ఉన్నితంగా...
మన్నిక
చలికాలంలో ఉన్ని దుస్తులు ఎంతో ఉపకరిస్తాయి. తలకు కట్టుకునే మఫ్లర్, స్వెటర్, గ్లౌజులు, సాక్సులు ఇలా ఎన్నో ఉన్ని వస్తువులను ఈ కాలంలో రోజూ ఉపయోగిస్తుంటారు. మరి వాటిని ఉతికేటప్పుడు మామూలు దుస్తుల్లా కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సరైన బ్రష్: ఉన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో వాషింగ్ మిషన్‌లో వేయకూడదు. ఆ దుస్తులకు తగ్గట్టుగా బ్రష్‌ను ఎంచుకోవాలి. అంతేకాదు ప్రతిరోజూ స్వెటర్‌లను ఉపయోగిస్తుంటారు కాబట్టి ఎక్కువ మురికి వాటిపై పేరుకుపోతుంది. అందుకే రెండు రోజులకోసారి వాటిని ఉతకడం ఆరోగ్యకరం.
మరకలు పోయేందుకు డ్రై క్లీన్: ఏదో ఒక సందర్భంలో ఉన్ని దుస్తులపై మరకలు పడుతూనే ఉంటాయి. వెంటనే వాటికి డ్రై క్లీనింగ్ చేయించాలి. మరీ అంత పెద్ద మరక కాదు అనుకుంటేనే చేతులతో ఉతకాలి. అదీ నాణ్యమైన సబ్బునే ఉపయోగించాలి.తీగలపై ఆరేయకూడదు: మిగతా దుస్తుల్లాగా ఉన్ని వాటిని తీగలపై ఆరేయకూడదు. అలా చేస్తే అవి సాగిపోయి ఆకారం మారే అవకాశం ఉంది. వీలైనంత వరకు వాటిని గోడలపైనో లేక టేబుళ్లపైనో ఆరేయడం మేలు. వాటికి వేడి కూడా ఎక్కువ తగలకుండా చూసుకోవాలి.