్వత్థంగా ఇప్పటికీ పూజలందుకుంటున్న విషయం తెలిసిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement