కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాధి నిరోధకత పెంచుకోవడం ముఖ్యం. అలా పెంచుకోడానికి రోజులో తీసుకోవాల్సిన ఆహారాల తీరుతెన్నుల గురించి సక్షిప్తంగా తెలుసుకుందాం.
ఉదయం టిఫిన్‌లో...
మనం రోజూ ఉదయం లేవగానే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం కదా. అందుకు ఉపయోగించే ధాన్యాలు పొట్టు తీయనివై ఉండటం మనకు ఎంతో మేలు చేస్తాయి. ఉదాహరణకు చపాతీలు, పూరీల కోసం పొట్టుతీయని గోధుమలు, ఉప్మా కోసం కూడా పొట్టుతీయని గోధుమ రవ్వ వంటివి వాడాలి. పెసరట్ల కోసం కూడా పొట్టు తీయని పెసర్లు వాడటం మేలు.
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టీ : సాధారణంగా మనలో చాలామందికి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. అలా మనం తాగే టీ జింజర్ టీ అయితే మేలు. అల్లానికి ఓ విచిత్రమైన ఘాటు రుచీ, ఘాటు వాసన (ఫ్లేవర్) ఉంటుందన్నది మనకు తెలిసిన విషయమే. దీనికి కారణం అల్లంలో ఉండే జింజెరాల్ అనే స్వాభావికమైన రసాయనం. దాని వల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. జింజెరాల్ అనే ఆ శక్తిమంతమైన పదార్థంలో నొప్పి, వాపు, మంటను తగ్గించే (యాంటీఇన్‌ఫ్లమేటరీ) గుణంతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి.
మధ్యాహ్న భోజనం
మధ్యాహ్నం అన్నం పొట్టుతీయని ముడిబియ్యంతో వండిన అన్నం అయితే మంచిది. చపాతీలు అయితే పొట్టుతీయని పిండితో చేసినవి తీసుకోవాలి. ఇక రకరకాల రంగుల్లో ఉండే చాలారకాల కూరగాయలతో చేసిన కూరలను తీసుకోవాలి. కూరలన్నీ దాదాపుగా ఉడికించడం ద్వారా వండినవై ఉండాలి.
ఈవినింగ్ శ్నాక్స్ : ఇక సాయంత్రం వేళల్లో వేయించిన పల్లీలు, బాదంపప్పు మంచిది. కొవ్వు లేని పెరుగులో కొన్ని పండ్ల ముక్కలు వేసుకుని తినడం చాలా మంచిది. మొలకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) ఉడికించిన బఠాణీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.
రాత్రి భోజనం
రాత్రివేళ తినే భోజనంలో నూనెలు వీలైనంత తక్కువగా ఉండాలి. మధ్యాహ్నం లాగే పొట్టు తీయని ముడిబియ్యంతో వండిన అన్నం లేదా పొట్టుతీయని గోధుమపిండితో చేసిన చపాతీలు మంచివి. భోజనానికి ముందర గ్రీన్ వెజిటబుల్ సూప్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇక రాత్రి తినే భోజనంలో ఆకుకూరలు మేలు.
నీళ్లు : మన ఒంట్లోకి ఒకవేళ కరోనా వైరస్ చేరినా దాన్ని ప్రభావాన్ని నీళ్లు గణనీయంగా తగ్గిస్తాయి. పైగా ఇది మండువేసవి కావడం వల్ల సాధారణం కంటే కూడా ఎక్కువ నీళ్లు (అంటే రోజుకు కనీసం 4 లీటర్లకు తగ్గకుండా) తాగండి.
ఇవేగాక... అవిశగింజలూ, గుమ్మడి గింజలు కూడా చాలా మేలు చేస్తాయి. దానికి తోడు చిలగడదుంపల వంటివి ఉడకబెట్టుకుని లేదా కాల్చుకుని తినడం కూడా మంచిదే. ఇందులో విటమిన్–ఏ, విటమిన్–సి ఉండటంతోపాటు... అది మన శరీరంలో గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పాళ్లను పెంచుతుంది. గ్లూటాథయోన్‌ను ‘మాస్టర్ యాంటీఆక్సిడెంట్’ అంటారు. ఇది మన కణాల్లో పేరుకున్న విషాలను బయటకు పంపి, వాటిని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బెడ్ టైమ్‌లో: ఇక చివరగా గోరు వెచ్చని పాలు తాగి నిద్రకు ఉపక్రమించడం మంచిది. అయితే ఈ పాలు వెన్న తీసినవైతే మరింత మంచిది. పాలలోని ట్రిప్టొఫాన్ అనే పోషకం రాత్రి బాగా నిద్రపట్టేలా చేస్తుంది. మంచి నిద్ర వ్యాధి నిరోధకతను బాగా పెంచుతుంది.
వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి జింక్ మినరల్ చాలా ముఖ్యం. ఇది మాంసాహారం, చేపలు, గుడ్లు వంటి వాటితో పాటు పప్పు ధాన్యాలు, బీన్స్, నట్స్‌లో ఎక్కువ. అన్నిటికంటే ముఖ్యంగా... వ్యాధి నిరోధకత పెంపొందడానికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ సమకూరడానికి విటమిన్–డి ఎంతో అవసరం. ఈ రెండు ప్రయోజనాలూ ఒకేసారి కలగాలంటే లేత ఎండలో వ్యాయామం మంచిది.
పండ్లు
ఇక ఈ సీజన్‌లో దొరికే మామిడితో పాటు నిమ్మ, నారింజ, కమలాలు, బత్తాయిలు, జామ వంటి విటమిన్–సి ఎక్కువగా పండ్లను ఎక్కువగా తీసుకోండి. వీటిలో లభ్యమయ్యే విటమిన్–సి చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల రోగనిరోధకతను ఎంతగానో పెంచుతుంది. మీ ఆహారంలో ఉసిరిని ఏదో రూపంలో తీసుకోవడం చాలా మంచిది. నారింజ, బత్తాయి, జామ వంటివి తినే సమయంలో జ్యూస్ రూపంలో కాకుండా పండ్లనే తినడం మేలు.
జీనత్ ఫాతిమా
డైటీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment