
హఠాత్తుగా ఈ రెండు మూడు రోజుల్లో క్రికెటర్‌లు ధోనీ, గౌతమ్ గంభీర్, అజింక్యా రహానే సోషల్ మీడియాలో ‘ఫామ్’లోకి వచ్చారు! వాళ్లతో పాటు సచిన్ టెండూల్కర్ కూడా!! అజింక్యా రహానేకు శనివారం కూతురు పుట్టింది. ఆ టైమ్‌కి అజింక్యా వైజాగ్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆట అయ్యాక భార్యతో, బేబీ గర్ల్‌తో ఒక ఫొటో దిగి, ట్విట్టర్‌లో పెట్టాడు. అది చూసి సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లోనే అజింక్యాను, అతడి భార్య రాధికను కంగ్రాచ్యులేట్ చేశాడు. అక్కడితో ఆగలేదు. ‘తొలి బిడ్డ పుట్టుక ఇచ్చే సంతోషం దేనికీ సరితూగనిది’ అన్నాడు. అక్కడితోనూ ఆగలేదు. ‘డైపర్స్ మారుస్తూ నైట్ వాచ్‌మన్‌గా కొత్త పాత్రను పోషించడంలోని ఆనందాన్ని అనుభవించు’ అని అజింక్యాను ఆహ్లాదపరిచాడు. ధోనీ తండ్రి మనసు కూడా అతడిని ట్విట్టర్‌లోకి నడిపించింది.
ధోనీ కూతురు జివా వయసు నాలుగున్నరేళ్లు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కి, జివాకు ఒకేలాంటి ఫ్యాషనబుల్ కళ్లద్దాలు ఉన్నాయి. ఏదో ఫొటోలో రణ్‌వీర్‌ను ఆ కళ్లద్దాలతో చూసింది జివా. వెంటనే, ‘‘నా కళ్లద్దాలను ఈయన ఎందుకు పెట్టుకున్నాడు?’’ అని తండ్రిని అడిగింది. ఆ వెంటనే పై గదిలో పెట్టిన తన కళ్లద్దాలు అక్కడ ఉన్నాయో లేవో చూసుకోవడానికి వెళ్లింది. అవి అక్కడే ఉండడం చూసి, ‘‘నావి నా దగ్గరే ఉన్నాయి’’ అని చెప్పింది. ఇకనేం తండ్రి హృదయం ఉప్పొంగింది! ఆ వయసులో నాకు అంత తెలివి ఉండేది కాదు అని రణ్‌వీర్ ఫొటోను, కూతురు ఫొటోను కలిపి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటోను చూసి రణ్‌వీర్.. ‘‘హాహాహా ఫ్యాషనిస్టా జివా’’ అని కామెంట్ పెట్టాడు.
అష్టమి రోజు గౌతమ్ గంభీర్ తన కూతుళ్ల కాళ్లు కడిగి తలపై చల్లుకున్నాడు. కాళ్లు కడుగుతున్నప్పటి ఫొటోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశాడు. ‘‘ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా నేను పెడిక్యూర్ (పాదాలకు బ్యూటీ ట్రీట్‌మెంట్)లో ప్రావీణ్యం సాధించాను అని మురిపెంగా కామెంట్ పెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment